రాష్ట్రీయం

బాబూ.. సీమపై ఎందుకంత ప్రేమ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 12: పదవుల పందేరంలో రాయలసీమకు పెద్దపీట వేస్తుండటంతో కోస్తా టీడీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రగులుతోంది. శాసనసభ చీఫ్ విప్‌గా అనంత జిల్లా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, శాసనమండలి చీఫ్ విప్‌గా అదే జిల్లా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు ఇవ్వాలని సిఎం చంద్రబాబు నిర్ణయించారంటూ వస్తున్న వార్తలు కోస్తా ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతున్నాయి. రెండు పదవులూ అగ్రకులాలకు కట్టబెట్టటం మంచిదికాదనే వాదనా వినిపిస్తోంది. ఇప్పటికే కేబినెట్‌లో సిఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, అమర్‌నాథ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, కేఈ కృష్ణమూర్తి, అఖిలప్రియ, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు రాయలసీమ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీలో అనంతపురం జిల్లా ఎమ్మెల్యే యామినీబాల, కడప జిల్లా ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌రెడ్డి విప్‌లుగా వ్యవహరిస్తున్నారు. మళ్లీ ఇప్పుడు అనంతపురం జిల్లాకే మండలి, శాసనసభ చీఫ్ విప్ పదవులు ఇస్తున్నారన్న వార్తలను కోస్తా ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా
మండలి చైర్మన్‌గా కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్‌ను ఖరారు చేశారు. ఇలా అన్ని కీలక పదవులూ రాయలసీమకే దక్కితే ఇక తమ ప్రాంతం మాటేమిటని కోస్తా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాను పార్టీ విస్మరించిందంటూ అసంతృప్తి వ్యక్తవౌతోంది. సహజంగా సిఎం చంద్రబాబు ఇలాంటి పదవులకు ఎంపిక విషయంలో ప్రాంతాలు, కులాలను బేరీజు వేసుకునే నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఈసారి ఒకే జిల్లా, ఒకే ప్రాంతం వారికి రెండు కీలక పదవులు ఇవ్వాలంటూ తీసుకున్న నిర్ణయం కోస్తా ఎమ్మెల్యేలను విస్మయపరుస్తోంది. శాసనమండలిలో కేశవ్‌కంటే సీనియర్లు గాలి ముద్దుకృష్ణమనాయుడు, కరణం బలరాం, టీడీ జనార్ధనరావు, చిక్కాల రామచంద్రరావు, ఎంవీఎస్ మూర్తి, వైవీబీ రాజేంద్రప్రసాద్ ఉన్నారు. వీరిలో ముద్దుకృష్ణమనాయుడు వినా మిగతా వారంతా కోస్తా ప్రాంతీయులే. కనుక వీరిలో ఎవరో ఒకరికి చీఫ్ విప్ పదవి కట్టబెడితే బాగుండేదన్న వాదన వినిపిస్తోంది. పైగా చీఫ్ విప్ పదవులు రెండూ అగ్రకులాలకే ఇవ్వడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటివరకూ ఎస్టీలకు ఎలాంటి అవకాశం ఇవ్వనందున, రెండిటిలో ఒక పదవి ఆ వర్గానికిస్తే సముచితంగా ఉండేదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఒకవేళ కేశవ్‌కు చీఫ్ విప్ ఇస్తే.. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి గతంలో కేశవ్ కోసం చేసిన ప్రయత్నాలు ఇప్పటికి ఫలించినట్టవుతుంది. మంత్రివర్గ విస్తరణకు ముందు రేవంత్, వేం నరేందర్‌రెడ్డి విజయవాడ వచ్చి కేశవ్‌కు మంత్రి పదవి ఇవ్వాలని బాబును కోరారు. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో చీఫ్ విప్ ఇవ్వాలని వారు సూచించినట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు రేవంత్ నిష్క్రమించిన తర్వాతగానీ ఆయన కోరిక ఫలించినట్లుందని పార్టీవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇటీవల రేవంత్ తన పాత మిత్రుడైన కేశవ్, పరిటాల సునీత తనయుడు కేసీఆర్ ద్వారా హైదరాబాద్‌లో బీరు కంపెనీలకు లైసెన్సు ఇప్పించుకున్నారని ఆరోపించారు. పరిటాల తనయుడి పెళ్లికి కేసీఆర్ హాజరైన సందర్భంలో కేశవ్ ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలగటం, ఏకాంతంగా మాట్లాడటం పార్టీలో రచ్చరేపింది. ఆ క్రమంలో బాబు కూడా సమన్వయ కమిటీ సమావేశంలో కేశవ్ వ్యవహార శైలిని తప్పుపట్టిన వైనం మీడియాలో ప్రముఖంగా వచ్చిన సంగతి కూడా తెలిసిందే.