రాష్ట్రీయం

జాతీయ జాతరగా మేడారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: జాతీయ జాతరగా మేడారాన్ని గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి మరోమారు కేంద్రానికి పంపుతామని ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో మాట్లాడుతూ మేడారం జాతర వచ్చే ఏడాది జనవరి- ఫిబ్రవరిలో జరగనుందని, జాతరకు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి సుమారు కోటిమంది వస్తారని అంచనా వేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 3న రూ.80.55 కోట్లు విడుదల చేస్తూ పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చిందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గిరిజన సాంస్కృతిక పండుగగా మేడారం జాతరను జరపడానికి ఐదు కోట్ల రూపాయిలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖకు ఒక లేఖ రాసిందని అన్నారు. సమ్మక్క- సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వానికి గతంలోనే ప్రతిపాదనలు పంపించామని, ఈ ప్రతిపాదనలు
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. అంతకుముందు ఈ అంశంపై రసమయి బాలకిషన్ మాట్లాడుతూ భక్తులకు మరిన్ని సౌకర్యాలను కల్పించాలని అన్నారు. దానికి మంత్రి బదులిస్తూ ఎంత నిధులు ఖర్చయినా వెనుకాడేది లేదని, అలాగే ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ముగ్గురు మంత్రులతో కమిటీని వేశామని పేర్కొన్నారు.
ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చూడండి
వచ్చే ఏడాది జనవరి 31 నుండి జరిగే మేడారం మహాజాతరకు హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారిపై ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలను ముందుగానే చేపట్టాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ, రహదారుల శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. ఈ జాతరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తారని చెప్పారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ, జాతీయ రహదారుల శాఖ, ఆర్ అండ్ బి శాఖ అధికారులు, ఎల్ అండ్ టి సంస్థ ప్రతినిధులతో కడియం శ్రీహరి సచివాలయంలో సమీక్షించారు. కోటి మంది వరకూ భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రోడ్లను పూర్తిగా అభివృద్ధి చేయాలని సూచించారు. వచ్చే రెండు నెలల్లో పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో ఎన్ హెచ్ రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, జాతీయ రహదారుల చీఫ్ ఇంజనీర్ గణపతి రెడ్డి, ఎస్‌ఇ రాజిరెడ్డి, ఈఈ హఫీజ్, ఎల్ అండ్ టి ప్రతినిధి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.