రాష్ట్రీయం

సంక్షేమ పద్దు పొడిచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017-18) రూ.1,49,646 కోట్లతో బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రతిపాదించిన బడ్జెట్‌కంటే రూ.19వేల 230 కోట్లు ఎక్కువ. కేంద్రం మార్గదర్శనం మేరకు ఈసారి బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల్లో మార్పులు చేశారు. వాటి స్థానంలో నిర్వహణ, ప్రగతి పద్దులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. శాసనసభలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి మిగులు బడ్జెట్ ప్రవేశపెడుతూ వచ్చిన ప్రభుత్వం, నాల్గవసారీ రూ.4,571 కోట్ల రెవిన్యూ మిగులు చూపించింది. అలాగే ద్రవ్య లోటు రూ.26,096 కోట్లుగా ప్రతిపాదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ.1,49,646 కోట్లు. ఇందులో నిర్వహణ వ్యయం రూ.61,607.20 కోట్లు, ప్రగతి పద్దు 88,038.80 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి రాజేందర్ మాట్లాడుతూ గత మూడు బడ్జెట్‌ల మాదిరిగానే ఈసారీ సంక్షేమం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ, అణగారిన ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా బడ్జెట్ రూపొందించినట్టు చెప్పారు. తెలంగాణ గత వైభవాన్ని పునరుద్ధరించే బృహత్ బాధ్యతను ప్రజలు తమ ప్రభుత్వంపై మోపారని ఈటల అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఎనిమిది నెలల్లో పన్నుల ద్వారా సమకూరిన రాష్ట్ర ఆదాయం 19.61 శాతం వృద్ధిరేటుతో దేశంలో చాలా రాష్ట్రాలకంటే ఎక్కువగా ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గినప్పటికీ, ఇతర పన్నుల ద్వారా సమకూరే ఆదాయం పెరగడంవల్ల వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేయగలిగామన్నారు. ఇలాఉండగా సిఎం కె చంద్రశేఖర్‌రావు ఇటీవల కాలంలో చెప్పిన విధంగానే సంక్షేమ రంగానికి బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది. బడ్జెట్‌లో అత్యధికంగా సంక్షేమ రంగానికి రూ.36,853.79 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో అయితే ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రతిపాదించిన మొత్తాన్ని ప్రత్యేక అభివృద్ధి నిధి కింద చూపెట్టింది. దీంట్లో ఎస్సీ సంక్షేమానికి రూ.14,375 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.8165 కోట్లు కేటాయించింది. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.5070 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.1249 కోట్లు కేటాయించింది. ఆసరా పెన్షన్ల కోసం రూ.5330 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.1939 కోట్లు, బ్రాహ్మణ పరిషత్‌కు రూ.100 కోట్లు, జర్నలిస్టుల సంక్షేమానికి రూ.30 కోట్లు, నారుూ బ్రాహ్మణులు, రజకుల సంక్షేమానికి రూ.500 కోట్లు ప్రతిపాదించింది.
రెండో ప్రాధాన్యతగా నీటిపారుదల రంగానికి రూ.23,675 కోట్లు కేటాయించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.14,723 కోట్లు, విద్యకు రూ.12,705 కోట్లు, వ్యవసాయానికి రూ.5942 కోట్లు కేటాయించి ఇందులో రూ.4 వేల కోట్లను రైతుల పంట రుణ మాఫీ నాల్గవ వాయిదా చెల్లింపునకు కేటాయించింది. పట్టణాభివృద్ధికి రూ.5,599 కోట్లు, వైద్య, ఆరోగ్య రంగానికి రూ.5976 కోట్లు, రోడ్లు, భవనాలకు రూ.5,033 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.4,203 కోట్లు, శాంతి భద్రతలకు రూ.4,828 కోట్లు, మిషన్ భగీరథకు రూ.3000 కోట్లు, ఐటీ శాఖకు రూ.252 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.985 కోట్లు, పర్యాటక, సాంస్కృతిక శాఖకు 198 కోట్లు, హరితహారానికి రూ.50 కోట్లు కేటాయించింది.
బడ్జెట్‌లో ప్రకటించిన వరాలు
బడ్జెట్‌లో ప్రభుత్వం కొన్ని వరాలు ప్రకటించింది. నిరుపేద కుటుంబాలలో ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించడానికి ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి పథకానికి ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.51 వేలను రూ.75,116కు పెంచింది. అలాగే గర్భిణిలకు మూడు విడతలలో రూ.12 వేలు చెల్లించనున్నట్టు ప్రకటించింది. పుట్టిన బిడ్డ సంరక్షణకు 16 వస్తువులతో ‘కెసిఆర్ కిట్’గా నామకరణం చేసి, దీనికి రూ.605 కోట్లు కేటాయించింది. నారుూ బ్రాహ్మణులు, రజక వృత్తులకు ఆర్థిక సాయం అందించడానికి రూ.500 కోట్లు కేటాయించింది. అలాగే బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాల (ఎంబిసి) ఆర్థిక సహాయ సంస్థకు రూ.1000 కోట్లు కేటాయించటం ఈ బడ్జెట్‌లో ప్రకటించిన వరాలు. కాగా ప్రభుత్వ ప్రతిష్ఠాకర డబుల్ బెడ్ రూమ్ ఉచిత ఇళ్ల నిర్మాణ పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించక పోవడం గమనర్హం, కాగా ఈ పథకానికి బడ్జెటేతర మార్గాల ద్వారా (రుణం) నిధులు కేటాయించినట్టు పేర్కొంది.

ముఖ్యాంశాలు

సంక్షేమ రంగానికి రూ.36,853 కోట్లు
నీటిపారుదలకు రూ.23,675 కోట్లు
గ్రామీణ, పంచాయతీరాజ్‌కు 14,723 కోట్లు
విద్యారంగానికి రూ.12,705 కోట్లు
వైద్యరంగానికి రూ.5,976 కోట్లు
వ్యవసాయ రంగానికి రూ.5,942 కోట్లు
పట్టణాభివృద్ధికి రూ. 5,599 కోట్లు
రోడ్లు, భవనాలకు రూ.4,828 కోట్లు
విద్యుత్ రంగానికి రూ.4,203 కోట్లు
కళ్యాణ లక్ష్మికి ఇక రూ.75 వేలు
గర్భిణులకు రూ.12 వేల ఆర్థిక సాయం
కెసిఆర్ కిట్ పథకానికి రూ.605 కోట్లు

చిత్రం..బడ్జెట్ ప్రతిపాదనలు సభకు వివరిస్తున్న ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్