రాష్ట్రీయం

పార్టీకి రేవంత్ గుడ్‌బై!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 28: ఊహించినట్టే.. తెలంగాణ తెలుగుదేశం యువనేత రేవంత్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. శనివారం విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన టి.టిడిపి నేతల సమావేశానికి ఆలస్యంగా వచ్చిన రేవంత్, ఆయన సహచరుడైన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ ఇవ్వడంతో, టిడిపిలో గత కొద్దికాలం నుంచి కొనసాగుతున్న దోబూచులాటకు తెరపడింది.
రేవంత్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశారంటూ కథనాలు వచ్చిన దగ్గర్నుంచీ పార్టీలో వివాదం మొదలైంది. రేవంత్ తన చర్యకు సంజాయిషీ ఇవ్వాల్సిందేనంటూ పార్టీ సీనియర్లు డిమాండ్ చేయటంతోపాటు, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించడంతో మనస్తాపం చెందిన రేవంత్ విదేశాల నుంచి వచ్చిన పార్టీ అధినేత చంద్రబాబును హైదరాబాద్‌లో కలిశారు. శనివారం బెజవాడలో నిర్వహించనున్న పార్టీ సమావేశానికి రావాలని బాబు సూచించడంతో, రేవంత్ శనివారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అంతకుముందే పార్టీ నేతల సమావేశం ప్రారంభమైంది. రేవంత్ ఆ సమావేశానికి హాజరుకాలేదు. మధ్యాహ్నం ఒంటిగంటకు మీడియా సమావేశానికి వెళ్లే ముందు, బాబును కలిసి కొద్దిసేపు మాట్లాడారు. తాను పార్టీలో ఉండే పరిస్థితి లేదని, మీ ఆశీస్సులు కావాలని కోరారు. ఏపి, తెలంగాణ సీనియర్లు కొందరు తెరాసతో చేతులు కలిపి పార్టీని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను కేసీఆర్‌పై
పోరాడుతుంటే రెండు రాష్ట్రాలకు చెందిన పార్టీ సీనియర్లు కేసీఆర్‌తో కుమ్మక్కై కాంట్రాక్టులు తెచ్చుకుంటున్నారని, ఇక నా పోరాటానికి విలువేముందని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. మీడియా భేటీకి వెళ్లే తొందరలో ఉన్న బాబు, కొద్దిసేపు వెయట్ చేస్తే అన్నీ మాట్లాడుకుందామని రేవంత్‌కు సూచించారు. రేవంత్, వేం నరేందర్‌రెడ్డి బాబు వచ్చేవరకూ ఆగకుండా రాజీనామా లేఖను బాబు వ్యక్తిగత కార్యదర్శికి ఇచ్చి వెళ్లిపోయారు.
బాబును కలిసిన సందర్భంలో రేవంత్ ఉద్విగ్నతకు లోనయ్యారు. వేం నరేందర్‌రెడ్డి అయితే బాబుకు పాదాభివందనం చేశారు. ఆయన నిష్క్రమణ కూడా ఇష్టం లేకుండా, బాధతోనే వెళ్లినట్లు కనిపించిందని సీఎంఓలో ఉన్న తెదేపా సీనియర్ నేత ఒకరు అన్నారు. రేవంత్‌రెడ్డి తొలుత కనకదుర్గ దేవాలయానికి వెళ్లగా, లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో బయటనుంచి దణ్ణం పెట్టి, క్యాంపు ఆఫీసుకు చేరుకున్నారు. క్యాంపు ఆఫీసు నుంచి బయటకు వెళ్లిన తర్వాత తన పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన రెండు లైన్ల లేఖను తెలంగాణ స్పీకర్‌కు పంపారు. ఆ లేఖ ప్రతిని తెదేపా నాయకత్వానికి అందచేశారు.
అంతకంటే ముందు, మీడియా సమావేశం ముగిసిన తర్వాత బాబు అధ్యక్షతన జరిగిన టిటిడిపి భేటీ రేవంత్ అజెండాగానే సాగింది. టిటిడిపి అధ్యక్షుడు రమణ, పెద్దిరెడ్డి, ఎంపి గరికపాటి మోహన్‌రావు, అరవిందకుమార్‌గౌడ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు తదితరులు సమావేశానికి హాజరయ్యారు. రేవంత్ ఢిల్లీకి వెళ్లి రాహుల్‌ను కలవడం, హైదరాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా బాబుకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, ఆయన తన వెంట ఎవరెవరని తీసుకువెళ్లనున్నారనే జాబితావంటి అంశాలపై చర్చించారు.
పార్టీలో ఒక్కొక్కరు వెళ్లిపోతున్నారని, రేవంత్ ఒంటరిగా వెళ్లడం బాధగా ఉందని నల్లగొండ జిల్లా నేత భూపాల్‌రెడ్డి కళ్లనీళ్ల పర్యంతం కావడంతో వాతావరణం వేడెక్కింది. కొందరు సీనియర్లే రేవంత్‌ను బయటకు పంపారని మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలనుద్దేశించి అన్నారు. తర్వాత రేవంత్ రాజీనామా లేఖను టిటిడిఎల్పీ కార్యదర్శి అమర్‌నాథ్ చదవి వినిపించారు.
అయితే, ఇకపై ఎవరూ రేవంత్‌కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని బాబు ఆదేశించారు. పార్టీలోకి వచ్చేవాళ్లు వస్తారు. పోయేవాళ్లు పోతుంటారు. బలవంతంగా ఎలా ఆపగలం? పార్టీ కోసం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి అన్నారు. పార్టీ ప్రారంభం నుంచి ఎదుర్కొన్న సంక్షోభాలను ఆయన ప్రస్తావించారు. నేతల మధ్య విభేదాలు సహజమేనన్నారు. దానికి స్పందించిన నేతలు తాము కష్టపడి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే మీ మద్దతు మరింత కావాలని స్పష్టం చేశారు.
లోటు నిజమే: పెద్దిరెడ్డి
సమావేశం ముగిసిన తర్వాత సీనియర్ నేత ఇ.పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్ నిష్క్రమణ పార్టీకి లోటేనని అంగీకరించారు. అయితే, మహాసముద్రం లాంటి కాంగ్రెస్‌లోకి వెళ్లిన తర్వాత రేవంత్‌కు, ఆ పార్టీ అంటే ఏమిటో అనుభవమవుతుందని వ్యాఖ్యానించారు. వ్యక్తులు పోయినంత మాత్రన పార్టీకి నష్టం ఉండదని, తిరిగి పార్టీని నిర్మించుకుంటామన్నారు. తెరాసపై తమ పోరాటం ఆగదని చెప్పారు. రేవంత్ రాజీనామా వ్యక్తిగత విషయమని, ఎన్నికల సమయంలోనే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. నవంబర్ 2న జరిగే కార్యకర్తల సమావేశానికి బాబును ఆహ్వానించామన్నారు.

చిత్రం..పార్టీ అధినేత చంద్రబాబు, తెలంగాణ తెలుగుదేశం యువనేత రేవంత్‌రెడ్డి