రాష్ట్రీయం

అంబేద్కర్ బాటలో తెదేపా అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 26: తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ బాటలో అడుగులు వేస్తోందని, ఆయన ఆశయాల అమలుకు అహరహం కృషి చేసే పార్టీ తెలుగుదేశమేనని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు చెప్పారు. దావోస్ పర్యటన నుంచి వచ్చిన చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన దళిత తేజం- తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ దళితుల కోసం కాంగ్రెస్‌గానీ, వైఎస్ రాజశేఖరరెడ్డి గానీ చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. అంబేద్కర్‌ను కాంగ్రెస్ విస్మరిస్తే టీడీపీనే ఆయన గౌరవాన్ని జాతీయస్థాయిలో కాపాడిందన్నారు. కాంగ్రెస్ పాలకులు చివరకు ఎస్సీ కార్పొరేషన్‌ను కూడా నిర్వీర్యం చేసి, దానిని రద్దుచేసే వరకూ వెళ్లారని, ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ నాయకులు దళితుల గురించి మాట్లాడటం వింతగా ఉందని ఎద్దేవా చేశారు. లోక్‌సభ, అసెంబ్లీ స్పీకర్లుగా దళితులను నియమించిన ఘనత తమదేనని గుర్తు చేశారు. ‘నేను అందరినీ చేయూతనిస్తా. అన్ని విధాలుగా ఆదుకుంటా. దళితులు అన్ని విధాలుగా పైకి వచ్చేవరకూ వారికి దన్నుగా నిలుస్తా. ఈ కార్యక్రమంతో మీరు దళితుల వద్దకు వెళ్లి మనం చేసిన పనులు చెప్పండి. దీనిని స్ఫూర్తిగా తీసుకుని దళితులలో చైతన్యం తీసుకువచ్చే బాధ్యత మీదే’నని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జనాభా దామాషాన రిజర్వేషన్లు ఇస్తే, తాను ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించానని, దళితుల సంక్షేమంలో తమకు మరొకరు పాఠాలు నేర్పవలసిన పనిలేదని వ్యాఖ్యానించారు.
‘‘ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. ఈ రోజు నా జన్మ ధన్యమయ్యింది, రిపబ్లిక్ డే రోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ ఒకటే చెప్పారు. బడుగు, బలహీన వర్గాల వారే పార్టీకి పునాది అని. నాకు అంబేద్కర్ స్ఫూర్తి, జగ్జీవన్‌రావుతో కలిసి పనిచేసింది మన నాయకుడు ఎన్టీఆర్. అంతకు ముందు ఎవ్వరూ కూడా అంబేద్కర్‌ను, జగ్జీవన్‌రావుని
గౌరవించలేదు. నాయకులకు సరైన గుర్తింపు కూడా ఇవ్వలేదు. జగ్జీవన్ రావుకి భారతరత్న ఇచ్చింది ఎన్డీయే ప్రభుత్వం తప్ప కాంగ్రెస్ కాదు. బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌ను చేశాం. మొట్టమొదటిసారి ఆర్థిక శాఖ మంత్రిగా మహేంద్రనాథ్‌ని తెలుగుదేశం పెట్టింది. షెడ్యూల్డ్ కులాలకు న్యాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. షెడ్యూల్డు కులాల కోసం నిరంతరం శ్రమిస్తాం. దళితులు ఐక్యంగా ఉండాలి’’ అని పిలుపునిచ్చారు.
చంద్రన్న పెళ్లి కానుక ద్వారా రూ.40 వేల సహాయం చేస్తాం. బ్యాక్‌లాగ్ పోస్టులన్నీ పూర్తి చేశాం. రూ.9,500 కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ తీసుకొచ్చాం. దళిత పిల్లల పోటీ పరీక్షలకు సహాయం చేస్తాం అన్నారు. ప్రతి నియోజకవర్గానికి 20 మంది చొప్పున ప్రతినిధులు ఉంటారని, అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్సీ పిల్లలను పారిశ్రామిక వేత్తలుగా చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ఎక్కడా అన్యాయం జరగదని హామీ ఇస్తున్నానన్నారు.
దళితుల కోసం అప్పటి ప్రభుత్వం భూములు కొనుగోలు చేసి వారికి పంపిణీ చేయలేదు. కానీ 10 సంవత్సరాల తరువాత ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఖర్చు చేసి భూములు కొనుగోలు చేయాలని నిర్ణయించిందన్నారు. దేశంలోనే దళితులకు 75 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. సమావేశంలో మంత్రి నక్కా ఆనందబాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, జూపూడి ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, ఎమ్మెల్యే తాడికొండ శ్రావణ్‌కుమార్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..దళిత తేజం- తెలుగుదేశం కార్యక్రమంలో సీఎం చంద్రబాబును సత్కరిస్తున్న దళిత నేతలు