రాష్ట్రీయం

భూమా కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, మార్చి 12: కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి (53) ఆదివారం ఆకస్మికంగా కన్నుమూశారు. ఆళ్లగడ్డలోని తన స్వగృహంలో ఉదయం 8.30 గంటలకు ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12:15 గంటలకు మరణించారు. నాగిరెడ్డికి గతంలోనూ రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఆయనకు ఎమ్మెల్యే అఖిలప్రియతోపాటు మరో కుమార్తె వౌనిక, కుమారుడు జగద్విఖ్యాతరెడ్డి ఉన్నారు. ఆయన భార్య శోభానాగిరెడ్డి మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. భూమా అంత్యక్రియలు సోమవారం ఆళ్లగడ్డలో జరుగుతాయి. భూమా మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంఅతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూమా గుండెపోటుకు గురయ్యారని తెలిసిన వెంటనే జిల్లాలోని రాజకీయ నాయకులు, కార్యకర్తలు, సహచరులు నంద్యాల ఆసుపత్రికి తరలివచ్చారు. మరింత మెరుగైన చికిత్స అందించేందుకు భూమాను హైదరాబాద్‌కు తరలించే ఉద్దేశంతో సిఎం చంద్రబాబు నంద్యాలకు హుటాహుటిన హెలికాప్టర్
పంపించారు. అయితే ఈలోగానే భూమా కన్నుమూశారు.
ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలోని దొర్నిపాడు మండలం డబ్ల్యు.కొత్తపల్లె భూమా స్వస్థలం. 1964 జనవరి 8న జన్మించిన భూమా చిన్నప్పటినుంచీ చదువులో చురుగ్గా ఉండేవారు. బెంగళూరులో ఎంబిబిఎస్ చదువుతూ తండ్రి హత్యకు గురి కావడంతో చదువును అర్థంతరంగా చాలించి, వెనక్కు వచ్చేశారు. రాజకీయాల్లో ఆయన ప్రస్థానం సింగిల్‌విండో అధ్యక్షుడిగా మొదలైంది. మూడుసార్లు నంద్యాల ఎంపిగా, రెండుసార్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా, 2014లో నంద్యాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాలనుంచి పోటీ చేసిన అప్పటి ప్రధాని పివి నరసింహారావుపై పోటీ చేయడంతో భూమా నాగిరెడ్డి పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్‌కు, ఆ తర్వాత చంద్రబాబుకు ఆయన అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. అయితే 2009లో భూమా దంపతులు చంద్రబాబుతో విభేదించి, ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా శోభ విజయం సాధించగా, నంద్యాల ఎంపి స్థానానికి పోటీ చేసిన భూమా పరాజయం పాలయ్యారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో భూమా దంపతులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా, శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే పోలింగ్‌కు ముందే శోభ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆ ఎన్నికల్లో ఇద్దరూ గెలిచారు. శోభ మృతి కారణంగా జరిగిన ఉప ఎన్నికలో ఆమె కుమార్తె అఖిలప్రియ పోటీ చేసి, విజయం సాధించారు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ వైకాపాలో ఇమడలేక, తిరిగి టిడిపిలో చేరారు.
భూమా నాగిరెడ్డి గతంలోనే తన కళ్లను దానం చేశారు. ఈ మేరకు ఆదివారంనాడు వైద్యులు భూమా కళ్లను సేకరించారు. అనంతరం భూమా పార్థివదేహాన్ని ఆసుపత్రి నుంచి నంద్యాల పట్టణంలోని శ్రీనివాససెంటర్‌లో ఉన్న స్వగృహానికి చేర్చారు. అక్కడ పట్టణ ప్రజలు, అభిమానుల సందర్శనార్థం సాయంత్రం 4 గంటల వరకూ ఉంచారు. అనంతరం ఆళ్లగడ్డలోని స్వగృహానికి తరలించారు. ఆయన అంత్యక్రియలకు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పార్థివదేహం. నివాళులర్పిస్తున్న తెలుగుదేశం యువనేత లోకేష్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు