రాష్ట్రీయం

ఎన్నిసార్లు చెప్పాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: ‘రోడ్లపై గుంతలు ఉండకూడదు. ఎప్పటికప్పుడు పూడ్చేయాలని గతంలో అనేకమార్లు చెప్పాను. అయినా అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇది మంచి పద్ధతి కాదు. నెల సమయం ఇస్తున్నా. మే నెలాఖరుకు రోడ్లపై గుంతలు పూడ్చాలి. జూన్‌లో రాష్టవ్య్రాప్తంగా పర్యటిస్తా. అప్పుడు ఎక్కడైనా గుంతలు కనిపిస్తే సంబంధిత అధికారిని అక్కడిక్కడే సస్పెండ్ చేస్తాం’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ‘నేను ఇటీవల వరంగల్ పర్యటనకు వెళ్లినప్పుడు పాలకుర్తి వరకు రోడ్‌మార్గంలో వెళ్తుంటే, అన్నీ గుంతలే’ అని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్‌లో సోమవారం రోడ్లు భవనాల శాఖపై సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ, ఈఎన్‌సి గణపతిరెడ్డి తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ‘చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేశాం. కేంద్రాన్ని ఒప్పించి అనేక జాతీయ రహదారులు సాధించాం. కొత్త రహదారుల నిర్మాణంతోపాటు మరమ్మతులకు సరిపడ నిధులు మంజూరు చేశాం. అయినా రహదారులపై ఎక్కడ చూసినా గుంతలు కనిపిస్తున్నాయి. అవే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్లపై గుంతలు కనిపించ కూడదని అనేకమార్లు అధికారులను హెచ్చరించినా సీరియస్‌గా తీసుకోవడం లేదు. నెల సమయం ఇస్తున్నా. ఈ నెలాఖరుకు ఒక్క గుంత కనిపించకూడదు. జూన్ మొదటివారం నుంచి రాష్ట్ర పర్యటనకు వస్తున్నా. ఎక్కడైనా గుంతలు కనిపిస్తే, సంబంధిత అధికారిని సస్పెండ్ చేస్తాం. ఇకపై అధికారుల అలసత్వాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదు’ అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రహదారుల అభివృద్ధిలో భాగంగా పంచాయతీరాజ్ రోడ్లను ఆర్ అండ్ బి పరిధిలోకి, ఆర్ అండ్ బి రోడ్లను ఎన్‌హెచ్‌ల పరిధిలోకి తెస్తున్నామన్నారు. శాఖ మారిన సందర్భంలో కొత్త రోడ్లు నిర్మించడానికి కొంత వ్యవధి పడుతుంది. ఆలోగా గుంతలు పడినా కొట్టుకుపోయినా అలాగే వదిలేస్తున్నారని సిఎం గుర్తు చేశారు. రోడ్లు పాడైపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ దుస్థితి పోవాలి. మరమ్మతులు నిరంతరం జరుగుతూనే ఉండాలని సిఎం ఆదేశించారు. ‘కొత్త జిల్లాల్లో సమీకృత కార్యాలయాల నిర్మాణం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించడమే కాకుండా డిజైన్లు కూడా ఆమోదించాం. వీటికి వెంటనే టెండర్లు పిలిచి పది పదిహేను రోజుల్లో పనులు ప్రారంభించి ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలి’ అని సూచించారు. ‘కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం. కార్యాలయాల నిర్మాణం జరిగితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది’ అని అన్నారు. పనిభారం ఎక్కువగా ఉంటే శాఖల ఉద్యోగులను నియమించుకోవాలి. అవసరమైతే రిటైర్డు ఉద్యోగుల సేవలు వినియోగించాలన్నారు. రిటైర్డు అయినవారి సర్వీసును పొడిగించడం వల్ల పదోన్నతి పొందాల్సిన వారికి అన్యాయం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదనపు పోస్టులు సృష్టించుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదని ముఖ్యమంత్రి సూచించారు.

చిత్రం..రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు