రాష్ట్రీయం

ఆరు మెగా ప్రాజెక్ట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 13: రాష్ట్రానికి కొత్తగా మరో ఆరు మెగా ప్రాజెక్ట్‌లు రానున్నాయి. ఈ ఆరు మెగా ప్రాజెక్టులకు సంబంధించిన రూ.3,808కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను ఎస్‌ఐపిబి ఆమోదించింది. ఈ ఆరు మెగా ప్రాజెక్టులతో రాష్ట్రానికి మరో 5,325ఉద్యోగాలు దక్కనున్నాయి. కెసిపి లిమిటెడ్, చెట్టినాడ్ సిమెంట్, రెయిన్ గ్రూపు, మోహన్ స్పిన్‌టెక్స్ ఇండియా, ఇండోకౌంట్ ఇండస్ట్రీస్, విశ్వా అపెరల్స్ సంస్థలు ఈ మెగా ప్రాజెక్టులను నెలకొల్పుతున్నాయి. మంగళవారం ఉదయం సచివాలయంలో జరిగిన స్టేట్ ఇనె్వస్ట్‌మెంట్ ప్రమోషన్ (ఎస్‌ఐపి) బోర్డు సమావేశంలో పరిశ్రమలకు అందించే రాయితీలు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూలంకషంగా చర్చించారు. పరిశ్రమలకు ఇచ్చే విద్యు త్ రాయితీ ఎంతో నిర్దిష్టంగా ప్రకటించి నిర్ణీత కాలం వరకు అమలుచేసే ప్రతిపాదన పరిశీలించాలని ఈ సందర్భంగా విద్యుత్ శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇకమీదట ఉద్యోగ, ఉపాధి కల్పన ఆధారంగా రాయితీలిచ్చే విధానాన్ని ప్రోత్సహిద్దామన్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలో వంద ఎకరాల విస్తీర్ణంలో కెసిపి లిమిటెడ్ సంస్థ సిమెంట్ తయారీ పరిశ్రమను నెలకొల్పనుంది. దీని కోసం రూ.531.61కోట్ల పెట్టుబడి పెడుతోంది. వందమందికి ప్రత్యక్షంగా, 1900 మందికి పరోక్షంగా ఈ పరిశ్రమ వల్ల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రాజెక్టు తొలిదశ పూర్తిచేసుకున్న మొదటి ఏడాదిలోనే రూ.174.14 కోట్లు టర్నోవర్ సాధించవచ్చని అంచనా.
చెట్టినాడు సిమెంట్ కార్పొరేషన్ గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెడగర్లపాడులో 1000 ఎకరాల విస్తీర్ణంలో సిమెంట్ తయారీ పరిశ్రమను, విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం, గైతులపాలెం, నరసాపురం గ్రామాల్లోని 75 ఎకరాల్లో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను నెలకొల్పుతోంది. ఈ రెండు పరిశ్రమలపై మొత్తం రూ.1350 కోట్లు పెట్టుబడి పెడుతోంది. 2019 నాటికి ఈ మెగా ప్రాజెక్టు ఉత్పత్తి ప్రారంభిస్తుంది. మొత్తం 1250 మందికి ఈ రెండు యూనిట్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. కాల్సిన్డ్ పెట్రోలియం కోక్ ప్లాంట్, సిమెంట్ గ్రైండింగ్ యూనిట్, ఆర్ అండ్ డీ సెంటర్, వేస్ట్ హీట్ రికవరీ పవర్ ప్లాంట్ నెలకొల్పడానికి రెయిన్ గ్రూపు ఏర్పాట్లు చేసుకుంటోంది. విశాఖ జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లోని 80.33 ఎకరాల స్థలంలో వీటిని ఏర్పాటు చేస్తారు. వీటి మొత్తం పెట్టుబడి రూ.1046 కోట్లు. మొత్తం వెయ్యి మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయి. మూడు దశల్లో ఈ మెగా ప్రాజెక్టు పూర్తవుతుంది. రూ.1168.94కోట్ల టర్నోవర్ ఉంటుందని అంచనా. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.250 కోట్ల పెట్టుబడితో స్పిన్నింగ్, వీవింగ్-ప్రాసెసింగ్, కటింగ్, స్యూయింగ్ తదితర విభాగాల్లో యూనిట్ నెలకొల్పడానికి ఆసక్తి కనబరచింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకచోట వంద ఎకరాల విస్తీర్ణంలో యూనిట్ ఏర్పాటు చేస్తుంది. 2018 నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తుంది. 2,600 మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. మోహన్ స్పింటెక్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో ఇదే తరహాలో మరో గార్మెంట్ యూనిట్‌ను నెలకొల్పుతోంది. రూ.61 కోట్ల పెట్టుబడి పెడుతోంది. విశ్వ అపెరల్స్ రూ.20.10 కోట్ల పెట్టుబడితో చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లె గ్రామంలో గార్మెంట్ అపెరల్ యూనిట్ నెలకొల్పుతోంది. పదెకరాల స్థలంలో రెండు దశల్లో ఇది ఏర్పాటు కానుంది. సంస్థ ఉత్పత్తి ప్రారంభించాక వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లు ఉండగలదు. ఐటీ రంగానికి ఊపు తెచ్చే హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ గత మార్చి 30న ప్రభుత్వంతో చేసుకున్న అవగాహన ఒప్పందం మేరకు ఐటీ-ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడిని పెంచింది. గతంలో అనుకున్నట్టుగా కాకుండా రూ.700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి సంస్థ ముందుకొచ్చింది. 7,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దక్కనున్నాయి. 17 ప్రభుత్వ శాఖలు వివిధ సంస్థలతో చేసుకున్న రూ.16,87,845 కోట్ల విలువైన 1,569 ఎంవోయూలకు సంబంధించిన పురోగతిపై అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. ఈ 1,569 ఒప్పందాల్లో 343 సంస్థలు జీ1 కేటగిరిలో నిలిచాయి. ఇవన్నీ ఉత్పత్తి దశలో ఉన్నాయి. మరో 54 కంపెనీలు జీ 2 దశ (ట్రయల్ ప్రొడక్షన్)లో ఉన్నాయి. 43 సంస్థలు జీ 3 దశలో (యంత్రాల బిగింపు) ఉన్నాయి. మరో 152 జీ 4 దశలో అంటే నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇవిగాక మరో 33 సంస్థలు పునాదిరాయి వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 944 యూనిట్లు ఆర్1, ఆర్2, ఆర్3, ఆర్4 కేటగిరీలలో అనుమతులు, ఆమోద దశలో నిలిచాయి.

చిత్రం.. ఎస్‌ఐపి బోర్డు సమావేశంలో పరిశ్రమలు, రాయితీలు, పెట్టుబడులపై సమీక్షిస్తున్న సిఎం చంద్రబాబు