రాష్ట్రీయం

నకిలీ నోట్ల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 29: నకిలీ నోట్లు చలామణి చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుల నుంచి 6.03లక్షల రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ తెలిపిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోని గవరపాలెం ప్రాంతానికి చెందిన భూపతి తేజ అలియాస్ శ్రీను గత కొంతకాలంగా హైద్రాబాద్ ఫిల్మ్‌నగర్‌లో కాస్ట్యూమ్స్ డిజైన్ విభాగంలో పనిచేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్‌ల్లో భారీగా డబ్బు కోల్పోవటం, చాలామందికి అప్పు పడటంతో తీర్చే మార్గంలేక నకిలీ నోట్ల చలామణి ప్రారంభించాడు. గణేష్ అనే వ్యక్తి ద్వారా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా కేంద్రంగా పనిచేస్తున్న నకిలీ నోట్ల ముఠా నుంచి దొంగనోట్లు కొనుగోలుచేసి రాష్ట్రంలో విక్రయించటం ప్రారంభించాడు. కొంతకాలం తరువాత గణేష్ మరణించినా, పాత పరిచయాలతో దొంగనోట్ల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. తనతోపాటు హైద్రాబాద్ ఫిల్మ్‌నగర్‌లో కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో పనిచేసిన సహచరులు గుంటూరు జిల్లా తెనాలి పట్టణం బాలాజీరావుపేటకు చెందిన గాజుల రాజేష్, గంగానమ్మపేటకు చెందిన కస్పా పరమేశ్వర్‌రావు, పెదవడ్లపూడిలో నివాసం ఉంటూ విజయవాడలో ట్రాన్స్‌కో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కనికినేని నాగేశ్వర్‌రావుతో కలసి ఒక ముఠాగా ఏర్పడి దొంగనోట్ల వ్యాపారం కొనసాగించారు. తక్కువ శ్రమ, ఖర్చుతో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో భాగంగా హౌరా నుంచి నకిలీ నోట్లు తీసుకువచ్చి రాష్ట్రంలో చలామణి చేసేవారు. భూపతి శ్రీను విశాఖ, విజయనగరం జిల్లాలో దొంగనోట్ల చలామణి చేస్తుండగా, ఆయన సహచరులు రాజేష్, పరమేశ్వర్‌రావు, నాగేశ్వర్‌రావు గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో నకిలీ నోట్ల చలామణి నడిపేవారు. 40వేల రూపాయల అసలు నోట్లు ఇస్తే లక్ష రూపాయల దొంగనోట్లు అందచేసేవారు. ముందుగా అందిన సమాచారం మేరకు పోలీసులు గురువారం రాత్రి విజయనగరం రైల్వేస్టేషన్ ప్రాంతంలో మాటువేసి అరెస్ట్ చేసారు.

ఈ-ప్రగతితోనే
బహుళ ప్రయోజనాలు
తిరుచానూరు, జనవరి 29 : ప్రజలకు బహుళ ప్రయోజనాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ - ప్రగతి ఎంతగానో దోహదపడుతుందని కేంద్ర ఐటి శాఖమంత్రి సుజనాచౌదరి తెలిపారు. శుక్రవారం తిరుపతిలో రాష్ట్ర ఐటి రంగ ఆధ్వర్యంలో ఈ - గవర్నస్స్ సింపోజియం ముగింపు సమావేశంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక అంశాలపైన రైతులకు అవగాహన కొంత తక్కువ ఉంటుందన్నారు. అయితే ఈ - ప్రగతిలో వారికి సైతం ఉపయోగపడేలా అనేక అంశాలను పొందుపరచారన్నారు. ప్రజారోగ్య సంబంధాలకు సంబందించి ఈ ఎం ఆర్ ను కూడా ఈ ప్రాజెక్టులో ఏర్పాటు చెయ్యాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. పాలనలో సత్వర మార్పిడి పారదర్శకత నాయకులలో జవాబుదారీతనం పెంచేలా ఈ - గవర్నస్స్ పని చేస్తుందన్నారు.

ఇంటికో ఉద్యోగం హామీ ఏమైంది?

ముఖ్యమంత్రిని నిలదీసిన వైకాపా అధినేత జగన్

ఆంధ్రభూమి బ్యూరో
కడప, జనవరి 29: తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబునాయుడు మాటల మాంత్రికుడే తప్ప ఆచరణలో ఒక్కటి కూడా చేసింది లేదని శాసనసభ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు వచ్చిన సందర్భంగా తన క్యాంప్ కార్యాలయంలో ఆర్టీసీ కార్మికులు, ఆశా వర్కర్లు జగన్‌ను కలిసి వారి సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగమిస్తానని చెప్పి ఇప్పుడు ఉన్న ఉద్యోగులను తొలగించారని, ఆయన చెప్పేదానికి, చేసేపనికి పొంతన ఉండదనడానికి ఇదే నిదర్శనమన్నారు. 2019లో వైకాపా ప్రభుత్వం రావడం తధ్యమని, అందరి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అంతవరకు అన్నివర్గాల ప్రజలకు న్యాయం కోసం రాజీలేని పోరాటం చేస్తామని అన్నారు. అవసరమైతే ఆందోళనలను చేపడతామని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా వైఎస్సార్ ఆర్టీసీ యూనియన్ ఎస్సీ, ఎస్టీసెల్ నాయకుడు వెంకటేష్‌కు జగన్ పార్టీ కండువా కప్పి అభినందించారు. ఇటీవల పులివెందులలో అనారోగ్యంతో మరణించిన వైఎస్సార్ సన్నిహితుడు రవిస్వామి కుటుంబాన్ని జగన్ పరామర్శించి, వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి, శాసనసభ్యుడు అంజద్‌బాషా, వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు జగన్‌ను కలసి జిల్లా పరిస్థితులపై వివరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, రాజుల భాస్కర్‌రెడ్డి, ఆర్టీసీ వైఎస్సార్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

12న యుఎస్‌టిడిఎతో
విశాఖ ‘స్మార్ట్’ ఒప్పందం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 29: విశాఖ నగరాన్ని ‘స్మార్ట్‌సిటీ’గా రూపొందించే ప్రణాళికలను తయారు చేసేందుకు యునైటెడ్‌స్టేట్స్ ట్రేడ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (యుఎస్‌టిడిఎ)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని చేసుకోనుంది. అమెరికా ఆర్థిక సాయంతో చేపట్టే స్మార్ట్‌సిటీ ప్రణాళికల రూపకల్పనకు సంబంధించి ఎయికాం, ఐబిఎం సంస్థలతో ఫిబ్రవరి 12న విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యుఎస్‌టిడిఎ సమక్షంలో ఒప్పందం కుదరనుందని జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. నగరాన్ని స్మార్ట్‌సిటీగా రూపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర పథక నివేదిక (డిపిఆర్)ను ఎయికాం, ఐబిఎం సంస్థలు రూపొందిస్తాయన్నారు. దీనికోసం యుఎస్‌టిడిఎ రూ.30 కోట్లను మంజూరు చేసిందన్నారు. విదేశీ నిధులతో చేపట్టే అంశం కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉందన్నారు. ప్రాథమిక లాంఛనాలు అన్నీ పూర్తి చేసుకుని, వచ్చే నెల 12న ఒప్పందం ఖరారు చేసుకోనున్నట్టు తెలిపారు. స్మార్ట్‌సిటీ రూపకల్పనలో ఆరు ప్రాజెక్టులను ఈ సంస్థలు చేపట్టి వాటికి సంబంధించిన డిపిఆర్‌లను రూపొందిస్తాయనన్నారు. నిధుల లభ్యతపై కూడా ఆయా సంస్థలు అవసరమైన సూచనలు చేస్తాయన్నారు.