రాష్ట్రీయం

నేత.. ఇసుక మేత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 8: వినియోగదారులకు అందాల్సిన ఉచిత ఇసుక దారిమళ్లించి ప్రజాప్రతినిధుల సొంత నిర్మాణాలకు తరలిస్తోన్న అక్రమం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ర్యాంపులో యధేచ్ఛగా సాగిపోతోంది. ఈ ఇసుక ర్యాంపుల వివాదం ఇప్పుడు సిఎం చంద్రబాబు దృష్టికి వెళ్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అధికారులను అడ్డుపెట్టుకుని సదరు ప్రజాప్రతినిధి ర్యాంపునే ఆధీనంలోకి తీసుకున్నారన్న ఆరోపణలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు, విశాఖపట్నంలో జరుగుతున్న నిర్మాణాలకు సదరు నేత ఇక్కడ నుంచి ఇసుక తరలించుకుపోతున్నట్టు గగ్గోలు లేస్తోంది. స్థానికంగావున్న ఉన్నతాధికారి ఒకరు ప్రజాప్రతినిధికి పూర్తి సహకారాన్ని అందించడంతో, వర్షాకాలంలోనూ నది ఇసుక యథేచ్ఛగా సొంత నిర్మాణాలకు తరలిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రజాప్రతినిధి బిల్డర్ కూడా కావడంతో తనకు కావాల్సిన ఇసుక అంతా ఉచిత ఇసుక పేరిట పట్టుకుపోతున్నట్టు తెలిసింది.
కాగా రివర్‌ఫ్రంట్ టూరిజం పేరిట రాజమహేంద్రవరంలోని రెండు సహజసిద్ధంగా ఇసుక లభించే ర్యాంపులను స్థానిక అధికారులు మూసివేశారు. ఈ ర్యాంపులను తెరిపించడానికి కొంతమంది కోర్టును ఆశ్రయించి ఒక ఉత్తర్వు తెచ్చుకున్నారు. ప్రత్యామ్నాయం చూపించేంత వరకు మూసివేసిన ర్యాంపులను తెరవాలని, మూడు వారాల్లోగా ప్రత్యామ్నాయం చూపకపోతే పాత ర్యాంపులను
తెరిపించి ఇసుక కార్మికులకు ఉపాధి కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలను సైతం స్థానిక అధికారులు బేఖాతరు చేస్తూ ఇసుక ర్యాంపుల్లోకి వాహనాలు వెళ్లకుండా కందకాలు తవ్వించారు. దీంతో సదరు అధికారి వైఖరిపై స్థానిక ఇసుక బోట్స్‌మెన్ సొసైటీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో ఎక్కడ ఇసుక దొరకకపోయినా రాజమహేంద్రవరం పరిధిలో మూడు ర్యాంపుల్లో మాత్రం వర్షాకాలంలో సైతం ఇసుక నావల ద్వారా తీసుకునే సహజసిద్ధమైన అవకాశం వుంది. దీంతో వర్షాకాలంలో రాజమహేంద్రవరంలోని మూడు ర్యాంపుల ఇసుకకు పూర్తి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం గోదావరి వరద సమయం కాబట్టి గోదావరి జిల్లాల్లోని సుమారు 36 ర్యాంపులను మూసివేశారు. రాజమహేంద్రవరంలోని రెండు ర్యాంపులకే అనుమతి ఉంది. అవి కూడా రిఫర్‌ఫ్రంట్ టూరిజం పేరుతో అధికారులు మూసివేయడంతో కోటిలింగాల స్నానఘట్టం సమీపంలో అధికారులు ప్రత్యామ్నాయ ఇసుక ర్యాంపును ఏర్పాటుచేశారు. ఈ ర్యాంపులో సుమారు ఇరవై నావలకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. కానీ ఇక్కడ తీసే ఇసుకను ఉచిత ఇసుక విధానంలో వినియోగదారులకు అందకుండా ఆ ప్రజాప్రతినిధి తన సొంత అపార్టుమెంట్ల నిర్మాణానికి పట్టుకుపోతుండటంతో గగ్గోలు మొదలైంది.
ఇటు సహజసిద్ధ ర్యాంపుల మూసివేత, మరోవైపు ప్రత్యామ్నాయ ర్యాంపులో ఇసుక లభించక పోవడంతో రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో నిర్మాణ రంగం చతికిలపడింది. రోజుకు సుమారు 300 లారీల ఇసుక ఎగుమతి జరుగుతూ ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పించే ఈ బోట్స్‌మెన్ సొసైటీలు ఉపాధి కోల్పోయాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు రాజమహేంద్రవరం రూరల్ మండలం పరిధిలోని ఒక ర్యాంపు ద్వారా ప్రస్తుతం అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజమహేంద్రవరం నగరం పరిధిలోని రెండు ఇసుక ర్యాంపులను పర్యాటకం పేరుతో మూసివేసి, కృత్రిమ కొరత సృష్టించారని, తద్వారా రూరల్ పరిధిలోని ఇసుక ర్యాంపునకు డిమాండ్ పెరిగేలా చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం ఇసుక పంచాయతీ అంతా గురువారం రాజమహేంద్రవరం వచ్చిన అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అత్యవసరంగా రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని కాతేరు వద్ద ప్రత్యామ్నాయ ర్యాంపు ఏర్పాటుచేసి ఇసుకను అందించాలని, బోట్స్‌మెన్లకు ఉపాధి కల్పించాలని సిఎం ఆదేశించినట్టు తెలిసింది.