రాష్ట్రీయం

54మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, సెప్టెంబర్ 18: రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో వివిధ తరగతులు చదువుతున్న 54మంది విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు డైరెక్టర్ వీరంకి వెంకటదాసు చెప్పారు. ఘటనకు కారకులైన ఆరుగురు విద్యార్థులపై శాశ్వత బహిష్కరణ వేటు వేశామన్నారు. ముఖ్యంగా క్రమశిక్షణ పూర్తిగా తప్పి, జూనియర్ విద్యార్థుల 12మందిపై గతనెల 29న అర్ధరాత్రి సమయంలో దాడి చేసిన ఘటనపై ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఘటనపై విచారణ జరిపిన ప్రత్యేక కమిటీ ఇచ్చిన సిఫార్సులను అధారంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నామని, దీన్ని వర్శిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి పంపుతున్నట్లు తెలిపారు. సోమవారం స్థానిక ట్రిపుల్ ఐటీలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గత నెల 29 అర్ధరాత్రి జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. ఒక అమ్మాయి ప్రేమ వ్యవహారంతో పాటు పలువురు జూనియర్ విద్యార్థులు ఇన్ఫార్మర్లుగా వ్యవహారిస్తున్నారనే ఉద్దేశ్యంతో సీనియర్ విద్యార్థులు దాడులకు పాల్పడ్డారని చెప్పారు. జరిగిన దాడి అంశాన్ని వివిధ కోణాల్లో పరిశీలించిన క్రమశిక్షణ కమిటీ పలు సిఫార్సులు అందజేసిందని, దీని ప్రకారం విద్యార్థులపై చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దాడి సంఘటనకు సంబంధించి అయిదు క్యాటగిరీలుగా విభజించి, వారిపై పలు రకాల క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొలి క్యాటగిరిలో నాలుగో సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న ఆరుగురు విద్యార్థులను ముఖ్యులుగా గుర్తించి వారిని ఏడాదిపాటు పూర్తిగా బహిష్కరిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. అనంతరం వర్శిటీ అధికారులు అనుమతిస్తే క్యాంపస్‌కు వచ్చి పరీక్షలు రాసుకునే వీలుందని చెప్పారు. రెండో క్యాటగిరిలో 9మంది విద్యార్థులను గుర్తించి వారిపైనా ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేశామన్నారు. అయతే వీరిని పరీక్షలకు అనుమతిస్తామన్నారు. రూములలో ఉన్న 13 మంది విద్యార్థులను మూడో క్యాటగిరిలో ఉంచి వారిపై 2, 3 మిడ్స్ పరీక్షలను వెళ్ళకుండా సస్పెండ్ చేస్తున్నామని, అదేవిధంగా క్యాంపస్ నుండి కూడా సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. నాలుగో క్యాటగిరిలో ఘటన జరుగుతుంటే కనీసం ఆపకుండా ప్రోత్సహించటాన్ని నేరంగా పరిగణిస్తూ 24 మంది విద్యార్థులపై చర్యలు తీసుకున్నామని, వీరిని రెండో మిడ్ పరీక్ష వరకు సస్పెండ్ చేశామని, అయిదో క్యాటగిరిలో మరో ఇద్దరు విద్యార్థులను సస్పెండ్ చేశామని తెలిపారు. వీరందరినీ క్యాంపస్ నుండి పంపివేశామని డైరెక్టర్ వెంకటదాసు చెప్పారు. సామాజిక మాధ్యమాలకు సంబంధించి 800 మంది విద్యార్థులను విచారిస్తున్నట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ట్రిపుల్ ఐటీలలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే తప్ప విద్యార్థుల్లో మార్పురాదని భావింటి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నామని, ఈ నిర్ణయాలను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు పంపుతామన్నారు. సమావేశంలో పరిపాలన అధికారి రమాకాంత్‌తో పాటు క్రమశిక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ వెంకటదాసు