రాష్ట్రీయం

సాధకులు.. పిల్లలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 19: ప్రపంచంలో చిన్నారులు అత్యధికంగా ఉన్న దేశం భారతదేశమని, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే ప్రపంచాన్ని జయించగల శక్తి వారిలో ఉందని సిఎం చంద్రబాబు అన్నారు. సురక్షిత బాల్యం.. సురక్షిత భారతదేశం పేర నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి చేపట్టిన భారతయాత్ర మంగళవారం కర్నూలుకు చేరుకుంది. ఈ సందర్భంగా నగరంలో నిర్వహించిన ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. కర్నూలుకు చేరుకున్న సత్యార్థి యాత్రకు స్థానిక వివేకానంద కూడలిలో ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. అక్కడి నుంచి పోలీసు బెటాలియన్ మైదానం వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. బెటాలియన్ మైదానంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బడిలో ఉండాల్సిన చిన్నారులు పనిలో ఉండటాన్ని తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుర్తించి కఠిన చర్యలు తీసుకున్నానని గుర్తుచేశారు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి అప్పట్లో ఆకస్మిక దాడులు నిర్వహించి పొలాలు, దుకాణాలు, హోటళ్లు, పరిశ్రమల్లో పని చేసే చిన్నారులను రక్షించి వారితో పని చేయించుకుంటున్న వారిపై కేసులు నమోదు చేయించానని గుర్తు చేశారు. ఇప్పుడూ అదేవిధంగా బాలల రక్షణ కోసం కఠినంగా ఉంటానని, అవసరమైతే పీడీ చట్టం కింద చిన్న పిల్లలతో పని చేయించుకున్న వారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు. చిన్నారులు దేశ సంపద అని, వారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని వెల్లడించారు. బాలల భవిష్యత్ కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన కైలాష్ సత్యార్థి సేవలు ప్రపంచానికి ఎంతో అవసరముందన్నారు. ఉన్నత విద్య అభ్యసించిన సత్యార్థి బాలల రక్షణ కోసం నడుం బిగించి ఒకటి, రెండు కాదు ఏకంగా 144 దేశాల్లో 94 వేలమంది బాలలను రక్షించి వారికి మంచి భవిష్యత్ కలుగజేశారని కొనియాడారు. ఆయన చేసిన సేవలకు నోబెల్ శాంతి పురస్కారం అందించడం ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయమన్నారు. దేశంలో ఐదుగురు మాత్రమే నోబెల్ పురస్కారం అందుకోగా వారిలో సత్యార్థి ఒకరు అని అన్నారు. ఆయన చేస్తున్న కృషి ప్రపంచానికి ఎంతో వెలుగునిస్తోందని చంద్రబాబు అన్నారు. గత 40 సంవత్సరాలుగా సత్యార్థి బాలల రక్షణకు చేస్తున్న కృషి అసాధారణమైనదన్నారు. ఆయన సూచనలు పాటించి రాష్ట్రంలో బాలల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భద్రతకు, భరోసాకు రాష్ట్రాన్ని చిరునామాగా మారుస్తానని ఈ విషయంలో రాజీ పడే ప్రశే్న లేదని తేల్చి చెప్పారు. ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదిగిన అనేక దేశాలు యువ శక్తి కొరవడి ఇబ్బందులు పడుతున్నాయని సీఎం అన్నారు. వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండటం, సమీప భవిష్యత్తులో యువశక్తి అందుబాటులో లేకపోవడంతో ఉత్పాదక శక్తి పడిపోతుందన్న ఆందోళన ఆయా దేశాల్లో నెలకొని ఉందన్నారు. మన దేశంలో యువశక్తి అధికంగా ఉండటంతో భవిష్యత్తు మనదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని వాటిలో అత్యధిక కంపెనీలు రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. చిన్నారులు తమ భవిష్యత్తు కోసం విద్యపై దృష్టి సారించాలని వారికి సరైన ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన అన్నారు.
నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి మాట్లాడుతూ బాలలకు భద్రత, భవిష్యత్తుకు భరోసా కల్పించిన దేశం ఏ విషయంలోనైనా అభివృద్ధి సాధించగలదని తెలిపారు. ఏ దేశంలో బాలలకు భద్రత లేదో ఆ దేశానికి కూడా భద్రత లేనట్లేనని పేర్కొన్నారు. బాలలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, కార్మికులుగా మార్చడం వంటి ఎన్నో విషయాలు తనను కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాలల కోసం తాను పడుతున్న శ్రమ వారికి భద్రత కల్పించిన క్షణాన ఆవిరై పోతోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలోని పలు దేశాలు ముందుకు వస్తున్నాయని ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషే కారణమన్నారు. పెట్టుబడులను ఆకర్శిస్తున్న సీఎం బాలల భద్రతపై కూడా అంతే శ్రద్ధగా కృషి చేయాలని కోరారు. దేశ భవిష్యత్తు చిన్నారులపై ఆధారపడి ఉందని గుర్తించిన ఏ దేశమైనా భవిష్యత్తులో అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని సత్యార్థి అన్నారు. బాలలపై వేధింపులు, అత్యాచారాలు ఆగే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బాలల రక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో చిన్నారులు, యువత పాల్గొని కైలాష్ సత్యార్థి చేయించిన ప్రతిజ్ఞను స్వీకరించారు.

చిత్రం..నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి చేపట్టిన భారతయాత్రకు
కర్నూలులో స్వాగతం పలికి ర్యాలీలో పాల్గొన్న సిఎం చంద్రబాబు