రాష్ట్రీయం

రహదారి రక్తసిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లజర్ల, జనవరి 26: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అయిదుగురు మృతిచెందారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాంగ్ రూటులో వచ్చిన లారీ బస్సు మధ్య భాగం నుండి చీల్చుకుంటూ దూసుకువెళ్లడంతో ఆ భాగంలో బస్సు తీవ్రంగా ధ్వంసమయ్యింది. దీనితో ఆ సీట్లలో కూర్చున్న వారంతా మృత్యువాతపడ్డారు. కొందరు మృతుల శరీర భాగాలు తునాతునకలై ఘటనాస్థలంలో చెల్లాచెదురుగా పడ్డాయంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుండి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు వెళుతున్న కొవ్వూరు డిపో ఆర్టీసీ బస్సు అనంతపల్లి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న సిమెంటు లోడు లారీ బస్సును చీల్చుకుంటూ దూసుకుపోయింది. బస్సును ఢీకొన్న లారీ అంతటితో ఆగక, ముందుకు దూసుకుపోయి చెట్టును ఢీకొని ఆగింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన కాపుశెట్టి జ్యోతి (37), ఆమె కుమార్తె అఖిల సత్య (12), కుమారుడు శివసాయి (13), తల్లి గేలం లక్ష్మి (50) తోపాటు ఒడిస్సాకు చెందిన పల్లా సావిత్రమ్మ అనే మరో వృద్ధురాలు మృతిచెందింది. బస్సు డ్రైవర్ శేఖర్, కండక్టర్ కృష్ణకుమారి, ప్రయాణీకులు మరపట్ల గంగారత్నం, పెద్దిరెడ్డి భవానీ, మద్దు లూహిత తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఆర్టీసీ ఈడీ ఎన్ వెంకటేశ్వరరావు, ఆర్‌ఎం ధనుంజయరావు, తాడేపల్లిగూడెం రూరల్ సీఐ రాజశేఖర్, నల్లజర్ల ఎస్సై చంద్రశేఖర్ సంఘటనా స్థలాన్ని సందర్శించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించడంలో దగ్గరుండి పర్యవేక్షించారు. ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదుజేసి దర్యాప్తుచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఇదే గ్రామం వద్ద నానో కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంగతి విదితమే.

చిత్రం..ప్రమాదంలో ధ్వంసమైన బస్సు