రాష్ట్రీయం

తెలుగే మన ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 29: తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం చేయాల్సినంత కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భావితరాలకు మన వారసత్వ సంపద అందించేందుకు అహరహం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం రాత్రి అధికారికంగా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ సభలో చంద్రబాబు ముఖ్య అతిధిగా మాట్లాడారు. తెలుగు భాష పరిరక్షణకు కమిటీ వేశామని, కమిటీ సిఫార్సులకు అనుగుణంగా భాషాభివృద్ధికి 7 అకాడమీలు ఏర్పాటు చేశామన్నారు. అందుకు సంబంధించిన జీవోను సభలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడుతూ భాషాభివృద్ధికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తిపంతులు ఆదర్శంగా తెలుగువారంతా క్రతువులో పునరంకితం కావాలన్నారు. తెలుగు భాషాభివృద్ధికి ఇంకేం చేయవచ్చో ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. తెలుగు భాష పరిరక్షణకు స్వర్గీయ ఎన్టీఆర్ కృషి ఎనలేనిదన్నారు. అమెరికా సిలికాన్ వ్యాలీలో ఎంతోమంది తెలుగువారు ఎక్కువ ఆదాయం సంపాదిస్తూ తెలుగు భాషను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలుగు భాషాభివృద్ధికి 1908నుంచి 1940 వరకు గిడుగు రామ్మూర్తి కృషి చేశారన్నారు. చరిత్రలో ఎందరో పుడతారు, చనిపోతారని, కాని అందులో కొద్దిమందే గిడుగు రామ్మూర్తి పంతులులాంటివారు చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. తెలుగు భాష గొప్పదనాన్ని 4 గంటలపాటు అనర్గళంగా తణుకులో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడి ఆహూతులను ఆకర్షించారన్నారు. ఆ రోజుల్లోనే గిడుగు రామ్మూర్తి పంతులు కృషికి రావ్ బహుదూర్ పురస్కారం, కైజర్ ఇ హింద్ బంగారు పతకం పొందటం విశేషమన్నారు. తమ పార్టీ పేరులోనే తెలుగు ఉందని, తెలుగును శాశ్వతంగా గుర్తుంచుకోవడానికి ఆ పేరు పెట్టారన్నారు. అనేకమంది తెలుగు భాషకోసం కృషి చేశారని, అందులో శ్రీకృష్ణదేవరాయలు, క్షేత్రయ్య, అన్నమయ్య, రాయప్రోలు, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, ఆరుద్ర, నేటితరంలో సినారే తదితరులు ఉన్నారన్నారు.
తెలుగు భాషాభివృద్ధికి త్వరలో శాసనసభలో చట్టంతెచ్చి ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ప్రముఖ వయోలనిస్ట్ అవసరాల కన్యాకుమారి రచించిన అమరావతి రాగం సిడీని సిఎం చంద్రబాబు విడుదల చేశారు. పద్యవాద్య కచేరి చేసిన జొన్నవిత్తుల రామలింగేశ్వరశర్మ, అవసరాల కన్యాకుమారిలను దుశ్శాలువతో సత్కరించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా భాషాకోవిదులు, సాహితీవేత్తలు, భాషా సేవకులుగా ఎంపికైన 30మంది పురస్కార గ్రహీతలను సన్మానించారు. కార్యక్రమంలో నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, భాషాభిమానులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..అకాడమీల ఏర్పాటుకు సంబంధించి మంత్రి అఖిలప్రియతో కలిసి జీవో విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు