ఆంధ్రప్రదేశ్‌

128 మందికి ఉగాది పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 29: ఉగాది పర్వదినం సందర్భంగా వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉగాది పురస్కారాలను అందజేశారు. విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. కూచిపూడి నృత్య కళాకారిణుల స్వాగత నృత్యం అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థనాగీతం, జ్యోతి ప్రజ్వలనతో సభా కార్యక్రమం ప్రారంభమైంది. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జెఎస్‌వి ప్రసాద్, కమిషనర్ వై.వి అనూరాధ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ వేర్వేరుగా జ్ఞాపికలు, నూతన పట్టు వస్త్రాలతో సిఎం చంద్రబాబును సత్కరించారు. అనంతరం సిఎంతో పాటు వేదికపై ఆశీనులైన వారందరికీ ఉగాది ప్రసాదాలను అందజేశారు. అనంనంతరం సిఎం చంద్రబాబు తన చేతుల మీదుగా రాష్ట్రంలోని 39 మంది ప్రముఖులను కళారత్న అవార్డులతో, పట్టు శాలువాలతో సత్కరించారు. రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు, గరికపాటి నరసింహారావు, వంగపండు ప్రసాదరావు, చెరుకూరి వీరయ్య చౌదరి తదితరులున్నారు. అయితే అమరావతిలో ఏడు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసే కార్యక్రమం ఉండటంతో త్వరగా వెళ్లాలని అధికారులు సూచించినప్పటికీ, సిఎం మిగిలిన 89మందికి ఉగాది పురస్కారాలు అందజేశారు. కళారత్న అవార్డు గ్రహీతలకు రూ.50 వేలు నగదు, ఉగాది పురస్కార గ్రహీతలకు రూ.10 వేలు చొప్పున నగదును అందచేయటం జరిగింది.
తొలుత రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు మాట్లాడుతూ 9మాసాల్లో సచివాలయం, ఆపై మరో 9మాసాల్లో శాసనసభ భవనాలను నిర్మించటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పేరొందిన దేవాలయాల్లో పేద ప్రజలకు ఉచిత భోజన వసతి, రవాణాతో దర్శనభాగ్యం కల్పించేందుకు ఏ సంవత్సరం 1.30లక్షల మందికి దివ్యదర్శనం పేరిట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పెట్టుబడులు లేని వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ఈ ఏడాది వర్షాలు ఉండవని పంచాంగాలు చెబుతున్నా పంటలు బాగా పండుతాయని చెబుతున్నారన్నారు. శాసనసభ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ ఉగాది పచ్చడి మనిషి జీవితాన్ని ప్రతిబింబిస్తుందని, చేదు, వగరు, తీపిలా ఆటుపోట్లు ఎదురవుతుంటాయని, కుంగిపోరాదన్నారు. ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రస్తుత తెలుగు సంవత్సరంలో అందరికీ మంచి చేకూరగలదన్న ఆకాంక్ష వెలిబుచ్చారు. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక సంపద లేకపోయినా మానవ సంపదకు కొదవ లేదన్నారు. మండలి ఛైర్మన్ ఎ చక్రపాణి మాట్లాడుతూ ప్రజలకోసం సిఎం చంద్రబాబు ఒక్కరే 24 గంటలు శ్రమిస్తున్నారని అన్నారు. సభలో రాష్ట్ర మంత్రులు, అధికారులు, నేతలు పాల్గొన్నారు.

చిత్రం... ఉగాది పురస్కారం అందుకుంటున్న గొల్లపూడి మారుతిరావు