రాష్ట్రీయం

నమ్మకమా.. సంతకమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాపురం రాజేంద్ర
తిరుపతి, నవంబర్ 5: తిరుమలలో శ్రీవారిని అన్యమతస్తులు దర్శించుకోవాలంటే ‘విశ్వాస ధృవీకరణ’ (డిక్లరేషన్) పత్రంపై సంతకం పెట్టడం ముఖ్యమా? ‘స్వామిపై నమ్మకంతోనే వారు వస్తున్నార’న్న విశ్వాసం ముఖ్యమా? అన్న చర్చ సాగుతోంది. అన్యమతానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు ‘డిక్లరేషన్’పై సంతకం పెట్టకుండా ఆలయ ప్రవేశం చేయడం తరచూ వివాదంగా మారుతోంది. దీనికి కారణం టిటిడి అనుసరిస్తున్న ‘డిక్లరేషన్ విధానం’లో స్పష్టత లేకపోవడమే. విదేశీయులు, వివిధ మతాలకు చెందినవారు శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు. వీరిలో కొందరు క్యూలో వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మరికొంతమంది రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను తీసుకుని వెళుతున్నారు. ఆన్‌లైన్‌లో దర్శనం టిక్కెట్లు కొనుక్కొని అన్యమతస్థులు కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భాల్లో అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ తీసుకోవడం లేదు. రద్దీ కారణంగా అది అసాధ్యం కూడా. అయితే, విఐపి బ్రేక్ దర్శనంలోనో లేదా టిటిడి అధికారులకున్న విచక్షణాధికారాలతో ఆర్జిత సేవా టికెట్లు పొంది స్వామి దర్శనం చేసుకుంటున్న అన్యమతస్థుల నుంచి మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో టిటిడి సిబ్బంది డిక్లరేషన్ తీసుకుంటున్నారు. ఇలా ప్రముఖుల నుంచి డిక్లరేషన్ తీసుకున్నంత మాత్రాన టిటిడి లక్ష్యం నెరవేరుతుందా? దీనికి జవాబు లేదు.
హైందవ ప్రముఖుల వెంట అన్యమతస్థులు వచ్చినా వారు డిక్లరేషన్ ఇచ్చి ఆలయంలోకి వెళ్లడం చాలా అరుదు. నిజానికి డిక్లరేషన్ వల్ల టిటిడి ఏం సాధిస్తున్నది అనుమానమే. హిందూ మతానికి చెందిన నాస్తికులు, వామపక్షాల నేతలు కూడా స్వామివారిని సందర్శిస్తున్న సందర్భాలు లేకపోలేదు. వీరంతా యథాలాపంగా ఆలయ ప్రవేశం చేస్తున్నారు. అలాంటప్పుడు అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ తీసుకోవడం వల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటో టిటిడి స్పష్టం చేయాలి. తిరుమలలోని శ్రీవారిని సర్వాంతర్యామిగా, ఆయన అందరివాడని భక్తులు విశ్వసిస్తారు. డిక్లరేషన్ తీసుకోవడం ద్వారా స్వామివారిని హిందువుల దేవుడిగా ముద్రవేస్తున్నారన్న వాదన వ్యక్తమవుతోంది. తిరుమల ఆలయాన్ని హిందువులే దర్శించుకోవాలన్న శాసనం ఏమైనా ఉందా? అన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి ఆధారాలుంటే అన్య మతస్థులను అలిపిరి వద్దే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలి. అన్యమతస్థులు ఇచ్చే విరాళాలను టిటిడి తిరస్కరించాలి. వారు ఇచ్చే కానుకలను స్వీకరిస్తూనే, ఆలయ ప్రవేశానికి విశ్వాసపత్రంపై సంతకం చేయాలనే నిబంధన సరికాదని మేధావులు అంటున్నారు. నేడు ఎంతోమంది హిందువులు
చర్చిలకు, దర్గాలకు వెళుతున్నారు. అక్కడలేని నిబంధనలను తిరుమలలో ఎందుకని కొందరు అంటున్నారు. చాలామంది రాజకీయ నాయకులు దర్గాలు, చర్చిలకు వెళ్లి ప్రార్థనలు, సహపంక్తి భోజనాల్లో పాల్గొంటున్నారు. అలాంటప్పుడు వారిని ‘పరమత విశ్వాసకులు’గా భావించి శ్రీవారి ఆలయంలోకి రానీకుండా టిటిడి యాజమాన్యం నియంత్రించగలుగుతుందా? అన్న ప్రశ్నలూ లేకపోలేదు.
కేంద్రమంత్రి హోదాలో వచ్చినవారు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా వారి వద్ద డిక్లరేషన్ తీసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారని టిటిడి అధికారులు అంటున్నారు. అయితే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు. సిఎం హోదాలో ఆయన ప్రతి ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనానికి పట్టువస్త్రాలను సమర్పించడానికి వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్‌ను టిటిడి అధికారులు అడగలేదు. 26సార్లు స్వామివారిని వైఎస్ దర్శించుకున్నా డిక్లరేషన్ ఇవ్వలేదని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. వైఎస్‌ఆర్‌తో కలసి ఆయన కుమారుడు జగన్ అనేక సార్లు స్వామివారిని దర్శించుకున్నారు. తాజాగా పాదయాత్ర ప్రారంభించడానికి ముందు జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేయకుండా, తనకు నమ్మకం ఉందని నోటిమాటగా చెప్పి శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో మరోమారు డిక్లరేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. అన్యమతస్థులు కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలనేవారు కొందరైతే, భగవంతుడిపై నమ్మకం ఉంది కాబట్టే ఆయన స్వామివారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందడానికి వచ్చారని అటువంటప్పుడు డిక్లరేషన్ ఎందుకన్న మరో వాదన వినిపిస్తోంది. దీంతో అన్యమతస్థులు వెంకన్న దర్శనం చేసుకోవడం రాజకీయ రంగం పులుముకుంటోంది. ఇది టిటిడి అనుసరిస్తున్న విధాన నిబద్ధతను ప్రశ్నించే విధంగా తయారైంది. ఏదేమైనా శ్రీవారి దర్శనానికి నమ్మకమా? సంతకమా? ఏది ముఖ్యమో టిటిడినే తేల్చాలి.