రాష్ట్రీయం

లింగ వివక్షపై సమష్టి పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, సెప్టెంబర్ 18: లైంగిక వివక్షను రూపుమాపేందుకు కలిసికట్టుగా పోరాటం సాగిద్దామని ప్రముఖ సామాజిక సేవకుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి పిలుపునిచ్చారు. ప్రధానంగా బాలల హక్కుల పరిరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం సత్యార్థి చేపట్టిన భారతదేశ యాత్ర సోమవారం కర్నాటక రాజధాని బెంగళూరు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. అనంతపురం జిల్లా కొడికొండ వద్ద సత్యార్థితోపాటు ఆయన సతీమణి, ఇతర బృందం సభ్యులకు మంత్రులు కాలవ శ్రీనివాస్, పరిటాల సునీత, ఎంపి నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే బికె పార్థసారథి, బిసి కార్పొరేషన్ ఛైర్మన్ పామిశెట్టి రంగనాయకులు, కలెక్టర్ వీరపాండ్యన్, అదనపు జెసి ఖాజామోద్దీన్, ఎస్పీ అశోక్‌కుమార్ తదితరులు ఘనంగా స్వాగతించారు. దాదాపు కిలోమీటరు దూరంలోని సభాస్థలికి చేరుకునే దాకా జాతీయ రహదారికి ఇరువైపులా విద్యార్థులు, అంగన్‌వాడీలు, యువతీ, యువకులు నిలబడి పూలవర్షం కురిపిస్తూ సత్యార్థికి జేజేలు పలికారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సత్యార్థి కైలాష్ మాట్లాడుతూ బాలలపై దాడులు, లైంగిక వేధింపుల వార్తలను పత్రికల్లో చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. ప్రజాస్వామ్యానికి తలమానికంగా ఉన్న భారతదేశంలో ఇలాంటి లింగ వివక్ష, బాలలపై దాడులు తలదించుకునేలా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో చైతన్యం రానంతవరకు బాలల హక్కులను కామాంధులు కాలరాస్తూనే ఉంటారన్నారు. ఇలాంటి అరాచకాలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇందుకు అధికార యంత్రాంగం, పోలీసులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ నైతిక బాధ్యత వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. గత కొనే్నళ్లుగా బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు తదితర పరిణామాలకు సంబంధించి 15 వేల కేసులు నమోదు కాగా ఇప్పటికీ 90 శాతం కేసులు నిర్వీర్యమయ్యాయని పేర్కొన్నారు. కేవలం 4 శాతం మంది నిందితులకే శిక్ష పడిందని, మరో ఆరు శాతం మంది జైలుకు వెళ్లారన్నారు. విద్యాలయాల్లో కూడా పిల్లలకు సరైన భద్రత లేదని, వారిని ఆదరించాల్సిన వారే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో పిల్లలకు భద్రత, భరోసా కల్పించాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారి నడవడికపై నిఘా ఉంచాలన్నారు. పిల్లలను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో స్నేహపూర్వకంగా మెలిగినప్పుడే సమస్యలు అవగతమవుతాయన్నారు. బాలలపై జరుగుతున్న పలు విపత్కర సంఘటనల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికే తాను భారత యాత్ర చేపట్టానన్నారు. ఇందులో భాగంగా 22 రాష్ట్రాల్లో 11 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నానన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగంతోపాటు ప్రధానంగా పోలీసు అధికారులు తరచూ తమ హోదాను పక్కన పెట్టి విద్యాలయాలకు వెళ్ళి విద్యార్థులతో మమేకం కావాలన్నారు. సమాజంలో ఎదురయ్యే లైంగిక వేధింపులు, అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎదురించాలని పిలుపునిచ్చారు.
తాను కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో పర్యటించగా అక్కడి ప్రభుత్వాలు పెద్దగా చొరవ చూపలేదన్నారు. అయితే ఆంధ్రలోకి రాగానే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం తరలివచ్చి స్వాగతించడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఇందుకు చేయూతనిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును సత్యార్థి ప్రశంసించారు. అనంతరం లైంగిక వేధింపులు, బాలల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై తాము నిజాయితీగా మెలుగుతామని, బాధ్యులపై కఠినచర్యలు గైకొంటామని ప్రజాప్రతినిధులు, అధికారులతో సత్యార్థి ప్రతిజ్ఞ చేయించారు.

చిత్రం..అనంతపురం జిల్లా కొడికొండ వద్ద జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తున్న
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సత్యార్థి కైలాష్