రాష్ట్రీయం

న్యాయమే గెలిచింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 2: ‘ఇది దేవుడిచ్చిన తీర్పు. న్యాయం గెలిచింది. దైవం నా పక్షానే ఉన్నాడు. నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞలు. కోర్టు పునర్జన్మ ఇచ్చింది. నా చెల్లికి పెళ్ళి చేస్తా. తల్లిని బాగా చూసుకుంటాన’ని సత్యంబాబు ఉద్వేగంగా అన్నాడు. ఆయేషా హత్యకేసులో నిరపరాధి అంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన దరిమిలా ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుండి విడుదలైన సత్యంబాబు విలేఖరులతో మాట్లాడాడు. ఈ కేసులో తన తరపున వాదించిన న్యాయవాది బొజ్జా తారకం ఇప్పుడు లేకపోవడం బాధిస్తోందన్నాడు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి, ఇతర న్యాయమూర్తులకు, తన తరపున వాదించిన న్యాయవాదులకు, మాల సంక్షేమ సంఘానికి, మహిళా సంఘాలకు, దళిత సంఘాలకు, మీడియాకు, ఈ కేసులో మొదటి నుంచీ తాను తప్పు చేయలేదని చెబుతూ వస్తున్న ఆయేషా తల్లిదండ్రులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నాడు. జైలులో తనలా చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నా వారు చాలామంది ఉన్నారని, వారికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నానన్నాడు. తన కుటుంబం దీనావస్థలో ఉందని, కూలీపని చేసుకుంటూ జీవిస్తున్న తన తల్లి తొమ్మిదేళ్లుగా ఎంతో క్షోభతో తన కోసం తిరుగుతూనే ఉందని అంటూ సత్యంబాబు కన్నీళ్లు పెట్టుకున్నాడు. తొమ్మిదేళ్లుగా తన తల్లి చేతి స్పర్శకు దూరమయ్యానని వాపోయాడు. తల్లిని బాగా చూసుకుంటానని, చెల్లికి పెళ్ళి చేస్తానని అన్నాడు. బయటకొచ్చిన తాను ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుచుకుంటానని, తాను ఏ తప్పూ చేయలేదని, అదే నమ్మకం తనను నడిపించిందన్నారు. తన స్వగ్రామంలో ప్రజలు ఇంటికి రూ.200 చొప్పున చందాలు వేసుకుని తాను బయటకు రావాలని కోరుకున్నారని, ఇది మరువలేనన్నాడు. ఇంటరాగేషన్ సమయంలో సత్యంబాబుపై విడుదలైన వీడియో గురించి ప్రస్తావించగా ఆ
వీడియోను పరిశీలిస్తే సినిమాలో పెదవులు కదిపినపుడు డబ్బింగ్ ఎలా చెబుతారో అలా రూపొందించిందని ఆ వీడియో చూసిన వారికి కచ్చితంగా అర్ధమవుతుందన్నాడు. నిర్భయ కేసులో ఆమె తల్లిదండ్రులకు న్యాయం జరిగినట్టే ఆయేషా మీరా తల్లిదండ్రులకు కూడా న్యాయం జరగాలని కోరుతున్నానన్నాడు. ప్రభుత్వాన్ని తాను ఏమీ డిమాండ్ చేయనని, అవకాశం ఉంటే తన కుటుంబానికి సహకరించాలని ప్రార్ధిస్తున్నానని ఒక ప్రశ్నకు సమాధానంగా సత్యంబాబు అన్నారు.
జైల్లోనే డిగ్రీ చదివిన సత్యంబాబు
జైలుకెళ్లినపుడు అంతంత విద్యార్హతలున్న పిడతల సత్యంబాబు గ్రాడ్యుయేట్‌గా బయటకొచ్చాడు. సెంట్రల్ జైలులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పాసయ్యాడు. 2010లో జైలుకు వచ్చిన సత్యంబాబు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తూ చదువుతోపాటు జైలులో ఉన్న స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తూ కాస్తంత డబ్బు కూడబెట్టాడు. కాగా తనను నిర్దోషిగా కోర్టు ప్రకటించిన విషయం సత్యంబాబుకు జైలులో టీవీల ద్వారా తెలిసింది.
కొత్త జీన్స్ ప్యాంటు, చెక్స్ షర్టు ధరించి తల్లి చేయి పట్టుకుని సెంట్రల్ జైలు నుంచి సత్యంబాబు బయటకొచ్చాడు. జైలుకు వెళ్ళే సమయంలో కాళ్ళు చచ్చుపడిపోవడంతో అతనికి నిమ్స్‌లో వైద్యం చేయించిన సంగతి తెలిసిందే.
విడుదలపై ఉత్కంఠ
సత్యంబాబు నిర్దోషని హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించిన దరిమిలా విడుదలపై ఉత్కంఠ నెలకొంది. తన కొడుకు విడుదల కోసం సత్యంబాబు తల్లి మరియమ్మ కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం నుండి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు శనివారమే చేరుకుంది. సత్యంబాబు శనివారమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కోర్టు ఉత్తర్వులు జైలు అధికారులకు అందకపోవడంతో సాంకేతికంగా విడుదలచేయడం సాధ్యంకాలేదు. మాల సంక్షేమ సంఘం ఉద్యోగ విభాగం అధ్యక్షుడు అరుణ్‌కుమార్ హైదరాబాద్ నుంచి ఉత్తర్వులను పట్టుకుని బస్సులో బయలుదేరి ఆదివారం ఉదయానికి రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ఉత్తర్వులను సెంట్రల్ జైలు అధికారులకు అందజేశారు. దీంతో సుమారు 10.15 గంటల ప్రాంతంలో సత్యంబాబు విడుదలయ్యాడు. అనంతరం న్యాయవాదులు, తల్లితో కలిసి సత్యంబాబు తన స్వగ్రామానికి బయలుదేరి వెళ్ళాడు.

చిత్రం..జైలు నుండి విడుదలైన సత్యంబాబును ఆప్యాయంగా హత్తుకుంటున్న తల్లి మరియమ్మ