రాష్ట్రీయం

జీవనాడి ముచ్చుమర్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 8: రాయలసీమలో తాగు, సాగునీటి సమస్య పరిష్కారానికి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం జీవనాడి వంటిదని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన జలసిరికి హారతిలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా మల్యాల వద్ద కృష్ణమ్మకు హారతిఇచ్చారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ముచ్చుమర్రి ఎత్తిపోతలతో ఏ కాల్వకు కావాలంటే ఆ కాల్వకు నీటిని మళ్లించవచ్చన్నారు. ముచ్చుమర్రి నుంచి హంద్రీ- నీవా, కేసీ కాల్వలతోపాటు అవసరమైతే తెలుగుగంగ పథకానికీ నీటిని సరఫరా చేయవచ్చన్నారు. శ్రీశైలం జలాశయంలో నీరు తక్కువగా ఉన్నప్పటికీ, ముచ్చుమర్రి
నుంచి కాల్వలకు మళ్లించవచ్చన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతలతో రాయలసీమలో తాగు, సాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. రాయలసీమలో భూగర్భ జలాలు పెరిగితే సిరులు పండించవచ్చన్నారు. ఇందుకు అవసరమైన పంటకుంటల తవ్వకాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. భూగర్భంలో అతి పెద్ద జలాశయం నిర్వహించవచ్చన్నారు. ప్రజలు, రైతులు ప్రతి వర్షపు నీటి చుక్క భూగర్భంలోకి ఇంకిపోయేలా పంటకుంటలు, ఇంకుడుగుంతల తవ్వకానికి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల
తాగు, సాగునీటి అవసరాల కోసం హంద్రీ- నీవా, కుందూ, ఎస్సార్బీసి పరిధిలో అనువైనచోట బోర్లు తవ్వేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హంద్రీ- నీవా కాల్వ వెడల్పు పనులు నిర్ణీత సమయంలోగా పూర్తిచేసి ఎక్కువ నీటిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు తాగు, సాగు నీరు అందిస్తున్నామని, తద్వారా మిగులు జలాలను రాయలసీమకు పూర్తిస్థాయిలో అందిస్తామని చెప్పారు. తనకు ప్రజలు అధికారం ఇవ్వడానికి కారణం అభివృద్ధి చేస్తానన్న నమ్మకమేనని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు మూడేళ్ల క్రితం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడమే కాకుండా, మరికొన్నింటిని హామీలతో సంబంధం లేకుండా అమలు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్భ్రావృద్ధికి రాజకీయాలతో నిమిత్తం లేకుండా పని చేస్తున్నానని, దీన్ని ప్రజలు గుర్తించారని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నందున త్వరలో తానూ రాజకీయాలు చేయడం ప్రారంభిస్తానని బాబు ప్రకటించారు. అభివృద్ధి పనులన్నీ కార్యరూపంలోకి తీసుకొచ్చి రాజకీయాలు ప్రారంభించి 2019 ఎన్నికలకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ, రాయలసీమకు చెందిన పలువురు పార్లమెంటు, శాసనసభ సభ్యులు హాజరయ్యారు.

చిత్రం.ముచ్చుమర్రి వద్ద కృష్ణమ్మకు హారతినిస్తున్న సిఎం చంద్రబాబు