రాష్ట్రీయం

సాగర్ డ్యాంపై మళ్లీ రచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ/ నాగార్జున సాగర్, మే 1: నాగార్జునసాగర్ కృష్ణా జలాల నీటి వినియోగంలో ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఘర్షణలు, వాగ్వాదాలు సర్వసాధారణమయ్యాయి. ప్రతిసారి ఆంధ్రకు నీటి విడుదల, నిలిపివేతల ప్రక్రియ సందర్భంగా రెండు రాష్ట్రాల అధికారుల మధ్య పేచీలు తలెత్తి, ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. సోమవారం కుడికాలువ నుండి విడుదల చేస్తున్న నీటి కేటాయింపు పూర్తవ్వడంతో తెలంగాణ ఇరిగేషన్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాగర్ డ్యాం అధికారులు నీటి విడుదల తగ్గిస్తూ వచ్చారు. విషయం తెలుసుకున్న ఆంధ్ర కుడి కాలువ అధికారులు డ్యాంపైన కంట్రోల్ రూమ్‌కు చేరుకుని ఇవ్వాల్సిన నీళ్లు పూర్తి కాలేదని తెలంగాణ అధికారులను అడుడకున్నారు. దీంతో తెలంగాణ అధికారులు డ్యాం సెక్యూరిటీకి చెందిన ఎస్పీఎఫ్ సిబ్బంది సహకారంతో కుడి కాల్వకు పూర్తిగా నీటి విడుదల నిలిపివేశారు.
వివరాల్లోకి వెళ్తే.. 5.6 టిఎంసి నీళ్లు కుడి కాల్వకు, 6.9 టిఎంసి నీళ్లు కృష్ణా డెల్టాకు విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణను ఆదేశించింది. ఈ నేపథ్యంలో గతవారం రోజులుగా కుడి కాల్వకు, డెల్టాకు నీటి విడుదల కొనసాగించారు. కుడి కాల్వకు ఇవ్వాల్సిన 5.6 టిఎంసి నీటి విడుదల పూర్తవ్వడంతో డ్యాం ఉన్నతాధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. డ్యాం డిఈ విజయ్‌కుమార్, ఏఈలు, సిబ్బందితో కలిసి కుడి కాలువకు విడుదల చేస్తున్న నీటిని క్రమేపీ తగ్గిస్తూ వచ్చారు. ఈ సమాచారం అందుకున్న ఆంధ్ర ప్రాంత కుడి కాల్వ డిఈ ఎన్ వెంకటేశ్వర్‌రావు, ఏఈలు సిబ్బందితో కలిసి డ్యాంపైకి చేరుకుని తమకు కేటాయించిన 5.6 టిఎంసిలో 3.9 టిఎంసి మాత్రమే చేరాయని, కొంత వృధానీటిని తీసివేసినా మరో టిఎంసి జలాలు కుడికాల్వ పరిధిలోకి రావాల్సివుందంటూ తెలంగాణ అధికారులతో గొడవకు దిగారు. నీటి విడుదల నిలిపివేత సాగనిచ్చేది లేదని హెచ్చరించారు. దీంతో తెలంగాణ, ఆంధ్ర అధికారుల మధ్య సుమారు రెండు గంటలపాటు ఘర్షణ నెలకొంది. ఒకానొక సమయంలో కుడి కాల్వ మాదని, మాకు కావాల్సిన, రావాల్సిన నీటిని మేమే విడుదల చేసుకుంటామని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో తెలంగాణ ఆధికారులు డ్యాం సెక్యూరిటీ ఎస్పీఎఫ్ సిఐ, ఎస్‌ఐ, సిబ్బంది సహకారంతో కుడి కాల్వకు పూర్తిగా నీరు నిలిపివేశారు. ఈ వివాదంలో తెలంగాణ డిఈ విజయ్‌కుమార్ మాట్లాడుతూ తమకు ఉన్నతాధికారుల నుంచి నీటి విడుదల నిలిపివేయమని ఆదేశాలు అందాయన్నారు. తమ విధులను అడ్డుకున్న ఆంధ్ర అధికారులను ఎస్‌పిఎఫ్ సిబ్బంది సహకారంతో డ్యాం నుండి పంపించేసి, కుడి కాల్వకు నీటి విడుదల నిలిపివేశామన్నారు. దీనిపై ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సునీల్ మాట్లాడుతు ఈ ఏడాది ఫిబ్రవరి 3నుండి ఇప్పటిదాకా కుడి కాల్వకు కేటాయించిన 22.59 టిఎంసి జలాలు పూర్తిగా విడుదల చేశామని, సోమవారంతో విడుదల ప్రక్రియ పూరె్తైందన్నారు. ప్రతిసారి నీటి విడుదల, వినియోగాలపై ఆంధ్ర అధికారులు కొర్రీలు పెట్టడం సాధారణమైందని, ఈ విషయాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. అయితే నీటి నిలిపివేతను అడ్డుకున్న ఆంధ్ర అదికారులు కుడికాలువ డిఈ వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఆంధ్ర వైపునున్న రైట్ బ్యాంక్ పోలీస్ స్టేషన్‌లో తమను తెలంగాణ డ్యాం అధికారులు, ఎస్‌పిఎఫ్ సిబ్బంది చేయి చేసుకుని నెట్టి వేశారని ఫిర్యాదు చేశారు. కాగా మరోమారు ఆంధ్ర అధికారులు డ్యాం మీదకు చేరుకుని కుడి కాల్వకు నీటి విడుదల చేసుకునేందుకు ప్రయత్నించవచ్చన్న సమాచారంతో డ్యాం తెలంగాణ అధికారులు ఎస్‌ఫిఎఫ్ సిబ్బందిని, స్థానిక పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు.

చిత్రం..నాగార్జున సాగర్ డ్యాంపై ఎస్‌పిఎఫ్ భద్రత