ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధికి మహా సంకేతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 29: తెలుగుదేశం పార్టీ సంప్రదాయకంగా నిర్వహించుకునే మూడురోజుల మహానాడు సదస్సు ముగిసింది. విశాఖ ఆంధ్రాయూనివర్శిటీ మైదానంలో జరుగుతున్న మహానాడు ప్రతినిధుల సదస్సు విజయవంతమైంది. సోమవారంతో ముగిసిన సదస్సు కార్యకర్తల్లో స్ఫూర్తినింపగా, నాయకుల గౌరవాన్ని పెంచింది. 34 తీర్మానాలు, 94 మంది నేతల ప్రసంగాలతో హుషారుగా సాగింది. ఇప్పటివరకూ జరిగిన అన్ని మహానాడుల్లో ప్రజాప్రతినిధులు, అగ్రనేతలు కింద ఉన్న సీట్లకే పరిమితం కాగా, ఈసారి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లకు వేదికపై కూర్చునే అవకాశం లభించింది. మూడురోజుల మహానాడులో ప్రభుత్వం ఎన్ని పథకాలు చేపడుతున్నా అవి పార్టీ పథకాలుగా ప్రచారానికి నోచుకోలేకపోతున్నాయన్న ఆవేదన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల్లో స్పష్టంగా కనిపించింది. మనం పథకాలు అమలు చేయడమే కాదు, అవి మన పథకాలుగా జనం గుర్తించేలా పనిచేయకపోతే లాభం లేదని చెప్పకనే చెప్పారు. జెండా మోసే కార్యకర్త కష్టసుఖం పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు, మిగిలిన అగ్రనేతలు సొంత లాభం చూసుకుంటున్నారన్న విషయాన్ని కూడా మహానాడు స్పృశించింది. కార్యకర్తలు లేకపోతే నాతో సహా ఎవరూ లేరన్న వ్యాఖ్యలతో బాబు తమ్ముళ్లకు దిశానిర్దేశం చేశారు.
దశాబ్దాల నుంచి పార్టీలో కరవైన మానవీయ కోణాన్ని బాబు పునరావిష్కరించారు. పార్టీకి సేవలందిస్తున్న పేద కార్యకర్తల భుజం తట్టి వారికి ఆర్ధిక సాయం, పదవులు ఇచ్చిన వైనం కార్యకర్తల్లో బాబు ప్రతిష్ఠ పెంచింది. మహానాడులో యథాప్రకారం బాబు ప్రసంగంలో వాడి వేడి లేకపోయినా బిజెపితో పొత్తుపై లక్ష్మణరేఖ, నాయకుల కర్తవ్యం, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంలో మాత్రం విజయం సాధించారు. బిజెపి విషయంలో మాత్రం టిడిపి నాయకత్వం ఆచి తూచి అడుగులేస్తోందన్న విషయం ఆయన ప్రసంగం చెప్పకనే చెప్పింది. ఒకసారి పొత్తు పెట్టుకున్న తర్వాత ఇక విమర్శలు సరికావని హెచ్చరించడం ద్వారా, ఇక బిజెపిపై ఎవరూ విమర్శలు చేయవద్దన్న సంకేతాలు పంపారు. ఈసారి తెలంగాణ తమ్ముళ్ల భుజం తట్టడం కొత్త అంశం. గత రెండేళ్ల నుంచి తెలంగాణ వ్యవహారంలో పెద్దగా స్పందించని బాబు, ఈసారి మాత్రం అక్కడి నేతలు చేస్తున్న పోరాటాలను భుజం తట్టి ప్రోత్సహించారు. తన సాయం ఎప్పుడూ ఉంటుందన్న భరోసా తెలంగాణ తమ్ముళ్లకు టానిక్‌గా మారింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మీకు కానుకగా ఇస్తామని తమ్ముళ్లు ‘మహా’ ఉత్సాహపడ్డారు. ఈవారంలో హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ మహానాడుకు అధిక సంఖ్యలో కార్యకర్తలు రావడంపై బాబు సంతోషంగా ఉన్నట్లు కనిపించింది. తీర్మానాలు, చర్చల్లో కూడా తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చారు.
