రాష్ట్రీయం

చరిత్ర నుండి గుణపాఠాలు నేర్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 6: భారతదేశ చరిత్ర నుండి వెనుకటి రాజులూ, ప్రభుత్వాలు గుణపాఠాలు నేర్చుకోలేదని అందువల్లే వైఫల్యం చెందారని ఆంధ్రభూమి ఎడిటర్ ఎంవిఆర్ శాస్ర్తీ పేర్కొన్నారు. చారిత్రక నవలా చక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ రాసిన ‘కాకతీయ కళా దర్శనం’ సిద్ధాంత గ్రంథావిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంవిఆర్ శాస్ర్తీ గ్రంథాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ పూర్వ చరిత్ర నుండి ఆధునిక చరిత్ర వరకూ అనే్వషణ మొదలుపెడితే, మనం చరిత్రగా అనుకుంటున్నదంతా తప్పుడు చరిత్ర మాత్రమేనని, వాస్తవం దానికి భిన్నంగా ఉంటుందని , తప్పుల తడక చరిత్రను కూడా చరిత్రకారులు అంతా కలిసి స్థిరీకరించలేకపోయారని చెప్పారు. చరిత్ర అర్థం కాకపోతే మనం ఎవరమో తెలియదని, ఏ తప్పులు చేశామో తెలియదని అన్నారు. అది తెలియకుంటే అవే తప్పులు మళ్లీ మళ్లీ చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఒకప్పుడు దాదాపు యావదాంధ్ర దేశానికి, కొంతవరకు దక్షిణాపథానికి ఏకఛత్రాధిపత్యం వహించిన కాకతీయ మహా సామ్రాజ్యం ఎందుకు పతనమైందో ఆలోచిస్తే ఈ విషయం విస్పష్టమవుతుందన్నారు. భారతదేశంలో గొప్ప చక్రవర్తులు అంతా పతనమవటానికి కారణం అతి మంచితనానికి పోయి, కుటిలాత్ముల పట్ల తగని ఔదార్యం చూపటం, అధర్మపరులైన క్రూరులతో ధర్మయుద్ధ నియమాలను అమాయకంగా పాటించి, వారి నుంచి రాగల ముప్పును సకాలంలో కాచుకోకపోవటమేనని అన్నారు. రెండవ ప్రతాపరుద్రుడి పరాజయానికి ఇది వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పుస్తక రచయిత గురించి ప్రస్తావిస్తూ, ముదిగొండ శివప్రసాద్ ఒక కర్మాగారమని ఎంవిఆర్ శాస్ర్తీ పేర్కొన్నారు. నోరి నరసింహశాస్ర్తీ, అడవి బాపిరాజులతో సరితూగే రీతిలో ముదిగొండ రచనలు ఉంటాయని అన్నారు. కాకతీయ కళాదర్శనం ఇంతకుముందు శివప్రసాద్ రచించిన చారిత్రక నవలలకు భిన్నంగా సిద్ధాంత గ్రంథమని, అకడమిక్‌గానే చెప్పినా సామాన్య పాఠకులను ఆకట్టుకునే రీతిలో దీనిని ప్రామాణికంగా రాశారని చెప్పారు. కాకతీయుల చరిత్రపై ఎంతో మంది రచయితలు కొన్ని కొన్ని విషయాలను ఎక్కడైతే విబేధించారో వాటిని స్పృశిస్తూ, సమన్వయం చేస్తూ ఈ గ్రంథాన్ని మలిచారన్నారు. తెలుగుజాతి గర్వించదగ్గ కాకతీయుల చరిత్రను, కళాసంస్కృతి, సామాజిక రంగాల్లో వారు సాధించిన చిరస్మరణీయమైన ఘనతను సహేతుకంగా, తిరుగులేని సాక్ష్యాధారాలతో వివరించే ఈ గ్రంథాన్ని ప్రోత్సహించి ప్రజాసామాన్యంలోకి దీనిని తీసుకు వెళ్లటానికి తెలుగు విశ్వవిద్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు కృషి చేయాలని అన్నారు. తెలంగాణ పునరుజ్జీవనానికి ఈ గ్రంథం ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. ఈ గ్రంథాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి అంకితమిచ్చారు.
అంతకుముందు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ విలువలు, ప్రమాణాలకు, నిబద్ధతకు కట్టుబడి అంకితభావంతో పనిచేస్తున్న సంపాదకుల్లో ఎంవిఆర్ శాస్ర్తీ ముఖ్యులని అన్నారు. జగమెరిగిన రచయిత ముదిగొండ శివప్రసాద్ అని పేర్కొన్నారు. కరీంనగర్‌లో తెలుగు విశ్వవిద్యాలయం కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్టు ఆయన చెప్పారు.
యుజిసి సభ్యుడు ప్రొఫెసర్ జి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ చారిత్రక అంశాలను వెలుగులోకి తీసుకురావడం ముదావహమని అన్నారు. పాశ్చాత్యసిద్ధాంతకర్తలను చదివినంతగా భారతీయ సిద్ధాంత కర్తలను మనం అధ్యయనం చేయడం లేదని పేర్కొన్నారు.
రచయిత ముదిగొండ శివప్రసాద్ మాట్లాడుతూ చరిత్ర సెమినార్‌లా గ్రంథావిష్కరణ కార్యక్రమం జరిగిందని అన్నారు. పదేళ్లపాటు ఈ గ్రంథాన్ని రాశానని, అందుకు వందలాది శాసనాలను అధ్యయనం చేశానని చెప్పారు. అటు దౌలతాబాద్, ఇటు రామేశ్వరం వరకూ వెళ్లి శాసనాలను గుర్తించామని తెలిపారు. ఈ గ్రంథంలో కాకతీయుల సాహిత్యం, సంగీతం, నృత్యరూపాలు, శిల్పం, చిత్రలేఖనం, చరిత్రకు సంబంధించి వివరాలున్నాయని, ఇప్పటికీ కాకతీయుల వంశీకుడు భంజదేవ్ దంతేవాడలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ సత్తిరెడ్డి , కినె్నర ఆర్ట్సు ఎం రఘురాం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎంవిఆర్ శాస్ర్తీని , ప్రొఫెసర్ గోపాలరెడ్డిని ఎస్వీ సత్యనారాయణ సత్కరించగా, గ్రంథ రచయిత ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్‌ను గోపాల్‌రెడ్డి సత్కరించారు.

చిత్రం..సోమవారం హైదరాబాద్‌లో ముదిగొండ శివప్రసాద్ రాసిన ‘కాకతీయ కళా దర్శనం’ సిద్ధాంత
గ్రంథావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఆంధ్రభూమి ఎడిటర్ ఎంవిఆర్ శాస్ర్తీ