రాష్ట్రీయం

బిజెపి సీనియర్ నేత వి.రామారావు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: బిజెపి సీనియర్ నాయకుడు, సిక్కిం మాజీ గవర్నర్ వి. రామారావు ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడున్నారు. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధ పడుతున్న రామారావు స్థానిక అపొలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1935 సంవత్సరం డిసెంబర్ 11న కృష్ణా జిల్లా మచిలిపట్నంలో జన్మించిన రామారావు బిఎ, ఎల్‌ఎల్‌బి పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకునిగా జీవితాన్ని ప్రారంభించారు. కొంతకాలం న్యాయవాదిగా, తర్వాత 1956లో జన్‌సంఘ్ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. జన్‌సంఘ్ వ్యవస్థాపకుల్లో ఆయనొకరు. జన్‌సంఘ్‌లో వివిధ పదవులు నిర్వహించారు. జనతా పార్టీలో, బిజెపిలో క్రియాశీలకంగా పని చేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పర్యాయాలు (1993, 1997) బిజెపి రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలు నిర్వర్తించారు. ఎమ్మెల్సీగా 1966, 1972, 1978, 1986లో 19 ఏళ్లపాటు పని చేశారు. 1986లో ఎన్టీఆర్ శాసన మండలిని రద్దు చేసేంత వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. లెజిస్లేటివ్ కమిటీల్లో పని చేశారు. కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన వివిధ కార్మిక సంఘాలకు నాయకత్వం వహించారు. బిజెపి కేంద్ర క్రమశిక్షణా కార్యాచరణ కమిటీ చైర్మన్‌గా 2001లో పని చేశారు. బిజెపి జాతీయ ఉపాధ్యక్షునిగా 2002లో, అలాగే ఉస్మానియా వర్శిటీ సెనెట్ సభ్యునిగానూ పని చేశారు. మలేషియా తదితర దేశాలకు ప్రభుత్వ ప్రతినిధిగా వెళ్ళారు. వివాదరహితుడైన వి. రామారావు 2002 నుంచి 2007 వరకు సిక్కిం గవర్నర్‌గా ఉన్నారు. ఎమర్జెన్సీలో ‘మీసా’ కింద అరెస్టయి రెండేళ్లు జైలు జీవితం గడిపారు.
కెసిఆర్ సంతాపం
బిజెపి సీనియర్ నాయకుడు రామారావు మృతిపట్ల తెలంగాణ సిఎం చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబీకులకు సానుభూతిని వ్యక్తం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు బంజారాహిల్స్‌లోని వి. రామారావు నివాసానికి చేరుకుని భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య సంతాపం వ్యక్తం చేశారు. బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, బిజెపి శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు బద్దం బాల్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి ప్రభృతులు రామారావు భౌతికకాయాన్ని సందర్శించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
నేడు బిజెపి కార్యాలయానికి భౌతికకాయం
పార్టీ కార్యకర్తల సందర్శనార్థం రామారావు భౌతికకాయాన్ని నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఉంచనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
వెంకయ్య, జగన్ సంతాపం
వి.రామారావు మృతిపట్ల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రామారావు జనసంఘ్ నుంచి బిజెపి వరకు పార్టీ సిద్ధాంతాన్ని రాష్ట్ర నలుదిశలా వ్యాపించపజేయటంలో ప్రముఖ పాత్ర నిర్వహించారని వెంకయ్య గుర్తు చేసుకున్నారు. మాజీ గవర్నర్ రామారావు మృతికి వైకాపా నేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
పోలీస్ లాంఛనాలనతో
అంత్యక్రియలు: సిఎం ఆదేశం
మాజీ గవర్నర్ వి రామారావు అంత్యక్రియలను పోలీస్ లాంఛనాలతో నిర్వహించాలని సిఎం కె చంద్రశేఖర్ రావు సిఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు.

నిజాయతీకి
నిదర్శనం రామారావు

ఆర్‌ఎస్‌ఎస్ సహ సర్
కార్యవాహ్ వి భాగయ్య

హైదరాబాద్, జనవరి 17: నిజాయతీకి, విలువలకు నిలువెత్తు నిదర్శనం సిక్కిం మాజీ గవర్నర్ వి రామారావు అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ్ వి భాగయ్య అన్నారు. రామారావుమరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని పేర్కొంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతినీ, సంతాపాన్నీ వ్యక్తం చేశారు. రాష్ట్ర విధానమండలి సభ్యుడిగా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా, సిక్కిం గవర్నర్‌గా అత్యుత్తమ రీతిలో బాధ్యతలు నిర్వహించారని భాగయ్య తన సంతాప సందేశంలో తెలిపారు. చిన్న వయసు నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన తరవాత కూడా రామారావు క్రియాశీలకంగా, సామాజికంగా నిరంతరం కృషి చేశారని అన్నారు. జీవితాంతం తను నమ్మిన ఆదర్శాలకోసం ఆయన నిలబడ్డారని కొనియాడారు. రామారావుతో ఎంతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న తనకు ఆయన అస్తమయం వ్యక్తిగతంగా తీరని బాధను కలిగించిందని, బిహార్ పర్యటనలో ఉన్నందున రామారావు భౌతికకాయాన్ని కడసారి దర్శించుకోలేకపోయానని భాగయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లాకు వనె్నతెచ్చిన విఆర్, ఎన్టీఆర్

హైదరాబాద్, జనవరి 17: వారిరువురి పేర్లు రామారావే. ఇద్దరూ కృష్ణా జిల్లాలోనే జన్మించి రాజకీయ రంగంలో రాణించారు. ఒకరు ఎన్‌టి రామారావు, మరొకరు వి రామారావు. ఒకరు సిఎంగా ఎదిగితే, మరొకరు గవర్నర్‌గా ఉన్నత పదవిని అలంకరించారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించి మద్రాసులో స్థిరపడి, సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలో అడుగిడి తెలుగు దేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. ఎన్టీఆర్ 1996 జనవరి 18న కన్నుమూశారు. కృష్ణా జిల్లా మచిలిపట్నం సమీపాన జన్మించిన వి రామారావు విద్యార్థి దశ నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌లో స్వయం సేవకునిగా పని చేశారు. బిఎ, ఎల్‌ఎల్‌బి చదివి, కొంతకాలం న్యాయవాదిగా పనిచేసినా, ఆ తర్వాత రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. జన్‌సంఘ్, జనతా పార్టీ, బిజెపిలో కీలక పాత్ర పోషించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా 1993, 1997లో ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీలో అరెస్టయి, రెండేళ్ళు జైలు జీవితం గడిపారు. గవర్నర్‌గా ఉన్నతమైన పదవిని అలంకరించినా, ఎప్పుడూ సామాన్య కార్యకర్తల తరహాలోనే అందరితోనో కలిసిమెలిసి ఉండేవారు.

ఆయన కర్మయోగి
* రామారావుకు విశ్వయోగి నివాళి

హైదరాబాద్, జనవరి 17: మళ్లీ జన్మంటూ లేని కర్మయోగి వి రామారావు అంటూ భగవాన్ విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. ఆంధ్రభూమి ప్రతినిధితో ఆదివారం మాట్లాడుతూ, మాజీ గవర్నర్ రామారావు భారతీయ సనాతన ధర్మాన్ని తుచ తప్పకుండా పాటించిన వ్యక్తి అంటూ శ్లాఘించారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల మక్కువ కలిగి ఉండటమే కాకుండా, వీటిని పరిరక్షించేందుకు జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. రాజకీయ రంగంలో ఉంటూనే ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రామారావు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకు అర్పించే నివాళి అన్నారు.