రాష్ట్రీయం

అసలు ఆట మొదలైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్, అక్టోబర్ 29: ‘కెసిఆర్‌ను గద్దె దింపేందుకు అసలైన ఆట ఇప్పుడే ప్రారంభమైంది..’ అని టి.టిడిపికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన ఎ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించటంతో కొడంగల్ ప్రజలు ఈలలు వేస్తూ కరతాళధ్వనులు చేశారు. శనివారం విజయవాడలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి సిఎం చంద్రబాబును కలిసి తన రాజీనామా లేఖలను అందజేసిన రేవంత్ రెడ్డి కొడంగల్ చేరుకున్నారు. ఆదివారం ఉదయం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో అనుచరులతో సమావేశమయ్యారు. ఇంటినుంచి బయలుదేరే సమయానికే అనూహ్యంగా కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కార్యకర్తలు ఆయన్ను భుజాలపై ఎత్తుకుని ఊరేగుతూ అభిమానాన్ని చాటుకున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా రేవంత్ వెంట ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమై ఏ పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిందో వివరించారు. ఆ నలుగురి కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సి ఉందని, అసలైన ఆట ఇప్పుడే ఆరంభమైందని వ్యాఖ్యానించారు. తాను బతికి ఉన్నంత వరకు కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూ సేవకుడిగా ఉంటానని హామీ ఇచ్చారు. పేదలు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండటానికే తనను ఈ నియోజకవర్గానికి పంపారని, 2009, 2014 సార్వత్రిక ఎన్నికలలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్ ప్రజలకు సేవకునిగా ఉంటానన్నారు. కొడంగల్ కోటను ఎలా బీటలు వారించానో, అదేవిధంగా కెసిఆర్, ఆయన కుటుంబీకుల కోటను బీటలు వారించేందుకు సిద్ధంగా ఉన్నానని అందుకు కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అండగా ఉండాలని రేవంత్ కోరారు. కెసిఆర్ రాక్షస పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. కెసిఆర్ ప్రభుత్వం దోపిడీ, అవినీతికి పాల్పడి పేద బడుగు బలహీన వర్గాలకి తీరని
అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి నాలుగు కోట్ల ప్రజలు పునరేకీకరణతొ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ చీరల పేరిట నాసిరకం చీరలు పంపిణీ చేసి, మహిళల మధ్య, కుటుంబాల్లో చిచ్చు పెట్టారని విమర్శించారు. తనను ఎదుర్కోలేక మంత్రులు డబ్బుల సంచులతో కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేసి తన వైపు తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. తాండూరులో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పదవులు అనుభవిస్తున్నారని, కానీ తన కుటుంబం నుంచి తానొక్కడినే ఉన్నానన్నారు.
తాండూరులో అధికార పార్టీకి చెందిన సీనియర్ కార్యకర్త అయూబ్ ఖాన్ మరణానికి కారకులెవరని ఆయన ప్రశ్నించారు. అలాంటి వ్యక్తులు కొడంగల్‌కు రావడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రాజీనామా చేసిన అనంతరం అమరావతి నుంచి బెజవాడ కనుక దుర్గమ్మను దర్శించుకుని నేరుగా కొడంగల్ వచ్చానన్నారు. ఆదివారం ఉదయం కొడంగల్ పట్టణంలోని శ్రీమహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించానని పేర్కొన్నారు. సమావేశంలో నియోజకవర్గంలోని మండలాల వారీగా కార్యకర్తలు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముందుగా దివంగత ఎమ్మెల్యే నందారం వెంకటయ్య సతీమణి నందారం అనురాధను రేవంత్ రెడ్డి కలిసి చర్చించారు.

చిత్రం..కొడంగల్‌లోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి