రాష్ట్రీయం

మా పథకాలే మీకు శాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కాంగ్రెస్‌కు శాపాలుగా మారాయని, వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న సీట్లు కూడా రావని మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. తెరాసఎల్‌పిలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి మంత్రులు మాట్లాడారు. రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను చూసి ఓర్వలేకపోతున్న కాంగ్రెస్, అన్నదాతలపై శాడిజాన్ని చూపిస్తోందని విమర్శించారు. రైతుకు ఏటా 8వేల పెట్టుబడి, రైతు సమన్వయ సమితులు, భూ సర్వే వంటి విప్లవాత్మక కార్యక్రమాలు కాంగ్రెస్ పాలిట శాపంగా మారనున్నాయన్నారు. ఇనే్నళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు దానికి దూరమయ్యామనే బాధతో కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారని, అందుకే రైతులు, ప్రజలు కూడా సంతోషంగా ఉండకూడదని రైతు సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. శాడిజంతో రైతుల్లో ఆత్మన్యూనత భావాన్ని కలిగించే కుట్రలు చేస్తున్నారని, కాంగ్రెస్ పప్పులు ఉడకవని,
40 ఏళ్లలో చేయలేని పనులను మేం మూడేళ్లలో చేసి చూపించామని అన్నారు. రాజకీయ స్వార్థంతో రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కాంగ్రెస్ నేతలు ఇకనైనా మనస్సాక్షితో మాట్లాడాలన్నారు. తెరాస అధికారంలోకి రాగానే కాకతీయులు తవ్వించిన చెరువులకు పూర్వ వైభవం తేవడానికి మిషన్ కాకతీయ చేపట్టినట్టు చెప్పారు. ఈ పథకానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని, మహారాష్టల్రోనూ అమలు చేయడానికి అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదన్నారు. మిషన్ కాకతీయ వల్ల అదనంగా ఐదులక్షల ఎకరాల ఆయకట్టు పెరిగిందని, కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల పేర్లే పెండింగ్ ప్రాజెక్టులుగా గుర్తింపు పొందాయన్నారు. కానీ మేం వచ్చిన తరువాత పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చినట్టు తెలిపారు. కల్వకుర్తి, బీమా, కోయిలసాగర్, పాలెం, కినె్నరసాని తదితర పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. పాలమూరు జిల్లాలో గత ఏడాది అదనంగా నాలుగు లక్షల ఎకరాలకు నీరిస్తే ఈ ఏడాది ఏడులక్షల ఎకరాలకు ఇస్తున్నట్టు చెప్పారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం కోసం డిండి, వెనుకబడిన పాలమూరు, కరువు పీడిత రంగారెడ్డి జిల్లాలకు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులను చేపట్టినట్టు చెప్పారు. కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు, విత్తనాలు, ఎరువుల కొరతలని రైతులు చెప్పుకుంటున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో రోజుకు ఆరుగంటల పాటు కూడా వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వలేదని, ఇప్పుడు మేం 24 గంటల పాటు ఇస్తున్నట్టు చెప్పారు. పంటల దిగుబడి తగ్గిందని, 47లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి మాత్రమే వచ్చిందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనడం ఆత్మవంచనని విమర్శించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గత ఏడాది 96లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని చెప్పారు. ఒక్క పౌరసరఫరాల శాఖ ద్వారానే 54లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసిందని, ఉల్లిధర తగ్గినప్పుడు, పెరిగినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించి రైతులకు మేలు కలిగే చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. అన్నా రైతులను బాగా ఆదుకున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మా ఇంటికి వచ్చి ఉల్లిగడ్డ బస్తాను కానుకగా ఇచ్చారని హరీశ్‌రావు గుర్తు చేశారు. 17వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, కాంగ్రెస్ హయాంలో పెండింగ్‌లో పెట్టిన ఇన్‌పుట్ సబ్సిడీ కూడా చెల్లించినట్టు చెప్పారు. రైతులకు మేలు జరగవద్దని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని, వారి తీరు ఇలానే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న సీట్లూ దక్కవని మంత్రులు అన్నారు.

చిత్రం.తెరాసఎల్పీలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న మంత్రులు హరీశ్‌రావు, నాయని తదితరులు