రాష్ట్రీయం

విశాఖలో నేటి నుంచి ఐఎఫ్‌ఆర్ రిహార్సల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 26: విశాఖలో వచ్చే నెల నాలుగో తేదీ నుంచి జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్)కి సంబంధించి బుధవారం నుంచి రిహార్సల్స్ ప్రారంభమవుతున్నాయి. మూడు రోజులపాటు ఈ రిహార్సల్స్ జరగనున్నాయి. 30వ తేదీ నుంచి విశాఖలోని ఆర్‌కె బీచ్ రోడ్డు పూర్తిగా నేవీ అధీనంలోకి వెళ్లిపోనుంది. ఫ్లీట్ రివ్యూకి సంబంధించి ఏర్పాట్లు చాలా వరకూ పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రతి రోజు ఐఎఫ్‌ఆర్ ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి నాలుగో తేదీ నుంచి నాలుగు రోజులపాటు విశాఖ నగరంలోనే బస చేయనున్నారు. అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన చాలా మంది మంత్రులు నగరానికి వస్తున్నట్టు నేవీ అధికారులకు సమాచారం అందింది. నగరానికి వివిఐపిలు తరలి వస్తుండడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. 15 వేల మంది పోలీస్ బలగాలతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్ మంగళవారం తెలియచేశారు. ఇప్పటికే 3,500 మంది పోలీసులు నగరానికి చేరుకున్నారు. 3, 4 తేదీల్లో మరో 3500 మంది పోలీసులు ఇక్కడికి రానున్నారు. ఏడవ తేదీ నాటికి మరో ఎనిమిదివేల మంది పోలీసులు నగరానికి చేరుకుంటారని ఆయన చెప్పారు. వీరిలో ఆర్మ్డ్ రిజర్వ్, ఎపిఎస్‌పి, గ్రేహౌండ్స్, ఇంటిలిజెన్స్, ఆక్టోపస్, ఐబి, ఎస్‌పిజి సిబ్బంది ఉంటారని ఆయన తెలియచేశారు. నగరం అంతటా 300 సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని గార్గ్ వివరించారు. వుడా చిల్డ్రన్ థియేటర్‌లోని సిసి టివిల ద్వారా వీటిని మోనిటరింగ్ చేయనున్నామని ఆయన తెలియచేశారు. ఇదిలా ఉండగా రిపబ్లిక్ డేని పురస్కరించుకుని మంగళవారం ఉదయం ఆర్‌కె బీచ్‌లో నేవీ ఫ్లై పాస్ట్‌ను నిర్వహించింది. ఇందులో భారత నౌకాదళానికి చెందిన వివిధ తరహాల హెలికాప్టర్లు, జెట్ ట్రైనర్ విమానాలు పాల్గొన్నాయి.
చిత్రం.. విన్యాసాల్లో భాగంగా యుద్ధనౌకపై దిగుతున్న నేవీ హెలికాప్టర్

