రాష్ట్రీయం

చేనేతకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 24: నేత వృత్తికి అండ, కార్మిక సంక్షేమానికి ‘చేయూత’ నివ్వడం ప్రభుత్వ ప్రాధాన్యతా లక్ష్యమని జౌళి శాఖా మంత్రి కె తారక రామారావు ప్రకటించారు. అందుకోసం చేయూత పేరిట థ్రిప్ట్ పథకం ప్రారంభించామన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో నేతన్నకు చేయూత పథకాన్ని మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, జి జగదీష్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటు చేసిన డిజిటల్ సాధికారిత సెంటర్‌నూ ప్రారంభించారు. అనంతరం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ నేతన్నల బలవన్మరణాలు నిరోధించేందుకు నెలకు 17 వేల వేతనం తగ్గకుండా అందేలా బహుముఖ వ్యూహంతో ముఖ్యమంత్రి కెసిఆర్ పలు పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. థ్రిఫ్ట్ పథకంతో నేతన్న తనవాటగా 8శాతం పొదుపు చేస్తే, ప్రభుత్వం 16 శాతం జమ చేస్తుందన్నారు. సొసైటీల సభ్యులు, కానివారు మొత్తంగా 30 నుంచి 40 వేలమంది వరకూ ప్రయోజనం పొందుతారన్నారు.
గత ఏడాది బడ్జెట్‌లో చేనేత జౌళిశాఖకు 70కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం థ్రిఫ్ట్ పథకానికే 73 కోట్లు కేటాయించామన్నారు. మార్కెట్ ఒడిదుడుకులతో చేనేత కార్మికులు చితికిపోకుండా వారి చేనేత వస్త్ర ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి అండగా ఉండేందుకు బై బ్యాక్ అగ్రిమెంట్ అమలుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. బడ్జెట్‌లో చేనేత, జౌళి రంగానికి కేటాయించిన 1283 కోట్లలో ప్రతి పైసా వినియోగించుకుని నేతన్నల అభివృద్ధికి మరిన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోలేని రీతిలో 50 శాతం సబ్సిడీతో నూలు, రంగులు అందిస్తున్నామని, చేనేత లక్ష్మి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. దసరా, దీపావళి నాటికి హైద్రాబాద్‌లో ప్రైవేట్ షోరూమ్‌లకు ధీటుగా ఆధునాతన చేనేత డిజైన్లు, ప్యాషన్లతో షోరూమ్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడ పెళ్లిళ్లు జరిగినా పోచంపల్లికి వచ్చి వస్త్రాలు కొనుగోలు చేసేలా పోచంపల్లిలో శిల్పారామం తరహాలో నాలుగు ఎకరాల్లో ఆధునిక నేత బజార్‌ను ఎన్ని కోట్లయినా వెచ్చించి నిర్మిస్తామన్నారు. ఇందుకు వెంటనే భూములను అప్పగించాలని కలెక్టర్ అనితా రామచంద్రన్‌ను కోరారు. అలాగే పోచంపల్లి అపెరల్ పార్కును మరో 2వేల మంది కార్మికులకు ఉపాధి అందించేలా విస్తరిస్తామన్నారు. ఉద్యమ సమయంలో పోచంపల్లిలో బలవన్మరణాలకు పాల్పడిన చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు ఆనాటి ప్రభుత్వాలకు చేతులు రాకపోతే, ఉద్యమనేతగా కెసిఆర్ ఆనాడు జోలెపట్టి మూడున్నర లక్షలను బాధిత కుటుంబాలకు అందించారని గుర్తు చేశారు. సీఎం కెసిఆర్ సూచన మేరకే నేడు థ్రిఫ్ట్ పథకాన్ని పోచంపల్లి నుంచి ప్రారంభించామన్నారు.
చేనేతకు అంతర్జాతీయ మార్కెట్ పెంపొందించే క్రమంలో సినీ నటి సమంత ద్వారా చేనేత ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నామన్నారు. విదేశీయులు ఎవరు రాష్ట్రానికి వచ్చినా, సీఎం కెసిఆర్‌ను కలిసిన సందర్భాల్లో చేనేత వస్త్రాలతో సత్కరిస్తున్నట్టు చెప్పారు. వారు కూడా చేనేత వస్త్రాలు తమకు కావాలని కోరుతుండటం మనకు గర్వకారణమన్నారు. సూరత్, మీరట్ తరహాలో దేశంలోనే అతిపెద్దదిగా ఫామ్ టూ ఫ్యాషన్ వరకు అన్నీ ఒకేచోట జరిగేలా నిర్మించనున్న వరంగల్ కాకతీయ మెగా పార్కును నిర్మిస్తామని, త్వరలోనే సీఎం కెసిఆర్ దీనికి శంకుస్థాపన చేస్తారన్నారు. ఈ పార్కుతో లక్షలాది మందికి ఉపాధి అందించబోతున్నామన్నారు. చేనేత, జౌళి రంగం మనుగడకు, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్ధిక మంత్రి ఈటల సూచనలు, కెసిఆర్ ఆలోచనల మేరకు చేనేత జౌళి ఉత్పత్తులను జిఎస్టీ పన్ను నుండి మినహాయించాలని కౌన్సిల్‌లో వాదనలు వినిపించానన్నారు. ఢిల్లీలోనే ఉన్న సీఎం కెసిఆర్ జిఎస్టీ మినహాయింపు కోసం అవసరమైతే మరోసారి ఆర్ధిక మంత్రి జైట్లీని, మోదీని కలుస్తారన్నారు. ప్రపంచంలో పత్తిసాగులో మేటిగా ఉన్న భారతదేశం వస్త్రోత్పత్తిలో 3.87 శాతం మాత్రంగా ఉందని, ఈ రంగంలో అభివృద్ధి సాధనకు తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అందుకే వరంగల్ టెక్స్‌టైల్స్ పార్కు, సిరిసిల్లలో 30 కోట్లతో అపెరల్ పార్కుతోపాటు గద్వాల, జమ్మికుంట, నారాయణపూర్, దుబ్బాక, కమలాపూర్ వంటి ఇతర చేనేత, పవర్‌లూమ్ పట్టణాల్లో కేంద్రం సహకారంతో చేనేత క్లస్టర్లు, ఎస్‌ఐటిపి పార్కులను నిర్మించనున్నట్టు చెప్పారు. ప్రతి సోమవారం మూడున్నర లక్షల రాష్ట్రోద్యోగులు విధిగా చేనేత వస్త్రాలు ధరించేలా ఆదేశాలు ఇచ్చామన్నారు.
కుల వృత్తుల ప్రోత్సాహంపై విమర్శలా
సమైక్య పాలనలో విధ్వంసమైన తెలంగాణ గ్రామీణ ఆర్ధికాభివృద్ధికి కీలకమైన కుల, చేతివృత్తుల పరిరక్షణకు కెసిఆర్ పలు పథకాలు అమలు చేస్తుంటే, బీసీలు గొర్రెలు, చేపలు పెంచుకోవాలా? అంటు ప్రతిపక్ష నేతలు చౌకబారు విమర్శలు చేయడాన్ని ప్రజలు గమనించాలన్నారు. పెట్టుబడుల ఆకర్షణ సభల్లో అంతా గొప్పగా చెప్పే స్కిల్ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ కులవృత్తులు ఎంతో ముందున్నాయని, వారికి చేయూతనందిస్తే వారితోపాటు రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్న లక్ష్యంతో కెసిఆర్ పలు పథకాలు అమలు చేస్తున్నారన్నారు. మూడేళ్లలో ఏంచేశారంటూ ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు రాష్ట్రంలో 17.9 శాతం వృద్ధిరేటు కనిపించటం లేదా? అని ప్రశ్నించారు. ఉపాథి పథకం అమలులో, ఏక్‌భారత్ శ్రేష్ట్భారత్, మిషన్ ఇంద్రధనస్సు, డిజిటల్ లావాదేవిలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, 40వేల కోట్ల సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలబడిందన్న సంగతి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తెలంగాణ కంటే పదమూడేళ్ల ముందే ఏర్పాటైన చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తర్‌ఖండ్‌లు ఇంకా నడక నేరుస్తున్నాయన్నారు. నాడు రాష్ట్ర సాధన ఉద్యమంలో కలిసిరాక, ఇప్పుడు బంగారు తెలంగాణ సాధనకూ కలిసిరాక ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికోసం తాపత్రయపడుతున్నాయని విమర్శించారు. గతంలో మంత్రులుగా పనిచేసిన కె జానారెడ్డి, ఉత్తమ్‌లు పక్కనే కృష్ణానది వున్నా ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాకు మంచినీరు ఇవ్వలేకపోయారన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్క చిత్తూరుకే 9 వేల కోట్లు తీసుకెళ్తుంటే నోరుమెదపని వారు, ఇప్పుడు కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలకు ఇంటింటికి నల్లాల ద్వారా కృష్ణా గోదావరి నీళ్లించేందుకు మిషన్ భగీరథతో పనులు చేస్తుంటే కమిషన్ల భగీరథ అని, కమిషన్ల కాకతీయ అంటూ పచ్చకామెర్ల రోగుల్లా విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. మంత్రులు ఈటల, జోగు రామన్న, జి జగదీష్‌రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమని, మానవతాకోణంలో పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు కోట్లు వెచ్చించి పథకాలు అమలు చేస్తుందన్నారు. సమావేశంలో ఎంపి బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. భూదాన్ పోచంపల్లిలో థ్రిఫ్ట్ పథకం ప్రారంభించి మాట్లాడుతున్న చేనేత జౌళి శాఖ మంత్రి కెటిఆర్