రాష్ట్రీయం

ఏపినుంచి మరిన్ని రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు వీలుగా తిరుగు ప్రయాణంలో మరిన్ని రైళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రైల్వే బోర్డు చైర్మన్ ఎకె మిట్టల్‌ను కోరారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను ఈ నెల 16, 17 తేదీల్లో నడపాలని రైల్వే బోర్డు చైర్మన్‌కు సూచించారు. ఇందుకు రైల్వే బోర్డు చైర్మన్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే అదనపు రైళ్లు, అదనపు కోచ్‌లు ఏర్పాటు చేశామని బోర్డు చైర్మన్ మంత్రికి వివరించారు. అవసరమైతే మరిన్ని నడుపుతామని హామీ ఇచ్చినట్లు ఆ ప్రకటన తెలిపింది.

కుమార్తె అదృశ్యం.. తండ్రి ఆత్మహత్య
గూడూరు, జనవరి 14: తన కుమార్తె కవిత అదృశ్యం కావడంతో తీవ్రంగా మనస్తాపం చెందిన తండ్రి బోడ రవి (35) గురువారం మధ్యాహ్నం చర్లతండా సమీపంలోని తన వ్యవసాయ చేనులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా గూడూరు మండలంలో జరిగింది. కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు మండలం గుండెంగ శివారు చర్లతండాకు చెందిన బోడ రవి తన కూతురు కవిత కనిపించడం లేదని ఈనెల 11న గూడూరు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో కవిత తల్లిదండ్రులను వివిధ సంఘాలతో పాటు స్థానికులు కలిసి పరామర్శిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం పదకొండున్నర గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో భోజనం చేసిన అనంతరం రవి మలవిసర్జనకు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లిపోయాడు. పత్తి చేనుకు సమీపంలో టేకు చెట్టుకు రవి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, చర్లతండా వాసులు రోదిస్తూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గూడూరు సిఐ వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గూడూరు మార్చురికి తరలించారు.

17 నుంచి
పల్స్‌పోలియో
ప్రభుత్వం ప్రకటన

హైదరాబాద్, జనవరి 14: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17 నుంచి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రౌండ్‌లో బూత్‌స్థాయిలో ఇప్పటికే పల్స్‌పోలియో ఇప్పటికే చేపట్టామని తెలిపింది. ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఈ నెల 19 వరకు జరుగుతుందని తెలిపింది. రెండోరౌండ్ బూత్ స్థాయిలో ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు, ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఫిబ్రవరి 2 నుంచి 24 వరకు జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. 0-5 ఏళ్ల వయస్సు ఉన్న శిశువులకు పోలియో చుక్కలు విధిగా వేయించాలని ప్రభుత్వం సూచించింది. పల్స్‌పోలియో కార్యక్రమం అమలు చేసేందుకు గాను 63 మందిని పది జిల్లాల్లో రాష్ట్ర స్థాయి పర్యవేక్షకులుగా, నియమించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కాపు కమిషన్ చైర్మన్‌గా
జస్టిస్ మంజునాథ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 14: కాపు, తెలగ, బలిజ, ఒంటరి తదితర కులాలను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చే అంశంపై అధ్యయనానికి రాష్ట్రప్రభుత్వం కర్నాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కెఎల్ మంజునాథ్‌ను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కృష్ణమోహన్‌రావు తెలిపారు. త్వరలోనే మంజునాథం కాపు కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. మంజునాథ్ నివేదిక అందగానే కాపులను బిసిల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
రాహుల్ మారీచ మాయలు
టిడిపి నాయకురాలు అనురాధ విమర్శ

హైదరాబాద్, జనవరి 14: ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా నాటకాలు ఆడిన సోనియాను నిలదీయలేని రాహుల్ గాంధీ.. లేఖల పేరుతో మారీచ మాయలు ప్రయోగించి ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, టిడిపి ఎంపిలు అనేకమార్లు ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో పోరాడుతుంటే తల్లీ, పిల్ల కాంగ్రెస్‌లు కనీసం మద్దతు తెలిపిన పాపాన పోలేదని, ముఖ్యమంత్రి ప్రధానికి సమర్పించిన పది అంశాల మెమోరాండంలో మొట్టమొదటి డిమాండ్ రాష్ట్ర ప్రత్యేక హోదా అనేది మరిచిపోరాదని అన్నారు. అందుకు సానుకూలంగా స్పందించిన ప్రధాని ప్రత్యేక హోదా కోసం రూట్ మ్యాప్ ఇవ్వమని నీతి ఆయోగ్‌ను ఆదేశించడం కూడా వారికి అర్ధం కాలేదని అన్నారు. 2004కు ముందు చంద్రబాబు పాలనలో 13 లక్షల ఐటి, ఐటి ఆధారిత ఉద్యోగాలు వచ్చాయని, అందులో కొంత సాధించినా కాంగ్రెస్ పాలనలో 26 లక్షల ఉద్యోగాలు రావల్సిందనీ, వాటన్నింటినీ గంటికొట్టారని అన్నారు.

వైకాపా వైదొలగడం అసమంజసం
వ్యవస్థాపక అధ్యక్షుడి వ్యాఖ్య

హైదరాబాద్, జనవరి14: వైకాపా జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించడంపై ఆ పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు కె శివకుమార్ విస్మయం వ్యక్తం చేశారు. ఇటీవల తాను, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి విలేఖర్ల సమావేశంలో వైకాపా జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించామన్నారు. తనను ఈ విషయంలో పార్టీ సంప్రదించలేదని, మనస్తాపానికి గురయ్యానని చెప్పారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించడం ప్రజాస్వామ్యం కాదన్నారు. వైఎస్ మీద ప్రేమతో తాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ధాపించానన్నారు. వైఎస్‌ఆర్ ఆశయాలకు రాజకీయ వారసులుగా ఉంటామని నమ్మామన్నారు. ఈ విషయమై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరాలోచించాలని ఆయన కోరారు. ఈ ప్రకటనను సొంత అభిప్రాయంగా మనస్తాపంతో విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు.