ఆంధ్రప్రదేశ్‌

కాపుల కార్చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాపులను బీసీల్లో చేరుస్తారా? లేదా? అంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం
మరోసారి ఆందోళనకు దిగారు. గత రెండు నెలలుగా కాపు వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూ పెద్దఎత్తున జన సమీకరణ ప్రయత్నాలు చేసిన ముద్రగడ, తునిలో ఆదివారం సభ నిర్వహిస్తూనే అకస్మాత్తుగా దీక్షకు పూనుకున్నారు. సర్కారుకు 24 గంటలు గడువిచ్చిన ముద్రగడ, నేటి సాయంత్రానికి కాపుల్ని బీసీల్లో చేర్చకుంటే ఆమరణ దీక్షకు దిగుతామంటూ అల్టిమేటం ఇచ్చారు. అర్థరాత్రి 10 గంటల సమయంలో రాస్తారోకో విరమిస్తున్నట్టు ప్రకటించిన ముద్రగడ, డిమాండ్లు నెరవేర్చకుంటే ఇక్కడినుంచి కదిలేదని లేదని స్పష్టం చేశారు. అంతకుముందు కాపు గర్జన బహిరంగ సభ విధ్వంసానే్న సృష్టించింది. హింసాత్మక ఘటనలతో తుని, పరిసరాలు అట్టుడికాయి. విశాఖ నుంచి బయలుదేరిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపేసి, ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టారు. దీంతో 13బోగీలు పూర్తిగా బూడిదయ్యాయి. బహిరంగ సభకు లక్షలాదిగా హాజరైన కాపు జనం, ఆకస్మాత్తుగా జాతీయ రహదారిని, రైల్వే ట్రాక్‌ను దిగ్బంధించటంతో శాంతి భద్రతల పరిస్థితి అదుపుతప్పింది. సాయంత్రం 3.15 గంటలకు ప్రారంభమైన విధ్వంసం రాత్రి వరకు యథేచ్ఛగా కొనసాగింది. ఒకదశలో రెచ్చిపోయన ఆందోళనకారులు పోలీసులపై దాడులకు దిగడంతో డిఎస్పీ, ఎస్‌ఐ, కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయ.

తుని రైల్వే స్టేషన్ ట్రాక్‌పై మంటల్లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్

రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి చుట్టుముట్టిన కాపు ఐక్య గర్జన ఆందోళనకారులు

కాపుల కార్చిచ్చు

విధ్వంసకాండతో అట్టుడికిన తుని

రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు
పోలీసు స్టేషన్, వాహనాలు, కళాశాలలు దగ్ధం
రోడ్డు, రైలు మార్గాలు దిగ్బంధం
తునిలో 144 సెక్షన్ విధింపు
డిఎస్పీ, ఎస్‌ఐలకూ గాయాలు

