రాష్ట్రీయం

సంకల్పానికి తొలి ఝలక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 4: వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో రేపటి నుంచి పాదయాత్ర చేపట్టనున్న వైసీపీ అధినేత జగన్ సంకల్పానికి తొలి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ తిరుమలకు వెళ్లి సంకల్పయాత్ర విజయవంతం చేయాలని మొక్కుకున్న రోజునే, ఆ పార్టీ నాయకత్వానికి సెంటిమెంటుపరమైన శరాఘాతం తగిలింది. ఆ పార్టీకి చెందిన
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి శనివారం టిడిపిలో చేరడం జగన్‌కు షాక్‌నిచ్చింది.
శనివారం ఉదయం టిడిపి అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే రాజేశ్వరి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామం వైసీపీ శ్రేణులు సెంటిమెంటుపరంగా, మానసికంగా ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు. ఆరునెలల పాటు పాదయాత్ర చేయాలన్న సంకల్పంతో తొలి అడుగు వేసిన జగన్‌కు, తన పార్టీ ఎమ్మెల్యే అదేరోజు రాజీనామా చేయడం అపశకునంగానే అభివర్ణిస్తున్నారు. తన సంకల్పయాత్రకు దైవసంకల్పం కోరిన రోజునే, ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
నిజానికి ఆమె పార్టీ మారేందుకు చాలాకాలం నుంచీ మానసికంగా సిద్ధంగా ఉన్న విషయం జిల్లా నేతలు జగన్‌కు సమాచారం ఇచ్చినా, ఆయన పట్టించుకోలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయా జిల్లాల నేతలు జగన్‌కు చెప్పినా, వెళ్లేవారిని వెళ్లనీయండని తేలిగ్గా కొట్టిపారేశారో తప్ప, వారిని పిలిచి బుజ్జగించి తగిన హామీ ఇచ్చే కనీస ప్రయత్నం చేయడం లేదని నేతలు వివరిస్తున్నారు. పాదయాత్ర ప్రాధాన్యతను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న విషయం తెలిసినా, ఆ మేరకు చర్యలు తీసుకోనందుకే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని విశే్లషిస్తున్నారు.
కాగా, జగన్ పాదయాత్రకు విశేష ప్రాచుర్యం, దానిద్వారా శ్రేణుల్లో ఉత్సాహం పెరిగే అవకాశం ఉన్నందున, దానిని నీరుగార్చే వ్యూహంలో భాగంగా టిడిపి వేసిన ఎత్తుగడ ఫలించినట్లయింది. తమతో టచ్‌లో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలను జగన్ పాదయాత్ర ముగిసేలోగా, విడతల వారీగా టిడిపిలో చేర్చుకుని ఫిరాయింపుపర్వానికి తెరదించే ప్రణాళికకు పదునుపెట్టింది. నిజానికి రాజేశ్వరిని, జగన్ పాదయాత్ర రోజున పార్టీలో చేర్చుకుంటే బాగుంటుందనే యోచన ఉంది. అయితే, బాబు సొంత జిల్లా లోని తిరుమల నుంచి శంఖారావం పూరిస్తున్నందున.. అదేరోజు ఆమెను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా జగన్‌ను సెంటిమెంటు, మానసికంగా దెబ్బతీయాలన్న వ్యూహంతోనే ఆమెను శనివారం పార్టీలో చేర్చుకున్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

చిత్రం..వైకాపా ఎమ్మెల్యే రాజేశ్వరిని తెదేపాలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబు