రాష్ట్రీయం

‘లొట్టే’తో చెట్టపట్టాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 4: విభిన్న వ్యాపార రంగాలను విజయవంతంగా నిర్వహిస్తున్న దక్షిణ కొరియాకు చెందిన ‘లొట్టే కార్పొరేషన్’.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు సంయుక్త కార్యసాధన బృందం ఏర్పా టు కానుంది. లొట్టే కార్పొరేషన్ ప్రెసిడెంట్, సీఈవో వాన్గ్ కాగ్‌జు దక్షిణ కొరియా పర్యటనలో
వున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సోమవారం భేటీ అయ్యారు. భారతీయ సంస్కృతిని అమితంగా ఆరాధించే తాను 1998 నుంచి ఇప్పటివరకు 20 సార్లకు పైగా భారత్‌లో పర్యటించినట్టు వాన్గ్ కాగ్‌జు ముఖ్యమంత్రికి తెలిపారు. తాము ప్రపంచంలో 90కు పైగా బిజినెస్ యూనిట్లను లాజిస్టిక్స్ కోల్డ్ చెయిన్, హోటళ్లు, రెస్టారెంట్లు, గోదాములు, వినోదం, గోల్ఫ్ కోర్సులు, రియల్ ఎస్టేట్ రంగాల్లో నెలకొల్పినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వాంగ్‌కు ముఖ్యమంత్రి వివరించారు. అమరావతి అభివృద్ధికి ఉన్న సానుకూల అంశాలు, వ్యవసాయం, ఉద్యానరంగాల్లో సాధిస్తున్న ప్రగతిని వివరించారు. విస్తారమైన మార్కెట్, శాంతియుత వాతావరణం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏపీ సొంతమని అన్నారు.
దాసన్ నెట్‌వర్క్‌కు ఆహ్వానం
తొలుత కియా అనుబంధ సంస్థల ప్రతినిధులతో సమావేశం ముగిసిన అనంతరం దాసన్ నెట్‌వర్క్ చైర్మన్ నామ్ మెయిన్ వూతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. భారీ పెట్టుబడులతో ఏపీకి రావాలని నామ్‌ను కోరారు. రాష్ట్రంలో ప్రతి ఇంటినీ ఫైబర్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తున్నామని, ప్రజలకు నీటి భద్రత, ఆహార భద్రత కల్పించి నిరంతర విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. తాము భారత్‌లో తయారీ రంగంలో ప్రవేశించాలని భావిస్తున్నట్టు, అందుకు గల అవకాశాలపై దృష్టి పెడుతున్నామని ముఖ్యమంత్రికి నామ్ వివరించారు. ఫిబ్రవరిలో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని నామ్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
సాఫ్ట్‌వేర్, ఐవోటీ, ఈఎంసీ ఇంజనీరింగ్, ఆటో పార్ట్స్ సెక్టార్లలో గ్లోబల్ నెట్‌వర్క్ సొల్యూషన్ ప్రొవైడర్ అయిన ‘దాసన్ నెట్‌వర్క్’ ఇప్పటికే ఏపీ స్టేట్ ఫైబర్ నెట్‌వర్క్ లిమిటెడ్‌తో కలిసి పని చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 1800 మంది ఉద్యోగులు వున్న ‘దాసన్’ కొరియా ప్రధాన కేంద్రంగా అమెరికా, వియత్నాం, చైనా, జపాన్, తైవాన్, ఫ్రాన్స్, భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
త్వరలో 100 గిగావాట్ల సౌర విద్యుత్కేంద్రం
2022 కల్లా భారత్‌లో 100 గిగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పేందుకు యోచిస్తున్నామని జుసంగ్ ఇంజినీరింగ్ సీఈవో వాన్గ్ చుల్‌జు పేర్కొనగా ఏపీలో ఈ యూనిట్ నెలకొల్పాలని ముఖ్యమంత్రి కోరారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా సహకరిస్తామని, భాగస్వామ్య సదస్సుకు వచ్చి అనుకూలతలను తెలుసుకోవాలని సూచించారు. నవ శకం ఎల్‌ఈడీ బల్బులను అభివృద్ధి చేస్తున్నామని, ఇది పరిశోధన దశలో వుందని చుల్‌జు అన్నారు. అయితే విద్యుత్ ఆదా కోసం భారతదేశంలో పెద్దఎత్తున ఎల్‌ఈడీ బల్బులను వినియోగిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
లైటింగ్, ఎక్విప్‌మెంట్, సోలార్ సెల్స్, ఎల్‌సీడీ, ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించిన సాంకేతికతలో ప్రఖ్యాతిగాంచిన జుసంగ్ టెక్నాలజీ, ఎస్‌కే హైనిక్స్, ఎల్‌సీ, శామ్‌సంగ్ వంటి దిగ్గజ కంపెనీలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 78 సంస్థలకు తమ ఉత్పత్తులను అందిస్తోంది. ఆసియా, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో 15 సబ్సిడరీ, స్థానిక కార్యాలయాలను నిర్వహిస్తోంది. జుసంగ్ ఏడాదికి 250 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.
రాష్ట్రానికి రానున్న ఐరిటెక్ సీఈవో
ఐరిస్ ఆధారిత బయోమెట్రిక్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ ఐరిటెక్ కంపెనీ సీఈవో కిమ్ డెహోన్ ఈ నెల 10 తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు వస్తానని ముఖ్యమంత్రికి ముఖాముఖి సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో సెన్సర్లు, డ్రోన్లు, ఐవోటీ, క్లౌడ్ వంటి అనేక సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టామని కిమ్‌కు ముఖ్యమంత్రి వివరించారు. తాజాగా భూధార్ పేరుతో రాష్ట్రంలోని భూములకు యూనిక్ ఐడీని కేటాయించే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇప్పటికే ఐరిటెక్ కలిసి పనిచేస్తోంది.

కోకమ్ గ్రూప్ సీఈవోతో భేటీ
ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, లిథియమ్ పాలిమర్స్ బ్యాటరీస్‌లో అగ్రగామి కోకమ్ గ్రూపు జీవితకాలం పాటు పనిచేసే అత్యాధునిక బ్యాటరీల తయారీపై పరిశోధనలు చేస్తున్నట్టు ఆ సంస్థ సీఈవో జేజే హాంగ్ ముఖ్యమంత్రితో జరిపిన సమావేశంలో తెలిపారు. ఈ బ్యాటరీ ఆవిష్కరణ జరిగితే అతి పెద్ద మలుపు కాగలదని ముఖ్యమంత్రి అన్నారు. భారతదేశంలో తనకున్న సంబంధాల గురించి హాంగ్ ముఖ్యమంత్రికి వివరించారు. కొరియా భాషలో 10 శాతం పదాలు సంస్కృతం నుంచే వచ్చాయని అన్నారు. ముఖ్యమంత్రి బృందంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, వాణిజ్యం, పరిశ్రమలు, ఆహారశుద్ధి శాఖల మంత్రి అమరనాథ్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోకియా రాజ్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్, ఏపీఐఐసీ ఎండీ అహ్మద్‌బాబు ఉన్నారు.