రాష్ట్రీయం

ఆత్మీయం.. ఆతిథ్యం... ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: ప్రపంచ తెలుగు మహాసభలను నిబద్ధత, క్రమశిక్షణ, పక్కా ప్రణాళికతో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాసభలను ఒక పండగలా నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తుండటంతో ఎక్కడా లోటుపాట్లు లేకుండా నిర్వహకులు, అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభల కోసం 50 కోట్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పటికే 20 కోట్లు విడుదల చేసింది. ఖర్చును బట్టి మిగతా నిధులు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ సిద్ధంగా ఉంది. నిధులకు ఎలాంటి ఆటంకం లేదని తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి ఆదివారం ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు. 2017 డిసెంబర్ 15 నుండి 19 వరకు జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో మొత్తం 11 వేల మంది ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ఆహ్వానితులు, కవులు, రచయితలు, కళాకారులు, అధికారులు హాజరవుతున్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాలతో పాటు, తోటి తెలుగు రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్, స్వంత రాష్టమ్రైన తెలంగాణ నుండి దాదాపు 7,500 మంది ప్రతినిధులుగా పేర్లను నమోదు చేసుకున్నారు. రెండు వేల మంది కవులు, రచయితలు, కళాకారులు హాజరవుతున్నారు. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు మరో రెండు వేల మంది వరకు ఉంటారు. తెలంగాణతో పాటు జాతీయ స్థాయి మీడియా ప్రతినిధులకు తెలుగు మహాసభలు ప్రత్యేక పాసులు జారీ చేస్తోంది. వీరు కాకుండా సాధారణ ప్రజలు రోజూ 20 వేల నుండి 30 వేల మంది వరకు హాజరవుతారని నిర్వహకులు అంచనావేశారు.
ఎల్‌బి స్టేడియం, తెలుగు లలిత
కళాతోరణంలలో జరిగే కార్యక్రమాలతో పాటు రవీంద్రభారతి, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం తదితర ఆడిటోరియంలను ప్రపంచ తెలుగు మహాసభల కోసం వినియోగిస్తున్నారు.
మహాసభల సందర్భంగా వివిధ వేదికల్లో నిర్వహించే కార్యక్రమాల్లో ప్రతినిధులు ఎక్కడైనా పాల్గొనేందుకు వీలు కల్పించారు. సాహిత్య, సాంస్కృతిక తదితర కార్యక్రమాలకు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రధాన కార్యక్రమాలు జరిగే ఎల్‌బి స్టేడియంలో విశాలమైన వేదిక ఏర్పాటవుతోంది. ఈ స్టేడియంలోకి వచ్చేందుకు ఉన్న వేర్వేరు గేట్ల వద్ద తోరణాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఉపవేదికల గేట్ల వద్ద కూడా తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని అన్ని ప్రధాన రహదారుల కూడళ్లు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో భారీ తోరణాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఫోటోలతో పాటు తెలంగాణ కవులు, రచయితలు, చరిత్రకారులు, వివిధ రంగాల్లో సుప్రసిద్ధమైన వారి ఫోటోలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
కమ్మని వంటకాలు..
తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా ఉండే రకరకాల వంటలను ప్రతినిధులకు వడ్డిస్తారు. ఇందులో బిర్యానీ, పిండి వంటలు, రాగిసంకటి, అంబలి, జొన్న, సజ్జరొట్టెలు, రకరాకాల చార్లు, పచ్చళ్లు ఉంటాయి. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్‌కు ఆహార విభాగాన్ని అప్పగించారు. ఎల్‌బి స్టేడియం వెలుపల సాధారణ ప్రజలకోసం తక్కువ ధరలకే తెలంగాణ వంటలతో 50 కిపైగా ఆహార స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతినిధులు బస చేసేందుకు వివిధ హోటళ్లను అద్దెప్రాతిపదికపై తీసుకున్నారు. ఎన్‌ఆర్‌ఐలు స్టార్ హోటళ్లలో బస కావాలంటే తక్కువ చార్జీలతో గదులు ఇస్తారు. ఇతర ప్రతినిధులందిరకీ సౌకర్యవంతమైన గదులు ఇస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తెలంగాణ టూరిజం శాఖకు అప్పగించారు.
ప్రతినిధులకు ఇచ్చే కిట్లలో మందార మకరందాలు, వాగ్భూషణ, భూషణం పుస్తకాలతో పాటు తెలుగు సంవత్సరాలు, తెలుగు నెలలు, రుతువులు, కార్తెలతో కూడిన మరొక పుస్తకం కూడా ఉంటుంది. విదేశాల నుండి వస్తున్న ప్రముఖుల్లో డాక్టర్ అప్సర్, నారాయణస్వామి వెంకటయోగి, రవి వీరెల్లి, కనె్నగంటి చంద్ర, వింజమూరి రాగసుధ, గాయకురాలు స్వాతిరెడ్డి, కవి, రచయిత సృజన్‌రెడ్డి,ప్రొఫెసర్ ప్రభావతి తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్న కవులు, రచయితల్లో పాపినేని శివశంకర్, కొప్పర్తి,కత్తుల కిశోర్‌బాబు, తబాబ్ ఓబుల్‌రెడ్డి,శిఖామణి, ఎండ్లూరి సుధాకర్, బండ్ల మాధవరావు, పెనుగొండ లక్ష్మీనారాయణ, కాశీపట్నం రామారావు, కాట్రగడ్డ దయానంద్, వల్లూరి శివప్రసాద్, అట్టాడ అప్పల నాయుడు, మధురాంతకం నరేంద్ర తదితరులు హాజరవుతామని సమాచారం అందించారు. తెలుగు యూనివర్సిటీ మ్యూజియం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

చిత్రం..మహాసభల ఏర్పాట్లలో భాగంగా నన్నయ చిత్రంతో
హైటెక్ సిటీ వద్ద ఏర్పాటు చేసిన పెద్ద కటౌట్