రాష్ట్రీయం

బెంగళూరులో తెలు‘గోడు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ, మార్చి 3: ఇటుకలు మోసే రామక్క, మేస్ర్తి పనిచేసే ఓబులేసు, రోడ్లు ఊడ్చే సాలమ్మ, సోడాలు అమ్మే రాములు, కొబ్బరిబోండాం అమ్మే హనుమంతు, బట్టలు కుట్టే షాహీదా, రాళ్లు కొట్టే నారాయణ, హోటల్లో టీ అందించే బాషా... ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు బెంగళూరు మహానగరంలో ఎక్కడ చూసినా అనంతపురం జిల్లావాసులే కనిపిస్తున్నారు. కరవు తరమడంతో వీరంతా పొట్టచేతపట్టుకుని బెంగళూరుకు వలసవెళ్లారు. సుమారు 2 లక్షల మంది అనంతపురం జిల్లావాసులు గ్రీన్‌సిటీలో బతుకుబండి లాగుతున్నారు. రోజంతా కష్టపడి సంపాదించిన దాంతో కలోగంజో తాగి రూపాయి రూపాయి కూడబెట్టి ఇంటివద్ద ఉన్న తల్లిదండ్రులకు పంపుతున్నారు. నిత్యం కరవు కాటకాలతో సతమవుతున్న అనంతపురం జిల్లావాసులు బతుకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లడం పరిపాటిగా మారింది. నిత్యం వందలాది మంది ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో బెంగళూరుకు చేరుకుంటున్నారు. జిల్లాలోని హిందూపురం, గోరంట్ల, కదిరి, ధర్మవరం, రాయదుర్గం, కొత్తచెరువు, నల్లమాడ, బుక్కపట్నం, ముదిగుబ్బ, పుట్టపర్తి, పెనుకొండ, చెనే్నకొత్తపల్లి, మడకశిర తదితర ప్రాంతాలనుంచి వలసలు కొనసాగుతున్నాయి. బెంగళూరు మహానగరంలోని యలహంక, ఎలక్ట్రానిక్ సిటీ, సిరిపోడు, హంగసంద్ర, బ్యాంక్‌కాలనీ, హొస్కెరహళ్ళి, తోగూరు, సింగసంద్ర, మత్తికెర, హెబ్బాల్, మార్తళ్ళి, సిల్క్‌బోర్డ్ ప్రాంతాల్లో అత్యధికంగా అనంతపురం జిల్లావాసులే కనిపిస్తారు. వలసజీవుల్లో అనంతపురం జిల్లాతోపాటు చిత్తూరు, కడప, కర్నూలుతో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా తదితర రాష్ట్రాల వారు కూడా ఉన్నారు.
చదువురాని వారు, చదువుకున్న వారు సైతం వలసపోతున్నారు. అంతోఇంతో చదువుకున్నవారు చిన్నచిన్న కంపెనీలు, కార్యాలయాలు, అపార్ట్‌మెంట్ల వద్ద సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. చదువురాని వారు రోడ్లపై సోడాలు, కొబ్బరిబోండాలు అమ్ముతూ బతుకీడుస్తున్నారు. ఎక్కువమంది దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. ఏదోఒక పనితెలిసిన వారైతే పెద్దపెద్ద దుకాణాల్లో పనివారుగా, మహిళలు గార్మెంట్స్ పరిశ్రమల్లో పనికి వెళ్తున్నారు. వలసజీవుల్లో ఏఒక్కరిని కదిలించినా కన్నీటిపర్యంతమవుతూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. పంట సాగుకోసం చేసిన అప్పులు తీర్చేదారిలేక ఇలా వచ్చామని కొందరంటే, ఊళ్లలో వానల్లేవు, పనుల్లేవు, పిల్లలను ఎలా చదివించాల, తమనే నమ్ముకున్న అమ్మానాన్నలను ఎలా పోషించాల అందుకే గుండెభారంతో ఈడికొచ్చినాం అంటూ వలవల ఏడ్చారు. కాటికెళ్ళే వయసులో ఉన్న కన్నవారిని దగ్గరుండి చూసుకోవాల్సిన సమయంలో పిల్లలను వారికాడ ఇళ్ళకు కాపలాగా వదిలి బతుకుదెరువు కోసం బెంగుళూరుకు వచ్చినాం అనే వాళ్లే ఎక్కువమంది కనిపిస్తున్నారు.
బెంగళూరు మహానగరంలో వలస కూలీలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీకావు. ఉదయానే్న జేబులో చిల్లరుంటే ఓ టీ తాగి రోడ్లపైకి చేరుకుంటారు. ప్రధాన కూడళ్ళలో వేచిఉంటే ఎవరో ఒకరు వచ్చి పనికి తీసుకెళ్తే పని దొరికినట్టు, లేదంటే ఆరోజు పస్తులే. నెలలో పది నుంచి 15 రోజులు పని దొరకడం కూడా గగనమే. అర్ధాకలితో కాలం వెళ్లదీస్తూ పదో పరకో కూడబెట్టి ఇంటికాడ ఉన్న తల్లిదండ్రులకు పంపిస్తుంటారు. మరికొంతమంది ఇక్కడే చిన్నపాటి గదులు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. చిన్నపాటి ఇరుకు గదిలోనే నలుగురైదుగురు కలిసి ఉంటున్నారు. గది అద్దె రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఉంటోంది. నెలకు ఐదారువేలు సంపాదించేవారు ఓ నలుగురు కలిసి ఒక్కో గదిలో సర్దుకుపోతున్నారు. అద్దె చెల్లించలేని వారు రోడ్లు, ఫుట్‌పాత్‌లను నివాసాలుగా మార్చుకుంటున్నారు. పగలు పనికి వెళ్లడం, చీకటి పడగానే ఎక్కడైనా ఇసుక ఉన్న చోటు, ఖాళీ ప్రదేశాల్లో రాత్రి వేళల్లో నిద్రపోతుంటారు. తమ దుస్తులు, దుప్పట్లు భోజనం చేసే చిన్నచిన్న హోటళ్ళలో పరిచయం ఉన్నవారి వద్ద దాచుకుంటున్నారు. గతంలో ఒక్క కూలీకి రోజుకు రూ. 5 వందల వరకూ వచ్చేది. అయితే వలస కూలీలు అధికం కావడంతో ప్రస్తుతం రోజంతా పనిచేసినా రూ.3 వందల కంటే ఎక్కువ దక్కని పరిస్థితి. ఇక్కడ పని దోపిడీ సైతం జరుగుతోంది. గుంపుగా వెళ్తేనే కూలీ డబ్బు చెల్లిస్తున్నారని, ఒకరు, ఇద్దరు వెళ్తే పని చేయించుకున్న తరువాత కొట్టిమరీ తరిమేస్తున్నారని కూలీలు వాపోయారు. మేస్ర్తిలు సైతం కూలీ డబ్బులు ఎగ్గొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయని వలసజీవులు తమ బాధ వ్యక్తం చేశారు. కూలి డబ్బులు ఎక్కువ వస్తాయని ఎంతోఆశతో బెంగుళూరుకు వలసవచ్చిన వారికి మహానగరంలో సైతం కష్టాలు తప్పడం లేదు.

కూలీ ఎక్కువనే వచ్చాం
మా ఊళ్లో కన్నా ఇక్కడ కూలీ ఎక్కువ. అందుకే అమ్మ రత్నమ్మతో కలసి ఇక్కడ పనికి వచ్చాం. ఎద్దుల్ని మేపేందుకు నా భర్తను ఇంటికాడ వదిలి వచ్చాం. అప్పు తీర్చాలంటే అంతా కష్టపడాలికదా. ఇక్కడ మహిళా కూలీలను చులకనగా చూస్తారు. బాధలూ దిగమింగుతూ పనికివెళ్తున్నాం.
- రత్నమ్మ, గుమ్మఘట్ట మండలం, భూసంద్రం

చిత్రం..బెంగళూరు నగరంలోని హంగసంద్ర వద్ద పని కోసం వేచి ఉన్న అనంతపురం జిల్లా వాసులు