కాకినాడ, జనవరి 31: కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రధాన డిమాండుతో తూర్పు గోదావరి జిల్లా తునిలో ఆదివారం నిర్వహించిన కాపు గర్జన బహిరంగ సభ విధ్వంసకరంగా మారింది. హింసాత్మక ఘటనలతో అట్టుడికింది. రైలు బోగీలు, పోలీసు వాహనాలను తగులబెట్టడం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, రైల్వే ట్రాక్, జాతీయ రహదారి దిగ్బంధం వంటి ఘటనలతో తూర్పు గోదావరి జిల్లా తుని పరిసర ప్రాంతాల్లో భీతావహ వాతావరణం నెలకొంది. బహిరంగ సభగా మొదలైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుమారు రెండున్నర లక్షల మంది ఒక్కసారిగా జాతీయరహదారిపైకి, రైల్వే ట్రాక్‌పైకి చేరుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. సాయంత్రం 3.15 గంటలకు ప్రారంభమైన విధ్వంసం రాత్రి వరకు యథేచ్ఛగా కొనసాగింది. కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రధాన డిమాండుతో మాజీ మంత్రి, కాపునేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తుని సమీపంలోని వెలమకొత్తూరు వద్ద ఆదివారం ‘కాపు గర్జన’ సభ ఏర్పాటుచేసిన సంగతి విదితమే. 216వ నెంబరు జాతీయ రహదారికి సమీపంలోని సుమారు 80 ఎకరాల కొబ్బరితోటలో ఈ సభకు భారీ ఏర్పాట్లుచేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి సుమారు రెండున్నర లక్షలకు పైగా ఆ కులస్థులు బహిరంగ సభకు తరలివచ్చారు. ముద్రగడ పద్మనాభంతో పాటు మాజీ మంత్రులు చేగొండి వెంకట హరిరామజోగయ్య, కన్నా లక్ష్మీనారాయణ, ఎంఎం పళ్లంరాజు, వి హనుమంతరావు, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కంబాల గంగాభవాని తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సభ ప్రారంభమయ్యింది,. ప్రారంభంలోనే ముద్రగడ పద్మనాభం ప్రసంగిస్తూ, ఉద్యమ కార్యాచరణ ఇప్పటి నుండే ప్రారంభమవుతుందని, రోడ్లపై, రైలు పట్టాలపై కూర్చుంటేనే డిమాండ్లు పరిష్కరించుకోగలుగుతామని, ఇందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తన వెంట రావడానికి సిద్ధంగా ఉన్నారా అని సభకు హాజరైనవారిని ప్రశ్నించారు. వేదికపై ఉన్న నాయకులంతా తనను క్షమించాలని, ఉద్యమానికి ఇంతకన్నా మార్గంలేదని పేర్కొంటూ వేదిక దిగిపోయిన ముద్రగడ జాతీయ రహదారిపైకి చేరుకుని ఒక వాహనంపై కూర్చుని ఆందోళనకు దిగారు. వేదికపై ఉన్న నాయకులంతా దిగిపోయారు. సభకు హాజరైన వేలాది మంది యువకులు సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌పైకి చేరుకున్నారు. మరికొన్ని వేల మంది 216 జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీనితో జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి.అదే సమయానికి విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్లే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రావడంతో ట్రాక్‌పై ఉన్న ఆందోళనకారులు నిలిపివేయాలని నినాదాలుచేశారు. డ్రైవరు రైలును ఆపే ప్రయత్నంచేసినా, అది ఆందోళనకారులను దాటుకుని ముందుకు వెళ్లింది. దీనితో ఆందోళనకారులు రైలుపైకి రాళ్లు రువ్వారు. ఇంజను అద్దాలు పగిలి, సిబ్బందికి స్వల్ప గాయాలవ్వడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో డ్రైవరు రైలును పూర్తిగా నిలిపివేశారు. రైలు ఆగినవెంటనే ప్రయాణికులంతా రైలు దిగి పరుగులుతీశారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇంజను వెనుక నుండి రెండో బోగికి, చివరి నుండి రెండో బోగీకి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. పరిస్థితిని సమీక్షించడానికి వచ్చిన రైల్వే పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. తుని పోలీసు స్టేషన్‌తో పాటు సిఐ కార్యాలయానికీ నిప్పు పెట్టారు. అక్కడే అనేక వాహనాలను తగుల బెట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పలువురు డిఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలు గాయపడ్డారు. అనంతరం కొందరు అల్లరిమూకలు సమీపంలోని డిగ్రీ కళాశాల గ్రౌండులో నిలిపివుంచిన పోలీసు వాహనాలకు నిప్పంటించారు. ఈ ఘటనలో సుమారు 50 జీపులు, తదితర వాహనాలు దగ్ధమయ్యాయి. అనంతరం తుని రూరల్ పోలీసు స్టేషన్‌కు నిప్పుపెట్టారు. డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల గేట్లకు నిప్పంటించారు. సమీపంలోని పెట్రోలు బంకు వద్ద నిలిపివుంచిన పోలీసు వాహనాలకు సైతం అల్లరి మూకలు నిప్పుపెట్టడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.ఈ విధ్వంసకాండతో బహిరంగ సభాస్థలికి వచ్చిన వారిలో పలువురు భీతావహులై వివిధ మార్గాల గుండా బతుకుజీవుడా అనుకుంటూ బయటపడ్డారు.

ముక్కుసూటి
ముద్రగడ!

హైదరాబాద్, జనవరి 31: మొండి వాడు రాజుకంటే బలవంతుడు అనే సామెత ముద్రగడ పద్మనాభంకు అతికినట్లు సరిపోతుంది. 1978లో జనతా పార్టీ తరఫున ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలిచిన ముద్రగడ పద్మనాభం ఆ తర్వాత ఎన్టీరామారావు టిడిపి స్థాపించిన తర్వాత ఆ పార్టీలో చేరారు. డ్రైనేజీ బోర్డు చైర్మన్‌గా, మంత్రిగా పనిచేశారు. ముక్కుసూటి మనస్తత్వం, నిర్మొహమాటంగా వ్యవహరించడం ముద్రగడ వ్యక్తిత్వం. వంగవీటి మోహన్ రంగా హత్య తర్వాత టిడిపిని వీడిన ముద్రగడ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలతో కూడా విసుగు చెందిన ముద్రగడ బిజెపిలో కూడా కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో కాకినాడ ఎంపి సీటుకు టిడిపి నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. వైఎస్ హయాంలో దాదాపు రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. అనంతరం జగన్‌కు దగ్గరయ్యారు. ముద్రగడ నాలుగుసార్లు ఆమరణ దీక్ష చేశారు. ప్రత్తిపాడు మండలంలో ఉత్తరకంచి గ్రామంలో కొంత మందిని పోలీసులు వేధించారనే అభియోగంపై ఆమరణ దీక్ష చేశారు. విద్యుత్ బకాయిల విషయంలో, కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని, భూముల పంపకంపై ఆమరణ దీక్ష చేశారు. తనకు తాను హౌస్ అరెస్టు చేసుకోవడం, తాను చేసిన డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గి దిగి వచ్చేవరకు దీక్షను విరమించుకోకపోవడం ముద్రగడకే చెల్లింది. ఆషామాషీగా కాకుండా ఆమరణ దీక్షను చాలా సీరియస్‌గా చేసేవారు. గత కొంత కాలంగా అన్ని రాజకీయ పార్టీలకు దూరంగా ఉన్న ముద్రగడ కాపులకు రిజర్వేషన్ సాధనకు శ్రీకారం చుట్టారు.

హింసకు జగన్
బాధ్యుడు: యనమల

హైదరాబాద్, జనవరి 31 : తునిలో ఆదివారం జరిగిన హింస, రైలు దహనానికి వైకాపా నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, కాపునేతలు ప్రశాంతంగా ఆందోళన చేస్తుంటే వైకాపా, కాంగ్రెస్ పార్టీల నేతల ఆదేశాల మేరకు ఆ యా పార్టీల కార్యకర్తలు, సామాజిక వ్యతిరేక శక్తులతో కలిసి హింసకు పాల్పడ్డారన్నారు. సామాజిక వ్యతిరేక శక్తులు రైలు దగ్ధానికి పాల్పడటం శోచనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం చేయవచ్చచని, అందులో తప్పు లేదని యనమల పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు ప్రశాంతంగానే ఉంటారని, కాపులు శాంతికాముకులని యనమల కితాబిచ్చారు. ప్రశాంత వాతావరణంలో కాపులు ఆందోళన చేస్తుండగా, ప్రభుత్వాన్ని అపఖ్యాతికి గురి చేసేందుకు వైకాపా ఒక పథకం ప్రకారం హింసాత్మక చర్యలకు పాల్పడ్డదని ఆరోపించారు.
జగన్ క్రిమినల్ ఆలోచనలు ఉన్న వ్యక్తని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనించేందుకు ఇష్టం లేని జగన్ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. వైకాపా, కాంగ్రెస్ సంయుక్తంగా పాల్పడ్డ హింసను తీవ్రంగా ఖండిస్తున్నానని యనమల అన్నారు.

హింస దురదృష్టకరం
డిప్యూటీ సిఎం చినరాజప్ప

హైదరాబాద్, జనవరి 31: కాపు గర్జన సందర్భంగా తునిలో హింస జరగడం దురదృష్టకరమని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ ఘటనకు వైకాపా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కాపు గర్జనకు ఎలాంటి ఆటంకం ఉండకూదని ప్రభుత్వం భావించిందని, అందుకే అనుమతి కూడా ఇచ్చిందన్నారు. గర్జన కోసం ఆర్టీసి బస్సులను కూడా వేశామని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అయితే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న దురుద్దేశంతో వైకాపా నేతలు కార్యకర్తలు, ఆందోళనకారుల ముసుగులో రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారన్నారు. పోలీసులపై కూడా దాడులకు పాల్పడ్డారని చినరాజప్ప ఆరోపించారు. పోలీసులపై దాడిచేయడం శోచనీయమన్నారు. ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేసేందుకే వైకాపా దాడులకు పాల్పడ్డదని ఆరోపించారు.
వైకాపా హింసకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.

కాంగ్రెస్, వైకాపా హస్తం
మంత్రి గంటా శ్రీనివాసరావు

విశాఖపట్నం, జనవరి 31: తునిలో నిర్వహించిన కాపు గర్జనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడానికి కాంగ్రెస్, వైకాపాలే కారణమని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ముద్రగడ సభ ఏర్పాటు చేసినప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా సభను నిర్వహించుకోవాలి తప్ప, ఇలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడడం సరికాదని ఆయన అన్నారు. కాపులను బిసిలో చేర్చుతామని ఎన్నికల సమయంలో టిడిపి హామీ ఇచ్చిందని, దాన్ని అమలు చేసి తీరుతుందని గంటా అన్నారు. కాపు రిజర్వేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైకాపా, కాంగ్రెస్ పార్టీలు ఈ విధ్వంసాలకు పాల్పడ్డాయని, ఈ విషయాన్ని రాజకీయం చేయాలన్న ఆలోచనను ఆ రెండు పార్టీలూ విరమించుకోవాలని గంటా విజ్ఞప్తి చేశారు.

మీడియానూ వదలని
అల్లరిమూకలు

కవరేజి కోసం వెళ్లిన పలువురిపై దాడి
మంటల్లో ఆంధ్రభూమి ఫొటోగ్రాఫర్ కెమెరా, ల్యాప్‌టాప్
మరికొందరి వీడియో కెమెరాలూ ధ్వంసం

కాకినాడ, జనవరి 31: కాపు ఐక్య గర్జన సందర్భంగా తలెత్తిన హింసాకాండలో పలువురు మీడియా సిబ్బందిపై కూడా అల్లరిమూకలు దాడులకు తెగబడ్డాయి. తుని రైల్వే స్టేషన్ వద్ద రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టిన దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లపై విచక్షణారహితంగా దాడిచేశారు. పలువురిని విపరీతంగా కొట్టారు. వారి కెమెరాలు, ల్యాప్‌టాప్‌లను ధ్వంసంచేసి, మంటల్లో పారేశారు. ఆంధ్రభూమి ఫొటోగ్రాఫర్‌పై దాడిచేయడమేకాక, కెమెరా, ల్యాప్‌టాప్‌ను ధ్వంసంచేసి, మంటల్లో పారేశారు. అలాగే మరికొందరు ఛానెళ్ల వీడియోగ్రాఫర్లపై సైతం దాడిచేసి, వారి కెమెరాలను ధ్వంసంచేశారు. దీంతో విలేఖర్లు, కెమెరామెన్లు ప్రాణభయంతో పరుగులు తీశారు. అదే ప్రాంతంలో బందోబస్తులో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందిపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. వేలాదిగా ఆందోళనకారులు దాడులకు పాల్పడడంతో పోలీసులు సైతం బతుకు జీవుడా అంటూ అక్కడనుండి పరుగులు తీశారు. కాపు ఐక్యగర్జన బహిరంగ సభాస్థలి పరిసరాల్లో ఎటుచూసినా హింసాత్మక వాతావరణం కనిపించింది. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకునే అవకాశం లేకపోవడం వల్ల మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతూనే ఉన్నాయి. పరిస్థితి పూర్తిగా అదుపుతప్పడంతో రాష్ట్ర డిజిపి ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ మూడు జిల్లాలకు చెందిన పోలీసు సిబ్బందిని యుద్ధప్రాతిపదికన తుని పట్టణానికి చేరుకుని పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావలసిందిగా ఆదేశించారు. దీంతో ప్రత్యేక సాయుధ దళాలు పొరుగు జిల్లాల నుండి తునికి బయల్దేరాయ. తునిలో 144 సెక్షన్ విధించడంతోపాటు కర్ఫ్యూను ఏర్పాటుచేయడం ద్వారా సాధారణ పరిస్థితిని తీసుకురావాలని అధికారులు యత్నిస్తున్నారు. కాగా ఊహించని విధంగా ఉద్యమం హింసాత్మకంగా మారడంతో వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రజలు కూడా బహిరంగ సభాస్థలి నుండి భయంతో వెనుతిరిగారు.