రూ.7 లక్షల ‘వేతనం’తో
భారత టెకీలకు
ఐసిస్ ‘ఉద్యోగాలు’!
ఇప్పటికే 30 వేల మందితో సంప్రదింపులు
తాజా కథనంలో ‘మెయిల్ టుడే’ వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 26: సిరియా, ఇరాక్‌లతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో నరమేథం సృష్టిస్తున్న ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాద సంస్థ ఇప్పుడు ‘ఉద్యోగాల’ పేరుతో భారత్‌లోని యువతకు గాలం వేస్తోంది. ముఖ్యంగా దేశంలోని ప్రభుత్వాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని హ్యాక్‌చేసి దానిని తమకు చేరవేయగలిగే యువత కోసం ఐసిస్ ముమ్మరంగా అనే్వషిస్తోందని, ‘ట్విట్టర్’, ‘ఫేస్‌బుక్’ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఐసిస్ నాయకులు ఇటువంటి యువతో సంప్రదింపులు జరుపుతున్నారని తాజా వార్తలు స్పష్టం చేస్తున్నాయి. భారత్‌లో ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమాచారాన్నైనా హ్యాక్‌చేసి తమకు చేరవేసే వారికి భారీ మొత్తంలో 60 వేల డాలర్లు (దాదాపు రూ.7 లక్షలు) చొప్పున ‘వేతనం’ చెల్లించేందుకు సైతం ఐసిస్ సుముఖంగా ఉందని ‘మెయిల్ టుడే’ పత్రిక తన కథనంలో వెల్లడించింది. భారత్‌లోకి తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్న ఐసిస్ నాయకులతో నిత్యం ఎంతో మంది హ్యాకర్లు ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నారని కిస్లే చౌదరి అనే సైబర్ నేర నిపుణుడిని ఉటంకిస్తూ ‘మెయిల్ టుడే’ పేర్కొంది. పారిస్‌లో ఇటీవల మారణహోమం సృష్టించిన నరహంతకుల వీడియోను విడుదల చేసిన ఐసిస్ ప్రస్తుతం భారత్‌లో దాడులకు వ్యూహాన్ని రూపొందించుకుంటోందని, దీనిలో భాగంగానే ప్రభుత్వ సమాచారాన్ని దొంగిలించేందుకు ప్రయత్నిస్తోందని చౌదరి తెలిపారు. ఈ విషయమై ఐసిస్ ఇప్పటికే భారత్‌లోని 30 వేల మందికి పైగా యువ టెకీలతో సంప్రదింపులు జరిపిందని, వీరిలో కొంత మంది ఆ ‘ఉద్యోగాలను’ అందిపుచ్చుకుని కూడా ఉండవచ్చని చౌదరి స్పష్టం చేశారు.
కాపుల మధ్య చిచ్చుపెట్టొద్దు
కాంగ్రెస్, వైకాపాలకు మంత్రి నారాయణ హితవు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 26: కాపుల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్, వైకాపాలు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మంత్రి డాక్టర్ పి నారాయణ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నంత కాలం కాపుల గురించి మాట్లాడని పార్టీలు ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం నానా పాట్లు పడుతున్నదని అన్నారు. వీరి ఉచ్చులో పడటానికి కాపులు సిద్ధంగా లేరని అన్నారు. కాపుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీని వారికి దూరం చేయాలనే కుట్ర ఫలించదన్న విషయం ఈ రెండు పార్టీలు గుర్తుంచుకోవాలని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలుగుదేశం పార్టీ కాపుల అభివృద్ధికి కృషి చేస్తుంటే , సహకరించాల్సింది పోయి ఈ రకంగా కాపుల్లో వైషమ్యాలను పుట్టించడానికి ప్రయత్నించడం నీఛమైన నైజాన్ని తెలుపుతోందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్న పదేళ్లలో ఏనాడూ కాపుల గురించి మాట్లాడలేదని అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను నమ్ముకున్న సామాజిక వర్గం ఆ పార్టీకి దూరమైందని, ఇపుడు మళ్లీ కాపులను దగా చేయాలని చూస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ కాపుల కోసం 15 నెలల్లోనే ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. 2009 ఎన్నికల ముందు కొన్ని కులాలను బిసి జాబితాలో చేర్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి కాపుల గురించి ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు.
పొగాకు రైతు ఆత్మహత్య
కొయ్యలగూడెం, జనవరి 26: అప్పుల బాధ తాళలేక పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లిలో మంగళవారం ఒక పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పందిరిపల్లి వెంకట సత్యనారాయణ (47) మంగళవారం ఉదయం తన ఇంటి మరుగుదొడ్డి వద్ద పురుగులమందు సేవించి, డబ్బా అక్కడే వదిలివేసి ఇంటిలోకి వెళ్లి పడుకున్నాడు. కొద్దిసేపటికి నోటివెంట నురగ రావడం, పురుగుమందు వాసన రావడాన్ని కుటుంబ సభ్యులు గమనించే సరికే మృతిచెందాడు. తన ఆత్మహత్యకు అప్పుల బాధలే కారణమని రైతు లేఖ రాసినట్టు పోలీసులు తెలిపారు. తనకు అప్పులిచ్చిన ఇద్దరి వేధింపులు భరించలేక పోతున్నట్టు, ఒకరు రూ.50వేలు అప్పు ఇచ్చి, రూ.2.5లక్షలకు కోర్టులో దావా వేసినట్టు లేఖలో పేర్కొన్నాడని తెలిపారు. కోర్టు వాయిదాకు హాజరుకాకపోవడంతో అరెస్టువారెంట్ జారీ చేశారని, దీనితో భయపడి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు లేఖ ఆధారంగా కేసు నమోదుజేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్సై పి చెన్నారావు తెలిపారు.
ఎర్ర కూలీల హల్‌చల్
గాల్లోకి పోలీసుల కాల్పులు
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, జనవరి 26: శేషాచలం, తలకోన అడవుల్లో మంగళవారం ఎర్రకూలీలు మరోమారు విజృంభించారు. తలకోన అడవుల్లో కూంబింగ్ చేస్తున్న కార్యాదళం సిబ్బందిపై ఎర్రకూలీలు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. ఈక్రమంలో కూలీలు పారిపోయారు. కార్యాదళం సిబ్బంది ఒక ఎర్రకూలీని వెంబడించి పట్టుకోగలిగారు. తప్పించుకుపారిపోయిన కూలీల కోసం గాలిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు 29 ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా శేషాచలం అడవుల్లో చచ్చినోడు బండవద్ద కూంబింగ్ చేస్తున్న అటవీ శాఖ అధికారులు ముగ్గురు కూలీలను సిబ్బంది పట్టుకున్నారు.

ఐఎస్‌బికి అంతర్జాతీయ ఖ్యాతి
అగ్రగామి ఎంబిఎ కాలేజీల్లో 62వ స్థానం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 26: హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ప్రపంచంలోని అగ్రగామి ఎంబిఎ కాలేజీల జాబితాలో సైతం చోటు సంపాదించింది. భారత్ నుంచి ఎంపికైన మూడింటిలో హైదరాబాద్ ఐఎస్‌బి ఒకటి కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా 100 అగ్రగామి ఎంబిఎ కాలేజీలతో ‘ఫైనాన్షియల్ టైమ్స్’ పత్రిక విడుదల చేసిన జాబితాలో భారత్‌కు చెందిన మూడు బిజినెస్ స్కూళ్లకు స్థానం లభించింది. వీటిలో అహ్మదాబాద్, బెంగళూరులోని ఐఐఎంలతో పాటు హైదరాబాద్ ఐఎస్‌బి ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే అహ్మదాబాద్ ఐఐఎం రెండు స్థానాలు ఎగబాకి 24వ స్థానానికి చేరుకోగా, బెంగళూరు ఐఐఎం నాలుగు స్థానాలు ఎగబాకి 29వ స్థానానికి చేరుకుంది. అలాగే హైదరాబాద్ ఐఎస్‌బి 82వ స్థానం నుంచి 62వ స్థానానికి పురోగమించింది. ఈ జాబితాలో ఫ్రాన్స్‌కు చెందిన ఇన్‌సీడ్ అగ్రస్థానాన్ని దక్కించుకోగా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్, లండన్ బిజినెస్ స్కూల్, వార్టన్ స్కూల్, స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయెట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టాప్-10లో నిలిచిన కాలేజీల్లో అమెరికాకు చెందినవి ఏడు, బ్రిటన్, ఫ్రాన్స్‌లకు చెందిన ఒక్కో కాలేజీ ఉన్నాయి.

సుభాష్ పాలేకర్‌కు సిఎం సత్కారం
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జనవరి 26:కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ ప్రకృతి వ్యవసాయ శాస్తవ్రేత్త సుభాష్ పాలేకర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా సత్కరించారు. పాలేకర్‌కు పద్మశ్రీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో జరుగుతున్న పెట్టుబడి లేని సహజ ప్రకృతి వ్యవసాయ శిక్షణా తరగతుల్లో పాల్గొనడానికి మంగళవారం ఇక్కడకు వచ్చిన ముఖ్యమంత్రి రైతులకు శిక్షణనిస్తున్న పాలేకర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. సుభాష్ పాలేకర్ తన స్వరాష్టమ్రైన మహారాష్టల్రో 40 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం అవలంబించి, అద్భుతమైన ఫలితాలు సాధించారని, రైతులంతా సుభాష్ పాలేకర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.

రాజారెడ్డి హత్యకేసులో నేరస్థులకు క్షమాభిక్ష

బుక్కరాయసముద్రం, జనవరి 26: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య కేసు నేరస్థులు క్షమాభిక్షపై మంగళవారం జైలునుంచి విడుదలయ్యారు. మొత్తం 11 మందికి శిక్ష పడగా పది మంది బయటకు వచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. 1998 మే 23న వైఎస్ రాజారెడ్డిని కడప జిల్లా వేముల సమీపంలో ప్రత్యర్థులు బాంబులు వేసి హతమార్చారు. ఈ కేసులో 12 మందిని నిందితులుగా గుర్తించిన హైకోర్టు 2006 అక్టోబర్ 16న యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. అయితే కడప జిల్లా వేములకు చెందిన ఉమామహేశ్వర్‌రెడ్డి విచారణ సమయంలోనే మృతి చెందడంతో 11 మంది వివిధ జైళ్లలో శిక్ష అనుభవించారు. వీరిలో శేషారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, ఓబయ్య, లక్ష్మీరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి అనంతపురం వ్యవసాయ ఆరుబయలు కారాగారంలో, రామకృష్ణారెడ్డి, సాంబశివారెడ్డి, ఈశ్వర్‌రెడ్డి కడప జైలులో, సుధాకర్‌రెడ్డి నెల్లూరు జైలులో శిక్ష అనుభవించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన జీవో 163 ప్రకారం రాజారెడ్డి హత్యకేసులోని పది మందికి క్షమాభిక్ష లభించింది. దీంతో అనంతపురం వ్యవసాయ ఆరుబయలు కారాగారం నుండి ఏడుగురు, కడప సెంట్రల్ జైలు నుండి ముగ్గురు విడుదలయ్యారు. నెల్లూరు జైలులో ఉన్న సుధాకర్‌రెడ్డిపై ఇతర కేసులు ఉండడంతో విడుదల కాలేదు. తమవారు జైలు నుంచి విడుదల అవుతున్నట్లు తెలుసుకున్న ఖైదీల బంధువులు, కుటుంబసభ్యులు, అనుచరులు పెద్దసంఖ్యలో కడప జిల్లా నుండి అనంతపురం చేరుకున్నారు. జైలునుంచి ఖైదీలు బయటకు రాగానే పూలమాలలు వేసి, మిఠాయిలు పంచుకున్నారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు చిన్న శేషారెడ్డి, అతని అన్న సోమశేఖర్‌రెడ్డి, బావ విశ్వనాథరెడ్డి విడుదల అనంతరం దాదాపు 60 వాహనాల్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి కాన్వాయ్‌గా స్వగ్రామానికి వెళ్ళారు. శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి తమ అనుచరులతో కలిసి వెళ్లారు.