రాష్ట్రీయం

మళ్లీ హోదా హోరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 7: ఎన్నికల ముందే కూస్తున్న రాజకీయ కోయిలలకు కేంద్రప్రభుత్వ నిర్లిప్త వైఖరి బ్రహ్మాస్త్రాలుగా మారుతున్నాయి. రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీతోపాటు, ప్రత్యేక ప్యాకేజీ, విభజన హామీలు ఇప్పటివరకూ అమలుచేయని వైనానికి తోడు ఏడాదిక్రితం నాటి పెద్దనోట్ల రద్దు, తాజా జీఎస్టీ నిర్ణయాలు ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. మళ్లీ హోదా, ప్యాకేజీ, విభజన హామీల ఉద్యమాలకు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు పదునుపెడుతుండటం రాష్ట్రంలో బలపడాలని భావిస్తోన్న బీజేపీని సమస్యల సుడిగుండంలోకి నెట్టనుంది.
రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో ఇప్పటికీ వేటినీ సంపూర్ణంగా అమలుచేయని కేంద్రప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతోంది. రాజకీయంగా, సైద్ధాంతికంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలకు ఈ అంశం ఆయుధంగా మారుతోంది. ఒకరకంగా ఇది రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకీ ఇబ్బందికర పరిణామమే అయినప్పటికీ, కేంద్రం కావాలనే రాష్ట్రానికి మొండిచేయి చూపిస్తోందన్న ప్రచారం క్షేత్రస్థాయికి చేరడంతో ఆ ప్రభావం అధికారపార్టీపై పెద్దగా కనిపించడం లేదు. ఈ అంశంలో ప్రజలు బీజేపీనే ప్రధాన ముద్దాయిగా భావిస్తున్న పరిస్థితి సోషల్ మీడియా, టీవీ, కాలేజీ విద్యార్ధుల చర్చల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో విపక్షాలు చేస్తున్న విమర్శలతో బీజేపీ ముద్దాయిగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని గ్రామస్థాయిలో ప్రచారం చేయాలని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నిర్ణయించింది. అందులో భాగంగా ఈనెల 16న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఆ తర్వాత 25 మంది ఎంపీలపై ఒత్తిడి చేయడంతోపాటు, ఢిల్లీకి వెళ్లి ప్రధాని ఇంటినీ ముట్టడించాలని తీర్మానించింది. ఈ మేరకు సమితి తాజాగా నిర్వహించిన సమావేశానికి టీడీపీ, బీజేపీ మినహా అన్ని పార్టీల అగ్రనేతలు, ప్రజాసంఘాలు హాజరయి తమ మద్దతు ప్రకటించారు. చలో అసెంబ్లీ అనంతరం కార్యాచరణ రూపొందించుకుని, దానిని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ చేర్చేందుకు సిద్ధమవుతోంది.
గత మూడున్నరేళ్ల నుంచి కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయం వివరాలతోపాటు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇచ్చిన నిధులు, ప్యాకేజీ కింద రావలసిన నిధులు, రెవిన్యూలోటు చెల్లింపులు, విభజన హామీల వివరాలతో కరపత్రాన్ని రూపొందించనుంది. దీనిద్వారా కేంద్రంలోని బీజేపీ ఏపీకి టోపీ పెడుతుందన్న సంకేతాలను కిందిస్థాయికి చేర్చనుంది. టీడీపీ-వైసీపీలో ఏదో ఒక దాని ద్వారా రాజకీయ లబ్థిపొందాలనుకుంటున్న బీజేపీ వ్యూహాన్ని నీరుగార్చడంతోపాటు, రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేసిందన్న భావన స్థిరపరిచే వ్యూహానికి లేపనుంది.
కాగా గత కొద్దికాలం నుంచి సోషల్‌మీడియాలో సైతం రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోందంటూ వస్తోన్న కథనాలు, కార్టూన్లు, వ్యంగ్యాస్త్రాలకు విశేష ఆదరణ లభిస్తుండటం ప్రస్తావనార్హం. దానికి ఇటీవల జీఎస్టీ నిర్ణయం కూడా తోడయి ఆగ్రహజ్వాల పెరుగుతుండంతో బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. వ్యాపారులు, మధ్యతరగతి ప్రజల్లో జీఎస్టీపై విపరీత వ్యతిరేకత వ్యక్తమవుతుండటం రాష్ట్రంలో ఎదగాలనుంటున్న బీజేపీకి సంకటమేనంటున్నారు.
గతంలో హోదా ఉన్న రాష్ట్రాలకు రాయితీలు రద్దు చేస్తున్నామని చెప్పిన కేంద్రం.. తాజాగా వాటికి రాయితీలను 2027 వరకూ పొడిగించడమే కాకుండా, ముందుగా 27,400 కోట్లు కేటాయించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విభజన హామీలో కనీసం 6 శాతం కూడా పూర్తి చేయలేదని, విశాఖ రైల్వేజోన్, కడపలో ఉక్కు పరిశ్రమలను ప్రజలు ప్రశ్నిస్తుంచడం చర్చనీయాంశమయింది. సీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు 24,350 కోట్లు కావాలని అడిగితే, జిల్లాకు 50 కోట్లు చొప్పున 350 కోట్లు మాత్రమే ఇవ్వడాన్ని వివిధ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. నెటిజన్లు వీటిపై స్పందిస్తున్న తీరు, బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న కామెంట్లు,
పెడుతున్న కార్టూన్లు విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
నిజానికి మత్స్యరంగ సమగ్రాభివృద్ధికి కేంద్రం 112 కోట్లు విడుదల చేస్తే, అందులో ఏపీ వాటా చిల్లిగవ్వ కూడా లేదు. దుగరాజపట్నం పోర్టుకి 25 వేల కోట్ల అవసరమైతే ఇప్పటివరకూ నయాపైసా ఖర్చు చేసిన దాఖలాలు లేవు. అసలు ఆ ప్రాజెక్టు ఉందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. రాజధాని అమరావతి వౌలిక సదుపాయాలు, కీలక నిర్మాణాలకు 40 వేల కోట్లు అవసరమన్న నివేదికను, వెక్కిరిస్తూ 2500 కోట్లు మాత్రమే ఇవ్వడం విమర్శలకు గురవుతోంది. ‘ఇవన్నీ రాష్ట్రంలో బలపడాలనుకుంటున్న బీజేపీకి ఇబ్బందికర పరిణామాలే. రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయడం లేదన్న భావన జనంలో ఉంది. చేతికి బిల్లు అందుకున్న ప్రతిసారీ జీఎస్టీ బాధితుల సంఖ్య పెరిగి, అది ఆ పార్టీకే నష్టం కలిగిస్తుంది. వాటిని తిప్పికొట్టే యంత్రాంగం కూడా బిజెపిలో కనిపించడం లేదు. బీజేపీని టీడీపీ ఎంతకాలం మోస్తుందో తెలియదు. తర్వాత నిర్ణయాలేమో గానీ ఇప్పుడైతే బీజేపీ లోపాలు టీడీపీకీ నష్టంగా పరిణమిస్తున్నాయ’ని రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు.