రాష్ట్రీయం

ప్రమాదంలో పోలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవీపట్నం, మార్చి 9: తూర్పు గోదావరి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం నిబంధనలకు విరుద్ధంగా గోదావరిలో ఇసుక తవ్వేస్తున్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన దేవీపట్నం మండలం అంగళూరు గ్రామం నుండి కొత్తగా నిర్మించిన పునరావాస కాలనీ వరకు పొక్లెయినర్లతో ఇసుకను తవ్వి, టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ఈ తవ్వకాలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ఎర్త్-కమ్-రాక్ ఫిల్ డ్యాంకు అతి సమీపంలోనే జరుగుతుండటంతో ఇంజనీరింగ్ అధికార్లలో సైతం ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే నిర్మాణ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పలుకుబడి కారణంగా వారెవరూ పెదవి విప్పడంలేదు.
పోలవరం ఎడమ కాలువపై సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద రూ.1638 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. తొమ్మిది నెలల కాలంలో పూర్తిచేసి, గోదావరి జలాలను జిల్లాలోని మెట్టప్రాంతమైన పిఠాపురం పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు మండలాలతోపాటు విశాఖ జిల్లాకు తరలించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా పనులు మొదలయ్యాయి. అయితే ఈ నిర్మాణానికి అవసరమైన ఇసుకను నిర్మాణ సంస్థలు ఎటువంటి అనుమతులు లేకుండా ఏజెన్సీలోని గోదావరిలో తవ్వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన ఎర్త్-కమ్-రాక్‌ఫిల్ డ్యాం నిర్మించే సమీపంలోనే ఇసుక తవ్వి, తరలిస్తున్నారు. ప్రాజెక్టు పవర్‌హౌస్ నిర్మాణ ప్రాంతం, ర్యాక్‌ఫిల్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో 10 నుండి 20 మీటర్ల లోతున ఇసుకను పొక్లెయినర్‌తో తవ్వి, దేవీపట్నం మండలంలోని నేలకోట వద్ద నిర్మాణంలో ఉన్న ‘శ్యాడిల్ డ్యాం’ ప్రాంతానికి తరలించి, నిల్వ చేస్తున్నారు. సుమారు 50-60 లారీలతో తరలిస్తున్నారు. గత పది రోజుల నుండి జరుగుతున్న ఈ తవ్వకాల్లో లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వచేశారు. ఈ తవ్వకాలవల్ల ప్రాజెక్టు రాక్‌ఫిల్ డ్యాంకు ప్రమాదం జరగవచ్చని ఇంజనీరింగ్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్టస్థ్రాయిలో పెద్దల సహకారం కాంట్రాక్టు సంస్థలకు ఉండటంతో కిందిస్థాయి అధికారులు వౌనంగా ఉండిపోతున్నారు.
సాధారణంగా జిల్లాలో ఎక్కడ ఇసుక తవ్వాలన్నా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీ అనుమతి పొందాల్సివుంది. జిల్లాలో ఆమోదం పొందిన ఇసుక రీచ్‌లన్నీ రాజమహేంద్రవరం, అమలాపురం డివిజన్లలో మాత్రమే ఉన్నాయి. రంపచోడవరం డివిజన్ పరిధిలో ఎక్కడా ఇసుక తవ్వకాలకు జిల్లా కమిటీ అనుమతివ్వలేదు. విచిత్రమేమిటంటే దేవీపట్నం మండలంలో గతంలో అగ్రహారం మూలపాడు శ్యాండ్ మిక్సింగ్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ గిరిజన సొసైటీకి ఇసుక తవ్వకానికి జిల్లా కలెక్టర్ అనుమతిచ్చారు. అయితే జాతీయపార్కు ప్రాంతం ఉన్నందున ఇక్కడ ఇసుక తవ్వకాలు నిషేధమని అటవీ శాఖ అధికార్లు పేర్కొనడంతో రెండు నెలల అనంతరం అనుమతి రద్దుచేశారు. ఏజెన్సీలో ఇలాంటి నిబంధనలుండగా పురుషోత్తపట్నం నిర్మాణ సంస్థకు లక్షల టన్నుల ఇసుక తవ్వకానికి ఎవరు అనుమతిచ్చారనేది ప్రశ్నార్థకం. వాస్తవానికి ఇపిసి పద్ధతిలో కాంట్రాక్టు దక్కించుకున్న నిర్మాణ సంస్థలు నిర్మాణానికి అవసరమైన ముడి సామాగ్రి వారే తెచ్చుకోవాలి. కానీ గోదావరిలో రూ.కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
ఈ విషయమై పోలవరం ప్రాజెక్టు ఇఇ రమేష్‌బాబును సంప్రదించగా పోలవరం ప్రాజెక్టు ఏరియాలో ఇసుక తవ్వకాలు జరపరాదన్నారు. దేవీపట్నం తహసీల్దార్ సురేష్‌బాబును వివరణ కోరగా నిర్మాణ సంస్థ ఇసుక తవ్వకాలకు అనుమతి కోరారని, దాన్ని తాము ఉన్నతాధికార్లకు నివేదించామని, అయితే ఎటువంటి అనుమతులు రాకుండానే తవ్వకాలు జరిగిపోతున్నాయన్నారు.

చిత్రం..అంగళూరులో గోదావరి నది నుండి యంత్రాలతో ఇసుక తవ్వుతున్న దృశ్యం