రాష్ట్రీయం

సైకిల్‌తోనే సిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 4: ‘సంపూర్ణ ఆరోగ్యానికి సైకిల్ తొక్కితే మంచిది. ఆ గుర్తుకు ఓటేస్తేనే అభివృద్ధి. నమ్ముకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. శనివారం గుంటూరుకు సమీపంలోని పేరేచర్లలో 520 ఎకరాల్లో నిర్మించిన నగరవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్తీక వనసమారాధనలో భాగంగా సహపంక్తి భోజనం చేశారు. మహిళలతో కోలాటమాడారు. నగరవనంలో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్‌పై కొద్దిసేపు సైకిల్ తొక్కారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘కార్తీక మాసం అంటే పవిత్రతకు సంకేతం. వనాలకు పూజలు చేస్తాం. సాయంత్రం దీపారాధన చేస్తాం. ఇది వారసత్వంగా మనకొచ్చిన సంపద. ప్రపంచ
వ్యాప్తంగా ప్రస్తుతం ప్రకృతి సంపద నాశనమవుతోంది. ఈనేపథ్యంలో చెట్లు, అడవుల విస్తీర్ణాన్ని పెంచాలనే సంకల్పంతో ప్రభుత్వం వనం-మనం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మక ఉద్యమంగా చేపట్టింది’ అని చెప్పారు. జలసిరికి హారతి, నీరు-చెట్టు కార్యక్రమాలతో రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అభివృద్ధి జరగాలని, పేదరికం పోవాలని, భవిష్యత్తులో రాష్ట్రం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలనేదే తన సంకల్పమని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత కష్టాలు ఎదురైనా వెరవకుండా గత మూడున్నరేళ్లలో అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతున్నామని అన్నారు. 2022లో దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా, 2029లో నెంబర్ వన్‌గా, 2050లో ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి సాధించాలనేది తమ లక్ష్యమన్నారు. విద్యార్థులు మానసిక ఉల్లాసం, ఆత్మస్థైర్యం పెంపొందించుకోవాలని ఉద్ఘాటించారు. చక్కగా చదువుకుంటూ ఉల్లాసానికి ఆటలాడాలని, ఆపై లక్ష్యాలను ఎంచుకోవాలన్నారు. ‘మన పిల్లలు మట్టిలో మాణిక్యాలు. ప్రపంచాన్ని జయించే శక్తి వారిలో ఉంది. ఐటిలో అగ్రస్థానం భారతీయులదే’ అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే 15శాతం వృద్ధిరేటు సాధించాల్సి ఉందన్నారు. కష్టాల్లో సైతం రాష్ట్రం 11.7 శాతం వృద్ధిరేటు సాధించిందని గుర్తుచేశారు. అభివృద్ధి శాశ్వత ప్రాతిపదికన జరగాలన్నారు. హరితాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపిచ్చారు. ఎకో టూరిజానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందులో భాగంగా విత్తనాలు చల్లటంతో పాటు అటవీ ప్రాంతం చుట్టూ కాంటూర్ ట్రెంచర్లు, నీటివనరుల కోసం చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాల్లో సూక్ష్మ సేద్యం, ఉద్యానవన పంటలు పండించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. హరితాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా మూడు రాష్ట్ర పండుగలు ఏరువాక, జలసిరికి హారతి, వనం-మనం కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందన్నారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయని, వాటికి అనుగుణంగా 2800 రకాల మొక్కలు పెంచవచ్చని తెలిపారు. వన సంపదతో వన్యప్రాణులను కాపాడుకునే వీలు కలుగుతుందన్నారు. అడవులను కాపాడుకుంటే రాష్ట్రంలో 5750 రకాల వన్యప్రాణులకు జీవం పోసినట్టు అవుతుందన్నారు. 2020 నాటికి 50 శాతం అటవీ విస్తీర్ణాన్ని పెంచాలనేది ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇందుకు ఏటా 25కోట్ల మొక్కలు నాటాలన్నారు. రాజధాని ప్రాంతంలోనూ నగరవనంతో పాటు సింగపూర్ తరహాలో నైట్ సఫారి, జూ పార్కులు ఏర్పాటవుతాయని చెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులు ఏదోరకంగా మానసిక అశాంతికి లోనైనప్పుడు చెట్ల కింద కూర్చుంటే చక్కటి ఆహ్లాదాన్ని అందిస్తాయన్నారు. ఇకపై ప్రతి శనివారం ఉద్యోగులు వనం-మనం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ‘రాష్ట్రంలో అపారమైన వనరులున్నాయి. ప్రకృతి సంపద అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్త పరిజ్ఞానాన్ని నేను తీసుకొస్తా. అభివృద్ధిలో అంతా భాగస్వాములు కావాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆకాశమే హద్దుగా అభివృద్ధి జరగాలనేది తన తాపత్రయంగా చెప్పారు. ‘వనసమారాధనలు కులసమారాధనలుగా మారుతున్నాయి. సమాజం ఎక్కడికక్కడ విడిపోతోంది’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ.. సహపంక్తి భోజనాలతో సమైక్యతను చాటాలని కోరారు. హిందువులు ముస్లిం దేవుళ్లను, ముస్లింలు హిందూ దేవుళ్లను పూజించటంతో పాటు ఇరుమతాలు క్రైస్తవారాధాన చేసినరోజే సామాజిక అసమానతలు తొలగిపోతాయని ఆకాంక్షించారు. ప్రకృతి సంపదతో పాటు మన సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. పసుపు శుభసూచకమని, పసుపు లేనిదే పండుగలు జరగవన్నారు. ఇంకా అందంగా వుండాలంటే ఎరుపు బెటరని వ్యాఖ్యానించారు. ‘ఆనందం లేని జీవితం అనర్థమని, దానికి సార్థకత ఉండదన్నారు. గుంటూరు నగరవనం అభివృద్ధికి 5కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మరో 40 కోట్లతో కొండవీటి కోట ఘాట్‌రోడ్డు నిర్మాణం చేపడతామని, ప్రతి జిల్లాలో నగరవనాలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.

చిత్రం..గుంటూరు సమీపంలోని నగరవనంలో
సైకిల్ తొక్కుతున్న సీఎం చంద్రబాబు