రాష్ట్రీయం

జలవనరులపై జనంలో చైతన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 7: జలవనరులపై జనచైతన్యం తీసుకువచ్చేందుకు గ్రామాల్లో ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ఇకపై ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆ ప్రాంతంలో వున్న జలవనరులపై మ్యాప్‌లతో కూడిన సచిత్ర ప్రదర్శనను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. జన్మభూమ గ్రామసభల నిర్వహణకు అడ్డంకి కల్గించేవారెవరైనా, ఎంతటివారైనా వారందరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఎస్‌పిలను ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగం పనికి అవరోధం కల్పించేవారు ఏ ఒక్కరినీ ఉపేక్షించరాదన్నారు. సంక్రాంతి సందర్భంగా వివిధ రకాల పోటీలు నిర్వహిస్తూ ఊరూరా ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు.
కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి గురువారం ఉదయం 7వేల మంది అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలు జిల్లాలో తన పర్యటన అనుభవాలను కూడా వివరించారు. జన్మభూమి-మాఊరు వంటి ప్రభుత్వం-ప్రజల సంయుక్త భాగస్వామ్యమున్న కార్యక్రమాన్ని ప్రజలు ప్రభుత్వ ప్రాధాన్యలతో అనుసంధానమయ్యే రీతిలో క్రమంగా మార్చాల్సిన అవసరం వుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో అట్టడుగు స్థాయి వరకు యంత్రాంగంలో ఒక ఏకరూప దృష్టి రావాల్సి వుందన్నారు. ఇందుకుగాను జన్మభూమి ముగింపులో వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉత్తమ పద్ధతులు పాటించినవారిని సత్కరించాలన్నారు. సంక్రాంతి ఉత్సవాలను గ్రామాల్లో ఏ విధంగా నిర్వహించాలో కూడా సిఎం స్వయంగా కొన్ని సూచనలు చేసారు. తెలుగువారికి పెద్ద పండుగలాంటి సంక్రాంతి పండుగను వివిధ రకాల పోటీలు, ప్రదర్శనలతో ఊరంతా ఉత్సవంలా జరుపుకోవాలని సూచించారు. గ్రామాల్లో వంట పోటీలు నిర్వహించాలన్నారు. మహిళలకు రంగవల్లుల పోటీలు, యువతరం కోసం క్రీడా పోటీలు పెద్దఎత్తున నిర్వహించాలన్నారు. ఇదే సందర్భంలో గ్రామాలను దత్తత తీసుకున్నవారిని సన్మానించాలన్నారు. అందుబాటులో వున్న నీటి వనరులను ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాతో పోల్చి సరిచూసుకోవాలన్నారు. బ్యాంకులో డబ్బులు ఏ విధంగా అయితే విత్‌డ్రా చేయటం ద్వారా తగ్గిపోతుంటాయో అదే రీతిలో భూగర్భ జలాలను వాడుకునే కొద్దీ తగ్గిపోతుంటాయని, నీరు అడుగంటిపోయి ప్రత్యామ్నాయాలపై ఆధారపడటం ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లటం లాంటిదని సిఎం వివరించారు. సచిత్ర ప్రదర్శనల ద్వారా ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పవచ్చన్నారు. జన్మభూమి సభల్లో ప్రజల్లో ఉత్సాహం బాగా కన్పిస్తున్నదని ఇలాంటి సభల వల్ల ఎలాంటి సమస్యలైనా పరిష్కారం కాగలవనే ఆలోచనతో ప్రజలు ముందుకు రావటం శుభ పరిణామమన్నారు.
జన్‌ధన్ యోజన బ్యాంకు అకౌంట్లను సక్రమంగా వినియోగంలో వుంచితే రూ.5వేల వరకు రుణం లభిస్తుందని, అత్యవసరం అయినప్పుడు దాన్ని వినియోగించుకోవటం ద్వారా అధిక వడ్డీకి ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు తీసుకోవటాన్ని నిరోధించవచ్చని సిఎం చంద్రబాబు అన్నారు.

కోడి పందాలను అడ్డుకోండి

ఏపి సర్కారును ఆదేశించిన హైకోర్టు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 7: వచ్చే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగ్‌లతో కూడిన కోడి పందాలను నిర్వహించకుండా గట్టి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా అఫిడవిట్ సమర్పించిన నేపథ్యంలో, ఈ అంశంపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కోడి పందాలు జరగకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆంధ్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోంస్లే, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసనం జారీ చేసింది.
బెట్టింగ్‌తో కూడిన కోడి పందాల నిర్వహణకు అనుమతించరాదని, గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎన్ జగదీష్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. కోర్టు ఉత్తర్వులు అమలులో ఉన్నా, రాష్ట్రప్రభుత్వం మాత్రం కోడి పందాలను నిరోధించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశంపై ఆంధ్రప్రభుత్వం కోర్టులో గురువారం కోడి పందాలను నిరోధించేందుకు తీసుకునే చర్యలపై నివేదికను సమర్పించింది. కోడి పందాలను నిర్వహించే గాంబ్లర్లను గుర్తించి చర్యలు తీసుకుంటామని నివేదికలో పేర్కొంది. కోళ్లకు కట్టే కత్తులను తయారు చేసే వారిపై నిఘా ఉంచి వారు కత్తులు తయారు చేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కోళ్లను పెంచేవారిపై కూడా బైండోవర్ కేసులను నమోదు చేస్తామన్నారు. దాదాపు 1347 మంది వ్యక్తులను గుర్తించామని కోర్టుకు తెలిపారు. కోడి పందాలు ఆడరాదని ప్రచారం చేస్తున్నామన్నారు. ఈ అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత హైకోర్టు కోడి పందాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.