రాష్ట్రీయం

ఉపాధితో దశ తిరిగిన బండ్లపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్పల, జనవరి 29: ఉపాధి పనుల కల్పనలో బండ్లపల్లి గ్రామం మరోసారి అందరి దృష్టికి ఆకర్షించనుంది. పదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించింది. 2006 ఫిబ్రవరి 2వ తేదీ అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ చేతుల మీదుగా గ్రామంలో ఉపాధి పథకం లాంఛనంగా ప్రారంభమైంది. నాడు ప్రధానమంత్రి చేతుల మీదుగా గ్రామానికి చెందిన బాలనరసింహుడు, ఓబిరెడ్డి, పెద్దక్క వేదికపై జాబ్‌కార్డులు అందుకున్నారు. ఈ పథకం ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఉపాధి పనుల అమలు తీరుతెన్నులు తెలుసుకునేందుకు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఫిబ్రవరి 2వ తేదీ గ్రామానికి రానున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
బండ్లపల్లి గ్రామంలో ప్రభుత్వం ఉపాధి కింద ఇప్పటివరకు రూ.2,83, 33,000 ఖర్చు పెట్టింది. 2006లో ఈ పథకం ప్రారంభించినప్పుడు గ్రామంలో 530 మంది కూలీలు జాబ్‌కార్డులు పొంది ఉపాధి పనులకు వెళ్ళేవారు. కూలీల సంఖ్య క్రమంగా పెరుగుతూ నేడు 957కి చేరింది. ప్రస్తుతం కూలీలకు రోజుకు సరాసరి రూ.150 వేతనం లభిస్తోంది. ఈ పథకం ద్వారా గ్రామంలో వ్యవసాయ భూముల్లో వాలుకు అడ్డంగా రాతికట్టడాలు, మట్టికట్టలు నిర్మించారు. కొండలపై కురిసే వర్షపు నీరు వ్యవసాయ పొలాలకు రాకుండా వంకల ద్వారా మళ్ళించే కందకాలు నిర్మించారు. వాటర్‌షెడ్ ద్వారా చెక్‌డ్యాంల నిర్మాణాన్ని ఉపాధి కూలీలే చేపట్టారు. దీంతో కరవు విలయతాండవం చేస్తున్న బండ్లపల్లి గ్రామంలో భూగర్భజలాలు పెరిగి వ్యవసాయ, బోరుబావుల్లో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ఉపాధి పథకం కింద గ్రామంలో దళితులతో పాటు పలువురు రైతుల పొలాల్లో 7,500 మామిడి మొక్కలు నాటి హరిత విప్లవం సాధించారు.
అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ చేతుల మీదుగా జాబ్‌కార్డులు పొందిన బాలనరసింహులు, పెద్దక్క, ఓబిరెడ్డి ఇప్పటికి ఉపాధి పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారని ఫీల్ట్ అసిస్టెంట్ శివారెడ్డి తెలిపారు.
గ్రామంలో ఉపాధి హామీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి శివారెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. పనులు మొదలైనప్పటి నుండి గ్రామంలో వలసలు పూర్తిగా తగ్గిపోయాయన్నారు. ఇల్లు లేని కూలీలు అనేకమంది సొంత ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవిస్తున్నారన్నారు. ఇదంతా ఉపాధి పథకం మహత్యమేనన్నారు.

ఇక ఆన్‌లైన్‌లోనే
ఆర్టీఏ సేవలు

వచ్చే నెల నుంచి అందుబాటులోకి
షోరూంల వద్దే రిజిస్ట్రేషన్
యంత్రాలతోనే ఫిట్‌నెస్ పరీక్షలు

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 29: రవాణాశాఖ ద్వారా అందే అన్ని సేవలు ఇకపై ఆన్‌లైన్ ద్వారానే చేసుకునే అవకాశం త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తేవాలని భావించినా, అనివార్య కారణాల వల్ల మరో 15 రోజులపాటు వాయిదా వేసినట్టు రవాణాశాఖ అధికారులు తెలియచేశారు. రవాణాశాఖలో ఏ పని కావాలన్నా ఏజెంట్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఏ పనికైనా ప్రభుత్వానికి చెల్లించే మొత్తానికి మూడు రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తోంది. ఏజెంట్లను కాదని నేరుగా కార్యాలయంలో పని చేయించుకోవడం సామాన్యులకు సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో రవాణాశాఖలో అవినీతి పేరుకుపోయింది. చాలామంది ఆర్టీఓలు కోట్లకు పడగలెత్తారు. ఆర్టీఏ కార్యాలయాల వద్ద ఉన్న ఏజెంట్లే ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులకు డబ్బులు అందించే ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆర్టీఏ కార్యాలయాల్లోని సుమారు 83 సేవలను ఆన్‌లైన్‌లో పెట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీటన్నింటికీ త్వరలోనే తుది రూపం కల్పించబోతున్నారు. అయి తే వాహనాల ఫిట్‌నెస్, లైసెన్స్, ఎల్‌ఎల్‌ఆర్‌లు మాత్రం ఆర్టీఏ కార్యాలయాల ద్వారానే చేయించుకోవలసి ఉంటుంది. వాహనాల ఫిట్‌నెస్‌ను కూడా మాన్యువల్‌గా చేయరు. వాటికి కూడా యంత్రాలు వచ్చేస్తున్నాయి. ఒక్కో యంత్రం ఖరీదు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఉంటుంది. ఇక షోరూంలలో వాహనాలు కొనుగోలు చేసుకునే వారు వాటి రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. షోరూంలలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. వాహనదారుని వివరాలు నింపిన దరఖాస్తులను షోరూం సిబ్బంది ఆన్‌లైన్ ద్వారా ఆర్టీఏ కార్యాలయానికి పంపుతారు. వారు ఆ దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను జారీ చేస్తారు. ఇది కేవలం కొద్ది గంటల్లోనే జరిగిపోతుంది. ప్రస్తుతం వాహనాలు కొనుగోలు చేసే సమయంలో టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారు. ఇకపై వాహనం కొన్న కొద్ది గంటల్లోనే పర్మినెంట్ నెంబర్ వచ్చేస్తుంది. ఈ ఆన్‌లైన్ సేవలు ఫిబ్రవరి 15 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

శ్రీవారికి బ్యాటరీ కారు విరాళం
తిరుమల: చెన్నైకు చెందిన పార్థసారథి నాలుగు సీట్లు కలిగిన బ్యాటరీ కారును టిటిడికి విరాళంగా ఇచ్చారు. 3.19 లక్షల రూపాయలు విలువ చేసే ఈ బ్యాటరీ కారును శుక్రవారం ఆలయం ముందు జెఈవో శ్రీనివాసరాజు స్వీకరించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఇఓ చిన్నంగారి రమణ, ట్రాన్స్‌పోర్ట్ డిఐ భాస్కర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయంముందు బ్యాటరీ కారును టిటిడి అధికారులకు అప్పగిస్తున్న దృశ్యం