ఆంధ్రప్రదేశ్‌

రైల్వేశాఖకు రూ.100 కోట్ల నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 2: తునిలో కాపు ఐక్య గర్జన నేపథ్యంలో జరిగిన విధ్వంసంలో రైల్వే శాఖకు సుమారు 100 కోట్ల రూపాయల మేర ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలిసింది. రైల్వే శాఖకు చెందిన ప్రత్యేక అధికారుల బృందం అగ్నికి ఆహుతైన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు సహా విధ్వంసానికి గురైన ప్రాంతాన్ని పరిశీలించింది. తుని సమీపంలోని వెలమకొత్తూరు వద్ద రైల్వేట్రాక్, సిగ్నలింగ్ వ్యవస్థ, కేబుల్, విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లగా, రైళ్ళ రాకపోకల నిలుపుదల, వివిధ రైల్వే స్టేషన్స్‌లో ప్రయాణికులకు ప్రయాణపు ఛార్జీలను వాపసు చేయటం, షెడ్యూల్ ప్రకారం నడవాల్సిన రైళ్ళను నిలిపివేత తదితర కారణాలతో సుమారు 100 కోట్లపైగా నష్టం వాటిల్లినట్టు సమాచారం. నష్టం అంచనా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. కాగా రైల్వే శాఖ నమోదు చేసే కేసులన్నిటిపైనా హైదరాబాద్‌లోని రైల్వే కోర్టులోనే విచారణ జరుగుతుందని, కేసుల్లో ఇరుక్కున్న నిందితులు హైదరాబాద్ కోర్టుకే వెళ్ళాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఆయా కేసుల ప్రాధాన్యతల రీత్యా అవసరమైతే ఢిల్లీకి కూడా నిందితులు వెళ్ళాల్సి ఉంటుందని భావిస్తున్నారు. కేంద్రం కేసుల్లో రాష్ట్ర పోలీస్ శాఖ జోక్యం ఉండదని స్పష్టం చేస్తున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జిఆర్‌టి) అధికారులు కేసులు నమోదు చేసే పనిలో తలమునకలయ్యారు.

ఐఎఫ్‌ఆర్‌లో అరకు కాఫీ స్టాల్
విశాఖపట్నం, ఫిబ్రవరి 2: విశాఖలో ఈ నెల 4 నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) సందర్భంగా అరకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎయు గ్రౌండ్స్‌లోని ఐఎఫ్‌ఆర్ విలేజ్‌లో అరకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఎండి రవిప్రకాష్ తెలిపారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ అరకువేలీ కాఫీని రుచి చూడాలని భావించటంతో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి జిసిసికి సమాచారం వచ్చింది. ప్రత్యేక ఆదేశాల మేరకు జిసిసి ఉన్నతాధికారులు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఐఎఫ్‌ఆర్ విలేజ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 4వ తేదీ సాయంత్రం ప్రారంభిస్తారు. 5వ తేదీ రాత్రి విశాఖ చేరుకునే ప్రధాని 6వ తేదీ సాయంత్రం ఐఎఫ్‌ఆర్ విలేజ్‌ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా అరకు కాఫీని రుచి చూస్తారు. అదే విధంగా ఐఎఫ్‌ఆర్‌కు తరలివచ్చే వివిధ దేశాల ప్రతినిధులకు కూడా అరకు కాఫీని రుచి చూపించనున్నారు. జిసిసి, పాడేరు ఐటిడిఏ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ ఏజెన్సీలో పాడేరు కాఫీ ప్రాజెక్ట్‌ను ఇటీవల ప్రారంభించారు. పదేళ్ళపాటు అమలయ్యే ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా గిరిజన రైతులు పండించిన కాఫీ గింజలను కొనుగోలు చేయడానికి ప్రతి గ్రామంలోనూ సేకరణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

సత్తా చాటనున్న ఐఎఫ్‌ఆర్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 2: భాతర నౌకాదళం తన యుద్ధ తంత్రాన్ని, వ్యూహాలను మార్చుకుంటోందా.. శత్రు దేశాలకు తమ సత్తా చూపేందుకు సిద్ధపడుతోందా.. మనని నమ్ముకుని ఉన్న దేశాలకు మేం ఉన్నామంటూ భరోసా ఇవ్వనుందా.. అన్నింటికీ మించి, హిందూ మహా సముద్రంపై తన ఆధిపత్యాన్ని చాటి చెప్పాలని చూస్తోందా.. అవును. ఇదే ఇప్పుడు భారత నౌకాదళం తక్షణ కర్తవ్యం. పశ్చిమ తీరంలో నౌకాదళ పాటవాన్ని ప్రదర్శించి, శత్రు దేశాలను ఎక్కడికక్కడ నిలువరిస్తున్న భారత నౌకాదళం ఉన్నట్టుండి తూర్పు తీరంపై దృష్టి సారించింది. గతంలో మనకు ఉన్న శత్రుదేశం పాకిస్తానే. కానీ ఇప్పుడు చైనా కూడా మన దేశంపై కాలు దువ్వుతోంది. మన దాయాది అయిన పాకిస్తాన్‌కు వెన్నంటి ఉండి, అక్కడ తన స్థావరాలను విస్తరించుకుంటోంది. ఇటువంటి తరుణంలో తూర్పు తీరాన్ని పటిష్ఠం చేయాల్సిన అవసరం భారత నౌకాదళానికి ఏర్పడింది. గతంలో పాకిస్తాన్‌ను శత్రువుగా భావించిన మన భారత నౌకాదళం, ఆ దేశాన్ని నిలువరించేందుకు పశ్చిమ తీరాన్ని పటిష్ఠం చేసింది. ఇప్పుడు పశ్చిమతీరం శత్రువులకు దుర్భేద్యంగా మారింది. తాజాగా మన దేశంపై ఆధిపత్యం చెలాయించడానికి చైనా అడుగులు ముందుకు వేస్తున్న నేపథ్యంలో, ఆ దేశాన్ని నిలువరించాలంటే, హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం సాధించాలి. అందులో భాగంగానే తూర్పు తీరాన్ని బలోపేతం చేయడానికి భారత నౌకాదళం సన్నాహాలు ప్రారంభించింది. భారత నౌకాదళ పాటవాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడం 1953 నుంచి ప్రారంభమైంది. భారత తొలి రాష్టప్రతి బాబూ రాజేంద్రప్రసాద్ భారత నౌకాదళ సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకూ భారత దేశంలో 10 నౌకాదళ సమీక్షలు జరిగాయి. ఇందులో తొమ్మిది సమీక్షలు పశ్చిమ తీరంలోనే జరిగాయి. స్వాతంత్య్రం వచ్చిన 68 ఏళ్లలో జరిగిన నౌకాదళ సమీక్షల్లో తొమ్మిది సమీక్షలు పశ్చిమ తీరంలోనే జరిగాయి.

మార్చిలో రైతులకు
స్థలాల కేటాయింపు
వచ్చేనెల 15న ల్యాండ్ పూలింగ్ మాస్టర్‌ప్లాన్ విడుదల

ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఫిబ్రవరి 2: వచ్చే నెల 15న ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన మాస్టర్‌ప్లాన్ విడుదల అవుతుందని మంత్రులు పి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. తుళ్లూరు మండలంలోని దొండపాడు, బోరుపాలెంలో మంగళవారం మంత్రులు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ పర్యటించారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి భూసమీకరణ ద్వారా సమీకరించిన పొలాలకు సంబంధించిన వివరాలతో ప్లాన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రకటన వెలువడిన నాటి నుంచి నెలరోజులు రైతుల అభ్యంతరాలు స్వీకరించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. భూసమీకరణ చట్టంలో పొందుపరచిన విధంగా మాస్టర్‌ప్లాన్ ముసాయిదాపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు నెలరోజులు గడువు ఇచ్చామన్నారు. అదే తరహాలో ల్యాండ్ పూలింగ్ మాస్టర్‌ప్లాన్‌కు కూడా నెలరోజుల వ్యవధి ఉంటుందన్నారు. అక్కడి నుంచి ప్రభుత్వం ప్రకటించే ప్రణాళికలకు గడువు ఉండదన్నారు. మాస్టర్‌ప్లాన్‌పై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, సింగపూర్ ప్రతినిధులకు మార్పులు, చేర్పులకు సంబంధించిన సూచనలు చేసినట్లు మంత్రులు పుల్లారావు, నారాయణ తెలిపారు. రైతులు కోరిన విధంగా మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేస్తున్నామన్నారు. గ్రామకంఠాలపై కూడా జాయింట్ కలెక్టర్ రూపొందించిన జాబితాను విడుదల చేస్తామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా న్యాయం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే రైతులు నేరుగా తమ సమస్యలను ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీ్ధర్‌ను సంప్రదించి పరిష్కరించుకోవాల్సిందిగా సూచించారు. అనంతరం బోరుపాలెం రైతులతో మంత్రులు సమావేశమయ్యారు. ఈసందర్భంగా రైతుల గ్రామకంఠాలపై ప్రశ్నించగా రెవెన్యూ, సిఆర్‌డిఎ అధికారుల సమన్వయ లోపం వల్ల తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీ్ధర్‌కు సిఆర్‌డిఎ ఎక్స్ అఫిషియో అదనపు కమిషనర్ అధికారాలు ఇస్తున్నామని వెల్లడించారు. అందువల్ల నేరుగా తమ సమస్యలను జెసి దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు. 15లోఫు రైతులు తమ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలన్నారు.