రాష్ట్రీయం

మానవతావాది భూమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 14: అకాల మరణానికి గురైన నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి మానవతావాది. ప్రత్యర్థుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన సోదరుల పిల్లలను సైతం తన సొంత పిల్లలతో సమానంగా చూస్తూ, వారికోసం పాటుబడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. మధ్యలో స్వల్ప విభేదాలు చోటుచేసుకున్నా భూమా, ఎస్వీ సుబ్బారెడ్డి కుటుంబాలు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూవచ్చాయన్నారు. భూమా కుటుంబానికి అండదండలు అందిస్తాననీ, ఆయన పిల్లలకు తండ్రిగా నిలుస్తాననీ గద్గద స్వరంతో హామీనిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రస్తుతం ఎలాంటి హామీలు ఇవ్వలేకపోతున్నప్పటికీ నంద్యాలను కుప్పం నియోజకవర్గం కంటే బాగా తీర్చిదిద్దుతానని చెప్పారు. శాసనసభలో మంగళవారం భూమా నాగిరెడ్డి మృతి పట్ల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు చివరిలో స్పీకర్ నుంచి ప్రత్యేక అనుమతితో మరోసారి ప్రసంగించారు. ‘నాగిరెడ్డి ఎన్నోసార్లు తనను ఇంటికి ఆహ్వానించినా వెళ్లలేకపోయా.దురదృష్టవశాత్తూ ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయాక ఆయన ఇంటికి వెళ్లాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాగిరెడ్డి ఏ లోకాన ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని, తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు అండదండలు అందించాలని ఆ భగవంతుణ్ని కోరుకుంటున్నానని చంద్రబాబు అన్నారు.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మనస్తత్వం ఏమిటో అర్ధం కావటం లేదన్నారు. ‘తోటి శాసనసభ్యుడు మరణిస్తే పరామర్శకు రాకపోగా సంతాప తీర్మానంపై జరిగే చర్చను బహిష్కరించారు. అసలు ఇంతటి కరుడుగట్టిన మనస్తత్వం ఏమిటో అర్థం కావటం లేద’ని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాల్లో తనకు ప్రత్యర్థి అయినా, ఆయన మరణం తననెంతో కుంగదీసిందన్నారు. రాత్రి అయినా కొండ ప్రాంతంలో గాలింపు చర్యలు జరపాలని, ఎక్కడైనా వైఎస్ దేహం లభిస్తుందేమోనని ఎంతో ఆరాటపడుతూ నేరుగా కేంద్ర రక్షణ మంత్రితో మాట్లాడానన్నారు. ‘వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి నేరుగా ఇంటికెళ్లి జగన్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించాను.. పైగా అంత్యక్రియలకు హాజరు కావటానికి ఎన్నో వ్యయప్రయాసలతో ఇడుపులపాయకు బయలుదేరా. ట్రాఫిక్ రద్దీ కారణంగా వెళ్లలేకపోయాన’ని చెప్పారు. నాగిరెడ్డి ఆఖరి క్షణం వరకు ఓవైపు అభివృద్ధిని కాంక్షిస్తూనే మరోవైపు ప్రత్యర్థులను ఎదుర్కొంటూ వచ్చారని అన్నారు. నాగిరెడ్డి కుటుంబానికి తాను అండగా నిలిచినా ఎంఎల్‌ఎ అఖిలప్రియ దేనికీ భయపడకుండా ఇంటి పెద్దగా మగ, ఆడ తానే అయి ముందుకు సాగాలని కోరారు.
భూమాకు సభ నివాళి
నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి అకాల మరణంపై శాసనసభ ఘనంగా నివాళులర్పించింది. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భూమా నాగిరెడ్డి మృతి పట్ల సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నదంటూ ఆ తీర్మానంలో పేర్కొన్నారు. దీనిపై దాదాపు సభ్యులందరూ మాట్లాడారు. ఎవరికి వారు భూమా కుటుంబంతో తమకున్న సంబంధాలను, నాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. చివరగా స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ తనకు భూమా కుటుంబంతో 25 ఏళ్లుగా సంబంధ బాంధవ్యాలున్నాయని అన్నారు. పలు ఎన్నికల సమయంలో టిడిపి తరపున తాను అనేకమార్లు కర్నూలు జిల్లాకు వెళ్లి ఆ కుటుంబ సభ్యులతో పనిచేశానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నాగిరెడ్డి సర్వశక్తులు ఒడ్డుతూ వచ్చారంటూ ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం సభ్యులు నాగిరెడ్డి మృతికి సంతాపంగా రెండు నిమిషాలపాటు లేచి నిలబడి వౌనం పాటించారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు కోడెల ప్రకటించారు.

చిత్రం..శాసనసభలో భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానంపై ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు