రాష్ట్రీయం

టెట్రాప్యాక్‌లలో మద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, జూన్ 10: ఇకపై టెట్రాప్యాక్‌లలో మద్యం విక్రయిస్తామని, దీని వల్ల కల్తీకి ఆస్కారం ఉండదని ఎక్సైజ్‌శాఖ మంత్రి జవహర్ అన్నారు. అక్రమ, కల్తీ మద్యానికి అడ్డుకట్ట వేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్‌శాఖ మంత్రి జవహర్ పేర్కొన్నారు. సిఎం చంద్రబాబు కూడా ఈ విషయమై కఠినంగా వ్యవహరిస్తున్నారన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో శనివారం మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ కల్తీ, అక్రమ మద్యం నిర్మూలించేందుకు జూలై 1వ తేదీ నుండి నూతన పాలసీ అమలులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీనివల్ల చిల్లర విక్రయాలకు తావు ఉండదన్నారు. పూర్తిగా టెట్రాప్యాక్‌లతో మద్యాన్ని విక్రయించాల్సి ఉంటుందన్నారు. 30, 60, 90, 180 ఎంఎల్, ఫుల్‌బాటిల్ వరకు టెట్రాప్యాక్‌లను తయారుచేయడంతోపాటు వాటికి సంబంధించి యాప్‌ను ప్యాక్‌లపై ముద్రిస్తారన్నారు. తద్వారా మద్యం ఎక్కడ తయారైంది, ఏ వైన్ షాపులకు వెళ్లిందన్న విషయం ఇట్టే తెలిసిపోతుందని తెలిపారు. మన రాష్ట్రంలోకి పక్క రాష్ట్రాల నుండి మద్యం వచ్చే అవకాశం లేదని, ఇక్కడే ఇతర ప్రాంతాలకంటే ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. యువతను మద్యానికి దూరం చేయడంలో భాగంగా సామర్లకోట వద్ద రూ.198 కోట్లతో ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శిక్షణ కేంద్రంలో మద్యం తయారీ, వాటిని సీల్ చేయడం, నాణ్యత పరీక్ష, యువతను ఏ విధంగా మద్యానికి దూరం చేయాలి తదితర అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా 1000 లీటర్ల బీరు తయారుచేసేందుకు ఎవరైనా దరఖాస్తు చేసుకొంటే ప్రత్యేకంగా లైసెన్సులు జారీ చేస్తామని మంత్రి తెలిపారు. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 32 చెక్‌పోస్టులు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లలో నాణ్యమైన మద్యం విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నవోదయం కార్యక్రమం ద్వారా కల్తీ కల్లు, నాటుసారా విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎక్కడైనా బెల్ట్‌షాపులు నిర్వహించినా, కల్లు కల్తీ విక్రయాలు జరిగినా సంబంధిత వ్యక్తులపై పిడి యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖలో ఉన్న లోపాలను అరికట్టేందుకు దశలవారీగా ప్రక్షాళన చేయనున్నట్లు చెప్పారు. మద్యం విక్రయదారులు తప్పనిసరిగా ఎంఆర్‌పి ధరలకే విక్రయించాలని, అలాకాకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. సమావేశంలో మంత్రి కాలవ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. మద్యం టెట్రాప్యాక్‌లను చూపిస్తున్న ఎక్సైజ్‌శాఖ మంత్రి జవహర్