బాబు ప్రసంగంలో కీలకమైన అంశాలు పరిశీలిస్తే పోలవరం, అమరావతికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఆయన ఆశలు, లక్ష్యమంతా ఈ రెంటి చుట్టూనే పరిభ్రమించాయి. ‘పోలవరం, అమరావతి నాకు రెండు కళ్లు. పోలవరాన్ని ఎంతమంది అడ్డుకున్నా ఆగదు. అది పార్టీ స్వప్నం. ప్రజల కోరిక. లక్ష్యం మేరకు పూర్తి చేస్తాం. అమరావతికి నిధులిచ్చిన రైతులు చరిత్రలో నిలిచిపోతారు. వారికి పాదాభిందనం.’ అని మూడు రోజుల మహానాడులో తన ప్రసంగాల మధ్యలో చెప్పడం బట్టి ఆ రెంటిపై బాబు ఏ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారో స్పష్టమవుతోంది.
పార్టీలో కొనసాగుతున్న క్రమశిక్షణారాహిత్యంపై బాబు నాయకులకు తీవ్ర స్థాయిలోనే హెచ్చరికలు జారీ చేశారు. ‘చాలామంది గ్రూపులు కడుతున్నారు. అలాంటి నాయకుల స్థానంలో కార్యకర్తలు ప్రత్యామ్నాయం చూసుకుంటారు. అసలు కార్యకర్తలతో ఎలాంటి సమస్యలూ లేవు. నాయకులతోనే సమస్య అనడం’ బట్టి ముఠా నేతలపై ఆయన ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో స్పష్టమవుతోంది.
ఎప్పటి పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు మారడం, ప్రజలకే ఎక్కువ ప్రాధాన్యం అన్న విషయాన్ని మహానాడు స్పష్టం చేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని కింది స్థాయికి తీసుకువెళ్లాలన్న పట్టుదల కనిపించింది. ఈ విషయంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ ప్రభాకర్ చేసిన ప్రసంగం బట్టి, మారుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలన్న ధోరణి కనిపించింది. నేతలు కూడా గతంలో తాము అలా ఉన్నాం కాబట్టి ఇప్పుడు అదేవిధంగా ఉంటామంటే కుదరదని, ఎవరైనా మారుతున్న పద్ధతులకు అనుగుణంగా వెళ్లాల్సిందేనన్న సందేశం ఇచ్చింది.
ఇక ఇప్పటివరకూ తన తడబాటు ప్రసంగాలతో సోషల్ మీడియాలో స్థానం సంపాదించుకున్న మంత్రి లోకేష్, చివరిరోజు చేసిన ప్రసంగం ఉత్సాహంగా సాగింది. మైక్రోసాఫ్ట్ అధినేత అనంతపురానికి చెందిన సత్యనాదెళ్ల అని, కేటాయింపు లెక్కలపై తప్పులు తప్ప మిగిలిన ప్రసంగం అంతా ఉత్సాహంగానే సాగింది. విపక్ష నేత జగన్‌తో పాటు తన తండ్రిపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రస్తావించి జగన్‌పై ఎదురుదాడి చేశారు. కార్తకర్తల సంక్షేమం కోసం తాను ప్రారంభించిన సంక్షేమ నిధి వల్ల జరుగుతున్న లబ్ధి వంటి అంశాలను వివరించారు. ప్రధానంగా తన రాజకీయ ప్రత్యర్థి జగన్‌పై ఆయన విసిరిన సవాలుకు మంచి స్పందన లభించింది. గతంలో బెరుకుగా మాట్లాడిన లోకేష్ ఈసారి దూకుడుగానే ప్రసంగించారు.
ఇప్పటివరకూ జరిగిన అన్ని మహానాడు కంటే విశాఖలో జరిగిన ఏర్పాట్లు, సౌకర్యాలే బాగున్నాయని కార్యకర్తలు చెప్పారు. వేసవి నేపథ్యంలో తొలిరోజు చల్లగా ఉన్నప్పటికీ మిగిలిన రెండురోజులు మాత్రం వేడిగా ఉంది. అయినా కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గలేదు. మంత్రులు గంటా శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తితోపాటు విశాఖ జిల్లా నేతలు కలసి పనిచేసి అధినేత మెప్పు పొందారు.

చిత్రం... పార్టీ జాతీయాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలో చంద్రబాబును అభినందిస్తున్న మంత్రులు, నాయకులు