రాష్ట్రీయం

జెన్‌కోకు 40 వేల కోట్ల రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పనున్న విద్యుత్ ప్రాజెక్టులకు 9.65 శాతం వడ్డీకి రూ.40 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పిఎఫ్‌సి), రూరల్ ఎలక్ట్ఫ్రికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసి) ముందుకొచ్చాయని జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు వెల్లడించారు. సాధారణంగా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమయ్యే నిధులను సమకూర్చే సంస్థలు 10.5 శాతానికి పైగా వడ్డీని నిర్ణయించి రుణం మంజూరు చేస్తాయని, కానీ తెలంగాణ జెన్‌కోకు మాత్రం 9.65 శాతం వడ్డీకే రుణమిస్తామని ముందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీనివల్ల జెన్‌కోకు రూ.400 కోట్ల మేర సొమ్ము ఆదా అయ్యిందన్నారు. నాణ్యత, ప్లాంట్ల నిర్మాణంలో పారదర్శకత, రుణాల చెల్లింపులో కచ్చితత్వం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఆర్థిక సంస్థలు వడ్డీ రేటు తగ్గించి అడిగిన వెంటనే రుణం మంజూరు చేసేందుకు అంగీకరించాయన్నారు. తెలంగాణను మిగులు విద్యుత్‌కు తేవాలన్న సిఎం కెసిఆర్ ఆకాంక్ష మేరకు పనిచేసి విద్యుత్ ప్లాంట్లు కొత్తగా నెలకొల్పే వాటితోపాటు ఉన్న వాటి సామర్థ్యం పెంచేందుకు పని చేస్తున్నామన్నారు. ప్లాంట్ల నిర్మాణాన్ని బిహెచ్‌ఈఎల్ ద్వారా చేపడుతున్నట్లు చెప్పారు. ఇక యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ఐదో యూనిట్‌కు రూ.4,009 కోట్ల రుణం అందించడానికి నిర్ణయించిన పిఎఫ్‌సి ప్రతినిధులతో విద్యుత్ సౌధలో సిఎండి ప్రభాకరరావు, ఇతర అధికారులు సోమవారం సమావేశమయ్యారు. అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఒప్పందం చేసుకున్న నేపధ్యంలో తదుపరి కార్యాచరణను చర్చించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ఐదో యూనిట్ నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు పిఎఫ్‌సి ముందుకు రావడంతో జెన్‌కోకు అవసరమైన నిధుల సమీకరణ ఘట్టం పూర్తయ్యిందని ప్రకటించారు. నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి రూ.25 వేల కోట్లు, 1080 మెగావాట్ల మణుగూరు ప్లాంట్‌కు రూ.7,600 కోట్లు, 800 మెగావాట్ల కొత్తగూడెం ఏడో యూనిట్‌కు రూ.6,800 కోట్లు, 120 మెగావాట్ల పులిచింతల ప్లాంట్‌కు రూ.680 కోట్లు అంచనా వ్యయంగా వివరించారు. ఆరువేల యూనిట్లు సామర్థ్యం కలిగిన ప్లాంట్లు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రారంభమైనవేనని, జెన్‌కో ఆధ్వర్యంలోనే పూర్తిస్థాయిలో నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. పులిచింతల హైడల్ ప్లాంట్ నిర్మాణం ఇప్పటికే పూర్తికాగా, మణుగూరు, కొత్తగూడెం ప్లాంట్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. యాదాద్రికి ఇటీవలే అనుమతులు వచ్చినందున త్వరలోనే పనులు చేపడతామని స్పష్టం చేశారు. కాగా తెలంగాణలో 4,500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవసరమైన పవన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి అవకాశం ఉన్నట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ అధ్యయనంలో వెల్లడైనట్లు సిఎండి ప్రభాకరరావు, జెఎండి శ్రీనివాసరావు తెలిపారు. పాత మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పవన విద్యుదుత్పాదనకు అనువైన ప్రాంతాలుగా గుర్తించామని వివరించారు. పవన విద్యుత్ విధానానికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామని, వాటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని అన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో సోలార్ విద్యుత్ కూడా 2,275 యూనిట్లకు చేరుకుందని తెలిపారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ఈ నెల 25నే వేతనాలు చెల్లించాలని నిర్ణయించినట్లు సిఎండి ప్రభాకరరావు తెలిపారు.