రాష్ట్రీయం

‘గ్లోబల్ గివింగ్స్’ బోగస్ భాగోతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 9: గుంటూరు కేంద్రంగా కుట్టుశిక్షణ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అమాయకులను వంచిస్తున్న గ్లోబల్ గివింగ్స్ సంస్థ బోగస్ అని తేలింది.. గుంటూరు హిమనినగర్ ఒకటోలైన్‌లో సంస్థ గత ఏడాది క్రితం లావాదేవీలు ప్రారంభించింది.. నెల్లూరుకు చెందిన ఖాసిం బాషా ఏపి ఇన్‌చార్జిగా, చెన్నైకు చెందిన రాణి అనే మహిళ ప్రాజెక్టు ఇన్‌చార్జిగా, కృష్ణాజిల్లా వీరులపాడుకు చెందిన కనపర్తి రమాదేవి మేనేజింగ్ పార్ట్‌నర్లుగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ కార్యకలాపాలకు నెల్లూరుకు చెందిన షేక్ నూర్‌బాషా సహకరిస్తున్నాడు. వీరంతా పథకం ప్రకారం గత ఏడాది సెప్టెంబర్ 11వ తేదీన గుంటూరు ఆర్టీసి బస్‌స్టేషన్ ఎదురుగాగల స్వగృహ హోటల్‌లో ఇంటర్‌వ్యూలు నిర్వహించి కోఆర్డినేటర్లను ఎంపిక చేశారు. వీరు ఒక్కో గ్రూపులో 25 మందిని సభ్యులుగా చేర్చాలి. సభ్యులు నెలకు రూ. 500 చొప్పున ఆరు నెలల శిక్షణా కాలానికి 3వేలు చెల్లించాలనే నిబంధన పెట్టారు. అంతేకాదు నాలుగు నెలలు చెల్లించిన అనంతరం సభ్యులకు టైలరింగ్‌లో శిక్షణ పొందే వారికి 10వేల రూపాయల ఆర్థిక సహకారంతో పాటు సింగర్ కంపెనీ కుట్టుమిషన్‌ను అందజేస్తామని నమ్మించారు. ఆపై ప్రతి నెలా వెయ్యి రూపాయలు చెల్లించేలా సంస్థ నియమ, నిబంధనలను రూపొందించారు. గుంటూరు యాక్సిస్ బ్యాంక్‌లో ఖాతాను తెరిచారు. కోఆర్డినేటర్లకు రూ. 6వేల నెలసరి వేతనం, టైలరింగ్ శిక్షణ ఇచ్చే వారికి కొంత నగదును ప్రోత్సాహకాలుగా అందిస్తామని ప్రకటించారు. అమాయక నిరుద్యోగులు కోఆర్డినేటర్లుగా చేరారు. ఈ రకంగా విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో 264 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల్లో మొత్తం 6394 మంది సభ్యులుగా చేరారు. వీరి నుంచి మొత్తం కోటీ 5లక్షల 73వేల 400 రూపాయలు వసూలు చేశారు. అయితే నాలుగు నెలలు గడిచినా కుట్టుమిషన్లు, సర్ట్ఫికెట్లు ఇవ్వక పోవటంతో అనుమానమొచ్చిన సభ్యులు కొందరు ఆరా తీశారు. నల్లపాడు పోలీసుస్టేషన్‌లో ఓ సభ్యురాలి ఫిర్యాదుతో డొంకంతా కదిలింది. నిర్వాహకులు పరారయ్యే ప్రయత్నంలో అర్బన్ ఎస్‌పి సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలో అడిషనల్ ఎస్‌పి జె భాస్కరరావు, సౌత్ డిఎస్‌పి బి.శ్రీనివాసరావు, జెవి సంతోష్, సిసిఎస్ సిఐలు పి.శ్రీనివాస్, మధుసూదనరావు, వెంకటేశ్వరరావు, నగరంపాలెం, నల్లపాడు, కొత్తపేట సిఐలు శ్రీధర్‌రెడ్డి, కె.శ్రీనివాసరావు, ఎన్.శ్రీకాంత్‌బాబు ఆధ్వర్యంలో సిబ్బంది విజయవాడ రైల్వేస్టేషన్‌లో గురువారం అరెస్టుచేశారు. వీరి వద్ద నుంచి 44లక్షల 11వేల నగదు, 316 గ్రాముల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇతర డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చిత్రాలు.. గ్లోబల్ గివింగ్స్ సంస్థ నిర్వాహకులను అరెస్టుచేసి, వారి నుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకున్న గుంటూరు అర్బన్ పోలీసులు