రాష్ట్రీయం

రేవంత్ రాజీనామాతో కుదేలైన టిటిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, పార్టీకి, శాసనసభ్యత్వానికీ ఎ. రేవంత్ రెడ్డి రాజీనామా చేయడం ఆ పార్టీని కుదిపేసింది. చాలా రోజులుగా రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారన్న ఊహగానాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇంత త్వరగా ఉండకపోవచ్చని, ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చేందుకు సమయం ఇచ్చినప్పుడే, రేవంత్ చేరుతారని చాలా మంది భావించారు. అయితే రేవంత్ రెడ్డి తెలివిగా వ్యవహారించారు. తనపై పార్టీ క్రమశిక్షణా చర్య తీసుకోక ముందే రాజీనామా చేసి బయట పడ్డారు. ఆలస్యం చేస్తే పార్టీ క్రమశిక్షణా చర్య తీసుకోవడమో లేక పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నచ్చజెప్పడమో ఏదో ఒకటి జరుగుతుందని రేవంత్ ఊహించారు. చంద్రబాబు రేవంత్‌ను కూర్చోబెట్టుకుని నచ్చజెబితే, మళ్లీ ఇరకాటంలో పడాల్సి వస్తుందని ఆయన భావించారు. అందుకే ఆ అవకాశం ఇవ్వకుండా రాజీనామా చేశారు. శనివారం అమరావతిలో విలేఖరుల సమావేశం నిర్వహించిన తర్వాత మళ్లీ మాట్లాడుదామని చంద్రబాబు చెప్పినా, రేవంత్ వినిపించుకోలేదు. విలేఖరుల సమావేశంలో చంద్రబాబు తన పక్కనే రేవంత్‌ను కూర్చోబెట్టుకుని, రేవంత్ పార్టీ వీడడం లేదని, ఇప్పటి వరకు మీడియాలో వచ్చిన వార్తలన్నీ కట్టు కథలేనని చంద్రబాబు ఖచ్చితంగా చెప్పి ఉండే వారు. అప్పుడు చంద్రబాబు పక్కనే ఉన్న రేవంత్‌కు మైక్ తీసుకుని ఖండించేందుకూ అవకాశం ఉండేది కాదు. ఇటువంటి పరిణామాలు ఎదురవుతాయని భావించిన రేవంత్ చాలా ఉపాయంగా, తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయం కార్యదర్శికి అందజేసి నేరుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి బయలుదేరారు. ఆదివారం పార్టీ కార్యకర్తలతో మాట్లాడి, ఈ నెల 31న కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో పెద్ద దిక్కు
రేవంత్ రెడ్డి రాజీనామా చేయడంతో పార్టీలో చాలా మంది నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణలో పార్టీకి బలమైన నాయకునిగా ముద్ర పడిన రేవంత్ రాజీనామా చేయడంతో, ఇప్పట్లో పార్టీ కోలుకోలేదన్న చర్చ ప్రారంభమైంది. అంటే రేవంత్ రెడ్డి ఒక్కరే పార్టీలో ఉన్నారా? టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ లేరా? ఇంకా అనేకానేక మంది మాజీ మంత్రులు, మాజీ ఎంపిలు, మాజీ ఎమ్మెల్యేలు లేరా? అనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. కానీ రేవంత్‌లో ఉన్న డైనమిజం మిగతా నాయకుల్లో లేదు. రేవంత్ తన పరుష పదజాలంతో, ఘాటైన విమర్శలతో అటు పార్టీలో నాయకులను, కార్యకర్తలను, ప్రజలనూ కొంత వరకు ఆకర్షించగలిగారు. లోగడ ఓటుకు నోటు కేసులో ఉన్నా, మొక్కవోని ధైర్యంతో దూసుకెళ్లడం, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపైనా ఏ మాత్రం తగ్గకుండా విమర్శలు గుప్పించడం, దమ్ముంటే తనపై కేసులు పెట్టాలని, జైల్లో పెట్టాలని సవాళ్ళు విసరడం పార్టీలో యువతను ఉర్రూతలూగించింది. టి.టిడిపిలో చాలా మంది నాయకులు ఉన్నా, ఇలా డైనమిజంగా మాట్లాడే వారు, సవాళ్ళు విసిరే నాయకులు లేరని అంటున్నారు. రేవంత్ రెడ్డి పార్టీని వీడడంతో టి.టిడిపి కార్యకర్తల్లో నిరాశ నిస్తృహ కనిపిస్తున్నది.
ఇలాఉండగా రేవంత్ తన శాసనసభ్యత్వానికీ రాజీనామా చేస్తూ లేఖను స్పీకర్‌కు సోమవారం అందించనున్నారు. ఉప ఎన్నిక జరిగితే గెలిసి వస్తానన్న ధైర్యం ఆయనలో ఉంది.
కృష్ణయ్యపైనా కాంగ్రెస్ ఒత్తిడి
ఇలాఉండగా రేవంత్ రెడ్డి రాజీనామా తర్వాత ఆ పార్టీకి తెలంగాణలో ఇద్దరు శాసనసభ్యులు మిగిలి ఉంటారు. ఇరువురిలో బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పార్టీ వ్యవహారాల్లో పెద్దగా తలదూర్చరు. అంటీముట్టనట్లుగానే ఉంటారు. కాగా కృష్ణయ్య బిసి సంఘం నాయకునిగా మంచి పేరు సంపాదించినందున, బిసిలకు పెద్ద పీట వేసే తమ పార్టీలో చేరాల్సిందిగా కాంగ్రెస్ నుంచి ఆయనపై వత్తిడి ప్రారంభమైనట్లు తెలుస్తోంది. రెండో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి) ఇంకా ఏమీ తేల్చుకోలేకపోతున్నారు. ఎన్నికలకు ఇంకా గడువు ఉంది కదా అనే భావనతో ఆయన ఉన్నారు. సండ్ర శనివారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపైనే పోటీ చేస్తానని అన్నారు. కాగా రేవంత్‌తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం.