రాష్ట్రీయం

గోదావరే ప్రాణధార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణ ప్రభుత్వం రానున్న రోజుల్లో గోదావరి జలాలను పెద్ద ఎత్తున వినియోగించేందుకు శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పాత ప్రాజెక్టేనని కేంద్ర జలవనరుల శాఖ అంగీకరించి రాజముద్రవేయడంతో తెలంగాణ ప్రభుత్వం ఊరట చెందింది. ఈ ప్రాజెక్టుకు న్యాయ, పర్యావరణపరంగా రకరకాల అడ్డంకులు, అవరోధాలు తలెత్తుతున్న తరుణంలో కేంద్రం చేసిన ప్రకటనతో ప్రభుత్వం రెట్టించిన ఉత్సాహంతో గోదావరి జలాల గరిష్ట వినియోగానికి కదనోత్సాహంతో కదులుతోంది. ఈ ప్రాజెక్టుపై కేంద్రం గోదావరి నదీ యాజమాన్య బోర్డు, ఎపెక్స్ కమిటీ అనుమతులు తీసుకోనక్కర్లేదు. ఆంధ్ర నుంచి తమకు అభ్యంతరం లేదన్న
పత్రం స్వీకరించాల్సిన పనిలేదు. ఎందుకంటే, ఈ ప్రాజెక్టు అక్రమమని ఏపి గతంలో ఫిర్యాదుచేసింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి నీటిని తుమ్మిడిహట్టి నుంచి కాకుండా మేడిగడ్డ నుంచి తీసుకోవడమే మార్పు అని, ప్రాజెక్టును రీ డిజైన్ చేసినట్లు రాష్ట్రం ఇచ్చిన నివేదికకు కేంద్రం ఆమోదించింది.
ఈ నేపథ్యంలో మిషన్ 2018 పేరిట రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల ద్వారా ప్రవహిస్తున్న గోదావరి నదీ జలాలను ఆరుదశాబ్ధాలుగా సద్వినియోగం చేసుకోవడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. వచ్చే ఏడాది నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా 13.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాలీనా రెండు పంటలకు సాగునీటిని సరఫరా చేయాలన్న సంకల్పాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ గణాంక వివరాల ప్రకారం తెలంగాణ 954.23 టిఎంసి గోదావరి జలాలను వినియోగించుకునే హక్కు కలిగి ఉంది. కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులను రిడిజైన్ చేయడం వల్ల ఎక్కువ నీటిని వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. ఈ ఏడాది ఇంతవరకు రాష్ట్రంలోని గోదావరి నది ద్వారా 1000.32 టిఎంసి నీరు దిగువనున్న ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవహించి ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా సముద్రంలో వృథాగా కలిశాయి. 2016లో రికార్డు స్ధాయిలో 2896 టిఎంసి, 2015లో 1611 టిఎంసి నీరు సముద్రంలో కలిశాయి. గోదావరి నదికి ఎగువున ఉన్న మహారాష్ట్ర కంటే, చత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుంచి ప్రవహించి తెలంగాణలో గోదావరిలో కలిసే ప్రాణహిత, ఇంద్రావతి ద్వారా ఎక్కువ నీరు వస్తుంది. ఈ రెండు నదులకు దిగువున ఉన్న పేరూరు వద్ద ఎప్పుడూ 25వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంటుంది. తెలంగాణలో గోదావరి నదిపై నిర్మించిన పెద్ద ప్రాజెక్టు శ్రీరాంసాగర్ ఒక్కటే. ఈ ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్ధ్యం 90.91 టిఎంసి. కాగా ఈ ఏడాది 68 టిఎంసి నీరు వచ్చింది. లోయర్ మానేరు డ్యాంకులో చేరే నీరు కూడా అంతంత మాత్రమే. ఈ ప్రాజెక్టు మొత్తం స్టోరేజి 24.07 టిఎంసి ఉంటే, ప్రస్తుతం 7.37 టిఎంసి నీటి నిల్వ ఉంది. మంజీరా, సింగూర్, నిజాంసాగర్‌కు కూడా ఈ ఏడాది గణనీయంగా నీరు చేరింది.
2018కే కాళేశ్వరం మొదటి దశ పూర్తి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వచ్చే ఏడాది ఏ విధంగానైనా ఒక దశను ప్రారంభించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో మేడిగడ్డ నుంచి 180 టిఎంసి నీటిని లిఫ్ట్ ద్వారా మళ్లించేందుకు ప్రభుత్వం చేపట్టిన పనులు వేగవంతమయ్యాయి. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నా, కాళేశ్వరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ఉంది. గత వారమే స్టేజి 1 క్లియరెన్సులు వచ్చాయి. పర్యావరణ శాఖకు సంబంధించి తుది అనుమతులు వచ్చే డిసెంబర్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సందిళ్ల, అన్నారం, మేడిగడ్డ రిజర్వాయర్లకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో త్వరలో హైడ్రాలజీ క్లియరెన్సు కూడా రానుంది. ఈ క్లియరెన్సు వస్తే, రెండు, తుది దశల పర్యావరణ అనుమతులు అవరోధాలు లేకుండా వచ్చేస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మొదటి దశ క్లియరెన్సు రావడం వల్ల మహదేవ్‌పూర్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్ధిపేట, యాదాద్రి, మెదక్, నిజామాబాద్, బాన్సవాడ, నిర్మల్‌లో కాల్వల తవ్వకం, రిజర్వాయర్ల నిర్మాణం స్పీడుందుకున్నాయి. మేడిగడ్డను తాకుతూ ప్రవహించే నీటిని సద్వినియోగం చేసుకుంటే, తెలంగాణలో సగం జిల్లాలకు సాగునీరు, మంచినీటి అవసరాలకు ఇబ్బడిముబ్బడిగా సరిపోతాయి. సందిళ్ల, అన్నారంబ్యారేజీల నుంచి కూడా స్వీకరించే నీటిని మిడ్ మానేరు, ఇతర ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు పరిధిలో చివరి పొలానికి కూడా సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది.