రాష్ట్రీయం

దేశ సమైక్యత అందరి కర్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 6: దేశ సమైక్యతను కాపాడటం అందరి కర్తవ్యమని, మనదేశం, సమాజం పట్ల శ్రద్ధాసక్తులతో ప్రతీ ఒక్కరూ ఉండాలని భారత ఉపరాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. మతం వ్యక్తిగతమని, సంస్కృతి జీవన విధానమని, అది వారసత్వంగా అందిపుచ్చుకుని, భారతీయ సంస్కృతిని కాపాడాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఆదివారం జరిగిన పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన భారత ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు విద్యార్థులనుద్దేశించి స్ఫూర్తిమంతమైన ప్రసంగం చేశారు. ఆదికవి నన్నయ స్ఫూర్తితో 2006లో ఏర్పాటైన నన్నయ యూనివర్సిటీలో 460 కళాశాలలు, లక్షమంది విద్యార్థులు ఉండటం ఆనందకరమన్నారు. చదువు మార్కుల కోసమే కాదని, వ్యక్తిత్వంలో మార్పు కోసమన్నారు. నైపుణ్య శక్తితో, వ్యక్తిత్వ వికాసంతో ఎదగాలన్నారు. తల్లిదండ్రులు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలలు కనాలని, ఆ కలల సాకారానికి చదువు ద్వారా ఆకారం తెచ్చుకుని ప్రాకారం కట్టుకోవాలన్నారు. తాము చదువుకున్న సమయంలో కానె్వంట్లు లేవని, కష్టపడి చదివి ఓర్పుతో మార్పు తెచ్చుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా అలా ఇష్టపడి, కష్టపడి చదువుకుని పైకి వచ్చినవారేనన్నారు. ప్రధాని మోదీ కూడా ఇష్టపడి, కష్టపడి చదువుకుని ప్రపంచం మెచ్చిన ప్రధాని అయ్యారన్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా విద్యార్థులకు గూగుల్ కన్నా గురువు ముఖ్యమన్నారు. కన్నతల్లిని, జన్మభూమిని జీవితంలో మర్చిపోకూడదన్నారు. అందుకే తాను ఎంత ఎదిగినా
తన నేలను మర్చిపోనని, అందుకే ఎపికి ఏదో చేయాలని తానెపుడూ ఆలోచిస్తూ ఉంటానన్నారు.
నేడు మాతృభాష కంటే పరభాష పైనే చాలామందికి మమకారం కనిపిస్తోందని, కొంతమందికి ఇంగ్లీషు బలహీనత పట్టుకుందని ఉప రాష్టప్రతి ఆవేదన వ్యక్తంచేశారు. ఇది సరికాదని, మాతృభాష కళ్లు అయితే, పరభాష కళ్లద్దాలు వంటిదన్నారు. కళ్లుంటే ఏ కళ్లద్దాలు పెట్టుకునైనా చూడొచ్చన్నారు. ప్రధాని పర్యటనలో తాను చూసిన సందర్భంలో ఆయా దేశాల ప్రధానులు వారి వారి మాతృభాషలోనే మాట్లాడుతున్నారని, అంతమాత్రం చేత వారికి ఇంగ్లీషు రాక కాదన్నారు. ఇంగ్లీషు విజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి గానీ మాతృభాషను మర్చిపోకూడదని, భాష భావవ్యక్తీకరణ కోసమేనని గుర్తుంచుకోవాలన్నారు. అమ్మ అనే పిలుపు అంతరాళం నుంచి వస్తుందని, మమీ అంటే మూతి నుంచి వస్తుందని వెంకయ్య నాయుడు చమత్కరించారు. మాతృభాష మాధుర్యం కాకినాడ కాజాలా, ఆత్రేయపురం పూతరేకులా, గోదావరిలో ఎదురీదే పులసలా ఉంటుందన్నారు. ప్రతీ ఒక్కరూ మన కోసమే కాకుండా సమాజం కోసం కూడా పనిచేయాలన్నారు. నేడు కొంతమంది వందేమాతరాన్ని విమర్శిస్తున్నారని, వందేమాతరం అంటే దేశ జనానికి నమస్కారం అని, ఈ దేశ సంస్కృతి, స్ర్తిని గౌరవించడమని, భారతమాత అంటామని, నదుల పేర్లు కూడా స్ర్తి పేర్లే వుంటాయని, ఇది మన సంస్కృతి పరంగా స్ర్తిపై వున్న గౌరవానికి దర్పణమన్నారు. ఎన్నో దేశాల చరిత్రలు చరిత్రలో కలిసిపోతే, భారత చరిత్ర దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. ప్రధాని మోదీ కృషివల్ల ప్రపంచం ఇండియాను గుర్తిస్తోందన్నారు. ఐటిని హాబీగా చేసుకుని బ్యూటీగా మార్చుకోవాలన్నారు. విద్యార్థులు వివిధ రంగాల్లో ప్రావీణ్యం సాధించాలని, అందరిలా కాకుండా మనం విశిష్టంగా ఉండాలని అనుకోవాలన్నారు. అందరూ ఎన్టీఆర్ కాలేరు.. అందరూ మోదీ కాలేరు.. కానీ ఏదో విశేషంగా జీవించాలని మాత్రం ప్రతీ విద్యార్థి అనుకుని వారిలోని ప్రతిభను గుర్తించాలన్నారు. ప్రతీ ఒక్కరిలోనూ తెలివి ఉంటుందని, మనలో ప్రతిభను వెలికితీసే విధంగా కృషిచేయాలని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ విజ్ఞానాన్ని సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. దేశం ఇంత అభివృద్ధి సాధించినా ఇంకా 20 శాతం నిరక్షరాస్యత వెంటాడుతోందన్నారు. అందుకే ప్రధాని ‘బేటీ బచావో, బేటీ పడావో’ వంటి కార్యక్రమాలతో కృషిచేస్తున్నారన్నారు. ప్రపంచ టాప్ టెన్ విశ్వవిద్యాలయాల్లో భారత్ విశ్వవిద్యాలయాలకు స్థానం లేకపోవడం విచారకరమని, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలుగా అభివృద్ధి సాధించాలన్నారు. అధ్యాపకులకు నిరంతర పునశ్చరణ ఉండాలన్నారు. గురుకులం మాదిరిగా విద్యను అందించాలన్నారు. విద్యార్థులపై వత్తిడితో కాకుండా స్వేచ్ఛగా చదువుకునే విధానాలను అలవర్చాలని ఉపరాష్టప్రతి సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు రోల్‌మోడల్‌గా ఉండాలన్నారు. విద్యార్థులు చదువే కాకుండా శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. యోగా భారతీయ కళ అని, యోగా చేస్తే యోగ్యులవుతారన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు సన్మార్గంలో వినియోగించుకోవాలని, విశృంఖలత్వం వేసే సాంకేతికతకు దూరంగా వుండాలని, టెక్నాలజీ వెర్రితలలు వేయకూడదని సందేశాత్మక ఉపన్యాసం చేశారు. సభకు విసి ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు అధ్యక్షత వహించగా ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీలు మాగంటి మురళీమోహన్, తోట నరసింహం, పండుల రవీంద్రబాబు, గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేష్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సభలో ప్రసంగిస్తున్న ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు