రాష్ట్రీయం

పద పద పదవీ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, నవంబర్ 5: మరో రెండేళ్లలో జరుగనున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీ నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం నుంచి ప్రజాసంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రధానంగా వైకాపా ఈ యాత్రపై ఆశలు పెట్టుకోగా ఎలాగైనా విజయవంతం చేసేందుకు పార్టీ అధిష్ఠానం, ముఖ్య నాయకులు పక్కా ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. జగన్ తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ప్రజాసంకల్ప పాదయాత్ర చేపడుతున్నారు. ఇందులో భాగంగా 125 నియోజకవర్గాల్లో 180 రోజుల పాటు 3వేల కి.మీ పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్ర కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమై శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగిసేలా ప్రణాళిక తయారు చేశారు. పాదయాత్రలో భాగంగా 6 వేల ప్రాంతాల్లో 5వేలకు పైగా సమావేశాలు నిర్వహించడంతో పాటు 125 బహిరంగ సభలు నిర్వహించి 2కోట్ల మంది ప్రజలకు చేరువయ్యేలా రూపకల్పన చేశారు. అలాగే రచ్చబండ కార్యక్రమం పేరుతో 120 రోజులు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకూ పాదయాత్ర చేపడుతారు. ఇప్పటికే పాదయాత్ర రూట్ మ్యాప్ షెడ్యూల్ ఖరారు చేసి, ఎంపిలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, పార్టీ ముఖ్యనేతలకు అందజేసి దేశ చరిత్రలోనే శాశ్వతంగా నిలిచిపోయేలా పాదయాత్ర చేపట్టనున్నారు. ముఖ్యంగా టిడిపి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే జగన్ లేవనెత్తి పాదయాత్రలో కీలక అంశాలనే ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రతిపక్షపార్టీగా ఉంటూ ప్రతిపక్ష హోదాలో ప్రజలతో మమేకం కానున్నారు. ప్రజాసంఘాలు ఏర్పాటుచేసే 125సమావేశాల్లో ప్రసంగిస్తూ, మరోపక్క 28 మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. పార్టీ రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిశోర్, ముఖ్యసలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో సంకల్పయాత్రకు దిశ దశ నిర్ధేశించుకున్నారు. పాదయాత్రలో అధికార పార్టీ నేతలు ఎవరైనా ఇబ్బందికర పరిస్థితులు కల్పిస్తే వాటిని ఎదుర్కోవడానికి కూడా సర్వం సిద్ధం చేసుకున్నారు. పాదయాత్రలు చేపట్టే ప్రాంతాల్లో
ముందస్తుగానే పెద్దఎత్తున ప్రచారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ వారం రోజులు ముందే రూట్ మ్యాప్ ప్రకారం విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లా కమిటీలన్నీ రద్దు చేసి జిల్లా అధ్యక్ష పదవులు కాకుండా ప్రతి లోక్‌సభకు ఒక అధ్యక్షుడిని, రెండేసి జిల్లాలకు ఒక అధ్యక్షుడిని నియామకం చేశారు. ప్రజాసంకల్ప పాదయాత్ర విజయవంతం అయితే 2019 ఎన్నికల్లో సులభంగా నెగ్గవచ్చనే విశ్వాసంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే తరహాలో రాష్టవ్య్రాప్తంగా ఉన్న పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు తమ తమ నియోజకవర్గాల్లో ప్రజాసంకల్ప పాదయాత్ర విజయవంతం చేయించుకుంటే తమకే లాభం చేకూరుతుందన్న ధీమాతో వారు కూడా ఉత్సాహం చూపుతున్నారు. దాదాపు పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న వైకాపా నేతలు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యాత్రతో సంబంధిత నియోజకవర్గాలకు చెందిన నేతలే యాత్రకు అయ్యే వ్యయం భరించుకోవాల్సి వస్తోంది. రిజర్వుడ్ నియోజకవర్గాల్లో పార్టీ అధిష్ఠానమే ఆర్థిక భారం మోయనున్నట్లు సమాచారం. మొత్తం మీద పాదయాత్ర విజయవంతం చేసేందుకు వైసిపి అధిష్ఠానం సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు తెలుస్తోంది.

చిత్రం..జగన్ మహాసంకల్ప యాత్రకు పెద్దఎత్తున సాగుతున్న ఏర్పాట్లు