రాష్ట్రీయం

కూర్పు కుదిరింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 1: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొందరికి మోదం, మరికొందరికి ఖేదం మిగిల్చారు. శనివారం అర్ధరాత్రి వరకూ జరిపిన కసరత్తులో ఐదుగురు మంత్రులను తొలగించి, మొత్తం 11 మంది కొత్తవారిని క్యాబినెట్‌లోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు జాబితాను గవర్నర్‌కు పంపించారు.
ప్రస్తుతం మంత్రులుగా పనిచేస్తున్న రావెల కిశోర్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, పీతల సుజాత, మృణాళినిలను తొలగించారు. వీరిలో పల్లెకు చీఫ్ విప్ పదవి ఇచ్చారు. కొత్తగా మంత్రివర్గంలోకి సీనియర్లయిన కళా వెంకట్రావు (శ్రీకాకుళం), సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (నెల్లూరు), కాల్వ శ్రీనివాసులు, పితాని సత్యనారాయణ (పశ్చిమ గోదావరి), లోకేష్ (చిత్తూరు), భూమా అఖిలప్రియ (కర్నూలు), ఆదినారాయణరెడ్డి (కడప), నక్కా ఆనంద్‌బాబు (గుంటూరు), జవహర్ (పశ్చిమ గోదావరి), అమర్‌నాథ్‌రెడ్డి (చిత్తూరు), సుజయ కృష్ణ రంగారావు (విజయనగరం)కు మంత్రి పదవులివ్వాలని నిర్ణయించారు. వైసీపీ నుంచి చేరిన సుజయ కృష్ణరంగారావు, భూమా అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డికు మంత్రి పదవులు ఇచ్చి.. నమ్మిన వారికి న్యాయం చేస్తామన్న సంకేతాలిచ్చారు. అదే సమయంలో కళా వెంకట్రావు, సోమిరెడ్డి, కాల్వను చేర్చుకుని సీనియర్లను గౌరవిస్తున్నామన్న సంకేతాలిచ్చారు. ఆదివారం ఉదయం 9.25 నిమిషాలకు సచివాలయం బయట ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరగనుంది.
పల్లె, పీతల వర్గాల అసంతృప్తి
శనివారం మంత్రివర్గ సభ్యులతో భేటీ అయిన సందర్భంగా అందరి వద్దా రాజీనామాలు తీసుకున్న బాబు, తాను మంత్రివర్గంలోకొనసాగించదలచుకున్న వారిని మినహాయించి, తొలగించిన వారి రాజీనామాలు గవర్నర్‌కు పంపనున్నారు. తొలగించిన ఐదుగురిలో ముగ్గురిని మినహాయిస్తే మిగిలిన పల్లె రఘునాథ్‌రెడ్డి, పీతల సుజాత అనుచరుల్లో మాత్రం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై ఆవేదన వ్యక్తమవుతోంది. పార్టీ-ప్రభుత్వానికి తమ నేతలు చేసిన కష్టానికి పార్టీ నాయకత్వం ఇచ్చిన బహుమానం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.
అమరావతి శంకుస్థాపన సందర్భంగా మిగిలిన మంత్రులంతా వేదికపై ఏర్పాటుచేసిన ఏసి వేదికపై ఉంటే, పల్లె మాత్రం మండుటెండలో నిలబడి సాంస్కృతిక కార్యక్రమాలు పర్యవేక్షించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా అసెంబ్లీలో, బయట జగన్‌పై ఎదురుదాడి చేసిన వారిలో ముందు వరసలో ఉండి, వైసీపీ లక్ష్యానికి గురయిన పల్లెను తొలగించడాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పీతల సుజాత అనుచరులు కూడా ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజా మండలి ఎన్నికల్లో పోటీకి నిలబడ్డ వ్యక్తిని బరి నుంచి తప్పించడం ద్వారా ఎన్నికను ఏకగ్రీవం చేశారని గుర్తు చేస్తున్నారు. జగన్‌పై మహిళా నేతలెవరూ ఎదురుదాడి చేయని సమయంలో ఆమె ఒక్కరే ధీటుగా ఎదుర్కొన్నారని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ మంత్రి చేయనన్ని పర్యటనలు ఆమె చేశారని, అయినా ఆమెను తప్పించడం అన్యాయమంటున్నారు.
శాఖాపరంగా చూసుకున్నా మొదటి నుంచి మైనింగ్ వ్యవహారాలు నేరుగా సీఎంఓనే చూసిందని, పార్టీ ఎమ్మెల్యేలు, సహచర మంత్రుల సిఫార్సులే ఎక్కువని చెబుతున్నారు.

చిత్రాలు..కళా వెంకట్రావు, సోమిరెడ్డి , కాల్వ శ్రీనివాసులు , పితాని సత్యనారాయణ , నారా లోకేష్, అఖిల ప్రియ, ఆది నారాయణరెడ్డి, నక్కా ఆనంద్‌బాబు, జవహర్, అమర్‌నాథ్‌రెడ్డి, కృష్ణ రంగారావు