రాష్ట్రీయం

నేడు కాపు గర్జన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ/ రాజమహేంద్రవరం, జనవరి 30: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపుమేరకు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ఐక్య గర్జన బహిరంగ సభ తూర్పు గోదావరి జిల్లా తునిలో ఆదివారం జరగనుంది. తూర్పు సెంటిమెంట్‌గా అటు ఉత్తరాంధ్ర, ఇటు ఉభయ గోదావరి జిల్లాలు, రాయలసీమకు మధ్యలోని తునిలో ఐక్య గర్జనకు భారీ ఏర్పాట్లు చేశారు. కాపులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు చేపట్టిన ఆఖరి పోరాటంగా ముద్రగడ అభివర్ణిస్తున్న ఐక్య గర్జనకు రాష్టవ్య్రాప్తంగా కాపు సామాజికవర్గం పెద్దఎత్తున తరలివచ్చే అవకాశాలున్నాయి. 16వ నెంబర్ జాతీయ రహదారిలో తుని సమీపంలో వెలమకొత్తూరు వద్ద సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో జరిగే సభకు సుమారు 6 లక్షలమంది హాజరవుతారని అంచనా. సార్వత్రిక ఎన్నికలకు ముందు కాపులకు అనేక హామీలిచ్చిన చంద్రబాబు, తక్షణం అమలుచేయాలని ముద్రగడ డిమాండ్ చేస్తున్నారు. కాపులను బీసీలుగా గుర్తించాలని, కాపు కార్పొరేషన్‌కు వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలన్న ప్రధాన డిమాండ్లతో ఐక్య గర్జన నిర్వహిస్తున్నట్టు ముద్రగడ ప్రకటించారు. కాపుల ఐక్య గర్జనకు వైఎస్సార్ కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఐక్య గర్జన తరువాత ముద్రగడ తమ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు వైకాపా చెబుతోంది.
రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే సభకు కాపు సామాజిక వర్గానికి చెందిన సినీ దర్శకుడు దాసరి నారాయణరావు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు సి రామచంద్రయ్య, కొత్తపల్లి సుబ్బారాయుడు, చేగొండి హరిరామజోగయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, వంగవీటి రాధాకృష్ణ, తెలంగాణ నుంచి కె కేశవరావు, వి హనుమంతరావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరవుతారని తూర్పు గోదావరి జిల్లా కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు తెలిపారు. పార్టీలకు అతీతంగా కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ మాత్రమే మాట్లాడతారని చెప్పారు.
ఐక్య గర్జనకు లక్షల సంఖ్యలో కాపు సామాజికవర్గం తరలివచ్చే అవకాశాలు కనిపిస్తుండటంతో తెదేపా నేతల్లో కలవరం మొదలైంది. ముద్రగడ సభకు ఎట్టి పరిస్థితుల్లో తెదేపా కాపు సామాజికవర్గం వెళ్ళకుండా కట్టడి చేయాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు ఇదివరకే పార్టీ నేతలను ఆదేశించినట్టు సమాచారం. దీంతో ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, తూర్పు గోదావరి జెడ్పీ చైర్మన్ నామన రాంబాబులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు.
కదులుతున్న దండు
బహిరంగ సభకు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో కాపులు తరలివచ్చే ఏర్పాట్లు చేసుకున్నారు. తెలంగాణ నుంచీ అధిక సంఖ్యలో తరలిరానున్నట్టు సమాచారం. కోస్తా జిల్లాలతో సమానంగా రాయలసీమ నుంచీ ఈసారి అధిక సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రధాన డిమాండ్లు ఈసారి సాధించుకోలేకపోతే భవిష్యత్‌లో మరెప్పుడూ సాధించలేమన్న పట్టుదల కాపు వర్గీయుల్లో కనిపిస్తోంది. కాపులను బీసీల్లో చేర్చాలంటూ సిఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసిన తరువాత అక్టోబర్ రెండోవారంలో కాపు నాయకుడు ముద్రగడ తొలి ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ముద్రగడను కలిసి మద్దతు ప్రకటించిన వారు 2లక్షల మంది. వీరిలో 90శాతం యువకులే. ఎవరెవరు కలిసారన్నది రిజిస్టర్‌లో నమోదు చేసుకుని, వారందరికీ ప్రత్యేక ఆహ్వానాలు వెళ్లాయి. నిన్నటి వరకు ముద్రగడను విమర్శించిన అధికార పార్టీ నేతలు, బహిరంగ సభకు కనిపిస్తున్న స్పందన చూసి నోరు మెదపటం లేదు. బహిరంగ సభకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నా, అనుచరులను సభకు వెళ్లాల్సిందిగా సూచిస్తున్నట్టు సమాచారం. కొంతమంది తెదేపా నేతలు పరోక్షంగా సభకు జనాన్ని పంపేందుకు సహకారం అందిస్తున్నట్టు తెలుస్తోంది.

చిత్రం... తునిలో ఏర్పాటు చేసిన సభా వేదిక