రాష్ట్రీయం

రాజధానికి రైలుమార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైలు మార్గంతో అనుసంధానం చేసే ప్రతిపాదనను రాష్టమ్రుఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూత్రప్రాయంగా ఆమోదించారు. ఈ మేరకు అవసరమైన నివేదిక తయారు చేసి కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం పంపింది. సర్వే పనులను వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తామని రైల్వే బోర్డు సమాచారం పంపినట్లు తెలిసింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును దక్షిణ మధ్య రైల్వే అధికారులు కలిసినప్పుడు అమరావతిని రైల్వే మార్గంతో అనుసంధానం చేసే విషయం ప్రస్తావనకు వచ్చింది. అమరావతిని రైలు కనెక్టివిటీ చేయాలంటే రెండు ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి గుంటూరుకు నడికుడి, సత్తెనపల్లి మీద రైలు మార్గం ఉంది. సత్తెనపల్లి లేదా పెదకూరపాడు రైల్వే స్టేషన్ నుంచి 15 కి.మీ దూరంలో కృష్ణా నది తీరంలో అమరావతి గ్రామం ఉంది. ఈ గ్రామానికి పైన పేర్కొన్న రెండు రైల్వే స్టేషన్ల నుంచి రైలు మార్గం నిర్మించాల్సి ఉంటుంది. అమరావతి నుంచి రాజధానిలో కోర్‌క్యాపిటల్ పరిధిలో ఉన్న 29 గ్రామాల మీదుగా మంగళగిరి వరకు రైలు మార్గం నిర్మించాలనే ప్రతిపాదనను పరిశీలించారు. 29 గ్రామాల్లో ఉద్దండరాయునిపాలెం, తాళ్లయపాలెం, లింగాయపాలెం గ్రామాల మీదుగా రైలు మార్గం వెళుతుందని ప్రాథమిక అంచనా.
రెండవ ప్రతిపాదన ప్రకారం కృష్ణా నదికి ఆవల హైదరాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడకు వెళ్లే రైలు మార్గం ఉంది. అమరావతి వద్ద కృష్ణా నది దాటిన వెంటనే చెవిటికల్లు, కంచికచర్ల మీదుగా వెళితే కొండపల్లి వస్తుంది. కొండపల్లిలో రైల్వే స్టేషన్ ఉంది. కొండపల్లి నుంచి చెవిటికల్లు వరకు, అక్కడ కృష్ణా నదిపై రైలు వంతెనను నిర్మించి అమరావతి వరకు రైలు మార్గం నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. కాని కృష్ణా నదిపై రైలు వంతెన నిర్మాణం వ్యయ ప్రయాసలతో కూడింది. పైగా ఏళ్ల తరబడి నిర్మాణం పనులు సాగుతాయి. ఈ రెండు ప్రతిపాదనల్లో సత్తెనపల్లి లేదా పెదకూరపాడు రైల్వే స్టేషన్ల నుంచి అమరావతి మీదుగా మంగళగిరి వరకు రైలు మార్గం నిర్మించాలనే ప్రతిపాదనకు రైల్వే అధికారులు, రాష్ట్రప్రభుత్వం మొగ్గు చూపింది. దీనికి సంబంధించి సర్వే పనులు ఆరు నుంచి ఏడాది లోపల పూర్తి చేసి రెండు సంవత్సరాల్లో రైలు మార్గం నిర్మాణం పూర్తి చేయవచ్చని తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదిత భవనాల నిర్మాణానికి, రోడ్లకు ఇబ్బంది తలెత్తకుండా రైలు మార్గం సర్వే పనులు చేపట్టాలని ప్రభుత్వం రైల్వే అధికారులను కోరినట్లు తెలిసింది. ఈ విషయమై ఈ నెలాఖరులోపల రైల్వే బోర్డుకు నివేదికను పంపనున్నారు.